న్యూఢిల్లీ: ఢిల్లీ(Delhi)లో 24 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నడుస్తున్న కారులోనే ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే వేధింపులకు పాల్పడిన ఆ వ్యక్తి వీడియోను ఆమె తన మొబైల్ ఫోన్‌తో షూట్ చేసింది. నిందితుడు తనకు పరిచయం ఉన్న వ్యక్తే అని ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నది. మోమో తిందామని తనను కారులో తీసుకెళ్లాడని, ఆ తర్వాత సీఎన్జీ కోసం అని చెప్పి కారును దారి మళ్లించాడని, ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె పేర్కొన్నది. అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ, లైంగిక వాంఛ తీర్చాలని డిమాండ్ చేసినట్లు చెప్పిందామె.
అనుచిత రీతిలో తనపై చేయి వేశాడని, కారు నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నాడని ఆమె పేర్కొన్నది. దాడికి పాల్పడుతున్న సమయంలో తీసిన మొబైల్ ఫోన్ వీడియోను ఆమె పోలీసులకు అప్పగించింది. ఫిర్యాదు ఆధారంగా మందవాలీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విడిచి పెట్టమని కోరుతూ ఆ మహిళ వేడుకుంటున్నట్లు వీడియోలో ఉన్నది. కానీ నిందిత వ్యక్తి అసభ్యకర రీతిలో లైంగిక వాంఛ తీర్చాలని కోరాడు.
ఓ దశలో ఆమె అతన్ని నెట్టేసింది. కారులో నుంచి బయటకు దూకేందుకు కూడా ప్రయత్నించింది. నువ్వు నన్ను టచ్ చేస్తే, కారు నుంచి జంప్ చేస్తా, చనిపోతా అని కూడా ఆ మహిళ బెదిరించింది, నిన్ను తాకనివ్వను అని ఆమె వీడియోలో అరుస్తూ ఉన్నది. కేవలం రెండు నిమిషాలే అంటూ నిందిత వ్యక్తి కూడా మహిళను బలవంతం చేయబోయినట్లు వీడియోలో ఉంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు.