Abhijeet Dipke : ఎన్నికల సంఘం చేపట్టిన సర్ రద్దు చేయాలని, అలాగే జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో బెంగళూరులో సీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన జరిగింది. ఈ ఆందోళనలో సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేతోపాటు నటుడు ప్రకాష్ రాజ్, వివాదాస్పద యూట్యూబర్ ధృవ్ రాథీ పాల్గొన్నారు. పీపుల్స్ ట్రిబ్యునల్ పేరిట ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వన్.. టు.. త్రి.. ఫోర్.. నరేంద్ర మోదీ వోట్ చోర్ అంటూ నినాదాలు చేశారు.
సర్ పేరిట కర్ణాటకలో భారీగా ఓట్లు తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో సర్ ప్రక్రియ ద్వారా ఓట్లు పోగొట్టుకున్న చాలా మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. సర్ ద్వారా ప్రతిపక్షాల ఓట్లు తొలగిస్తున్నారని దీప్కే సహా ఆందోళనకారులు ఆరోపించారు. ఈ ఆందోళన తర్వాత చప్పల్ ప్రొటెస్ట్ పేరిట నిరసన తెలుపుతామని వారు వెల్లడించారు. మరోవైపు సర్ ప్రక్రియ, ఎన్నికల సంఘం పనితీరులో అవకతవకలు వంటి అంశాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో కూడా నిరసన చేపట్టేందుకు సీజేపీ సిద్ధమైంది. ఈ అంశంపై ఇంతకుముందు ముంబైలో, ఇప్పుడు బెంగళూరులో ఆందోళన చేసిన సీజేపీ.. ఇప్పుడు ఢిల్లీలో నిరసనకు రెడీ అవుతోంది.
అక్టోబర్ 10, శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తామని సీజేపీ అగ్రనేత సౌరవ్ దాస్ ప్రకటించారు. ఈ ఆందోళనలో బిహార్ యువత పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బిహార్ ప్రజలు తరలివస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. తమ ఆందోళనపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించామని వెల్లడించారు. గతంలో ఎన్నికల సందర్భంగా బిహార్‌కు ప్రత్యేక రైళ్లు వేశారని, గుజరాత్ నుంచి ఓటర్లు తరలి వచ్చారని.. అదే స్థాయిలో ఇప్పుడు బిహార్ నుంచి యువత ఢిల్లీ తరలిరావాలని సౌరవ్ దాస్ కోరారు.