Delhi Fire Accident | ఢిల్లీలోని రోహిణి సెక్టార్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బుద్ధవిహార్ పరిధిలో స్లమ్ ఏరియాలో మంటలు చెలరేగడంతో గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భార్యాభర్తలు సహా మూడేళ్ల చిన్నారి అగ్నికి ఆహుతి అవ్వడం స్థానికంగా అందర్నీ కలిచివేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్ధవిహార్ పరిధిలోని స్లమ్ ఏరియాలో సుమారు 400 చదరపు గజాల ప్లాస్టిక్ స్క్రాప్‌ను నిల్వ ఉంచారు. దాని చుట్టే పలు గుడిసెలను నిర్మించుకున్నారు. అయితే బుధవారం తెల్లవారుజామున 1.25 గంటల ప్రాంతంలో స్క్రాప్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన గుడిసెల్లోని కుటుంబాలు మంటలు అప్రమత్తమయ్యేలోపే మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇరుకైన వీధుల కారణంగా అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, గుడిసెలకు మంటలు అంటుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో భద్రతా ప్రమానాలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.