Tamil Nadu Doctors : తమిళనాడుకు చెందిన వైద్యులు అద్భుతం చేశారు. పొరపాటున సూది మింగిన ఓ బాలిక ఊపిరితిత్తుల్లో నుంచి ఆ సూదిని తొలగించి కాపాడారు. సర్జరీ లేకుండా రికార్డు టైమ్‌లో సూదిని బయటికి తీశారు. తమిళనాడులోని తంజావూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కుంభకోణానికి చెందిన ఓ 14 ఏళ్ల బాలిక దుస్తులు వేసుకుంటూ పొరపాటున సూది మింగేసింది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో తల్లిదండ్రులు అంబులెన్స్‌లో తంజావూరులోని శ్రీకామాక్షి మెడికల్ సెంటర్ ఆస్పత్రికి తరలించారు.
అన్ని పరీక్షలు చేసిన వైద్యులు ఆ సూచి ఊపిరితిత్తుల్లో ఇరుక్కుందని గుర్తించారు. ఊపిరితిత్తుల వైద్య నిపుణుడు డాక్టర్ అరుణ్ నేతృత్వంలోని బృందం.. ఎలాంటి సర్జరీ లేకుండా బ్రాంకోస్కొపీ ద్వారా కేవలం 3.23 నిమిషాల్లోనే 4 సెంటీమీటర్ల పొడవున్న ఆ సూదిని తొలగించింది.