Instagram | ఇన్స్టాగ్రామ్లో ఓ బాలుడు పెట్టిన పోస్టు ఒకటి ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పోస్టే అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుకు కారణం అయ్యింది కూడా. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పూణెలోని హదప్సర్ ప్రాంతంలో గల ఓ పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల బాలుడు.. గత కొంతకాలం నుంచి అదే పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలిక వెంటపడుతున్నాడు. తనతో స్నేహం చేయాలంటూ బాలికను వేధించేవాడు. అయితే, సదరు బాలిక ఆ బాలుడిని లెక్కచేయలేదు.
దీంతో ఆమెపై కోపం పెంచుకున్న బాలుడు.. బాలిక ఫొటో తీసి తన ఇన్స్టాగ్రామ్లో.. ‘నువ్వు నా భార్యవి అవుతావా..?’ అంటూ స్టేటస్ పెట్టాడు. అది చూసిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.