CBSE | ఇకపై ఏడాదికి 2 సార్లు బోర్డు పరీక్షలు.. 2026 నుంచి నిర్వహించనున్న సీబీఎస్సీ!
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020కి అనుగుణంగా పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించడానికి సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సమాయత్తమైంది. అన్నీ కుదిరితే, వచ్చే ఏడాది అంటే 2026 నుంచే ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనున్నది.
- సీబీఎస్ఈ 10, 12 తరగతుల వారికి ఛాన్స్
- 2026 నుంచి నిర్వహించేందుకు సన్నాహాలు
- సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ అధికారులతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం
- ముసాయిదాపై త్వరలో అభిప్రాయ సేకరణ
CBSE | హైదరాబాద్, ఫిబ్రవరి 19 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020కి అనుగుణంగా పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించడానికి సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సమాయత్తమైంది. అన్నీ కుదిరితే, వచ్చే ఏడాది అంటే 2026 నుంచే ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చనున్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి, సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్), నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ముసాయిదాపై వచ్చే సోమవారం నుంచి ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎందుకు ఈ విధానం?
ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. తాజా విధానంతో పరీక్షల్లో ఉత్తమ స్కోరును సాధించేందుకు విద్యార్థులకు అవకాశం లభిస్తుందని విద్యాశాఖకు చెందిన అధికారులు పేర్కొన్నారు. అయితే, సెమిస్టర్ విధానాన్ని తాము పాటించట్లేదని గుర్తుచేశారు.
రెండు పరీక్షల మధ్య నిర్ణీత వ్యవధి
సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలను ప్రస్తుతం ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించి మేలో ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఫెయిలైన విద్యార్థులకు జూలైలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లోనే ఏదైనా ఒక సబ్జెక్ట్‌లో తమ మార్కులను మెరుగుపర్చుకోవడానికి పాసైన విద్యార్థులకూ అవకాశం కల్పిస్తున్నారు. అయితే, తాజా విధానం అమల్లోకి వస్తే, అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ) ప్రవేశాలపై ప్రభావం పడకుండా నూతన విద్యా క్యాలెండర్‌ను రూపొందించే అవకాశం ఉన్నదని అధికారి ఒకరు తెలిపారు. రెండు బోర్డు పరీక్షల మధ్య నిర్ణీత కాల వ్యవధి ఉంటుందని, దీంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవడానికి తగిన సమయం లభిస్తుందని పేర్కొన్నారు. అయితే, ఏడాదికి రెండుసార్లు నిర్వహించే ఈ బోర్డు పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారన్నది త్వరలో వెల్లడిస్తామన్నారు.
ఏ మార్కులు తీసుకొంటారు?
ఏడాదికి రెండుసార్లు నిర్వహించే బోర్డు పరీక్షల్లో.. విద్యార్థులు ఏ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధిస్తే, వాటినే పరిగణనలోకి తీసుకొంటామని అధికారులు తెలిపారు.
రెండుసార్లూ పరీక్షలు రాయాలా?
ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించినప్పటికీ, విద్యార్థులు రెండుసార్లూ పరీక్షలకు హాజరవ్వడం తప్పనిసరికాదని ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే స్పష్టంచేశారు. జేఈఈ మాదిరిగా 10, 12 తరగతుల విద్యార్థులు కూడా బోర్డు పరీక్షలకు రెండుసార్లు హాజరవ్వొచ్చని, అయితే అది ఐచ్ఛికమేనన్నారు.
ఏడాది క్రితం నుంచే..
నిజానికి 2024-25 విద్యాసంవత్సరం నుంచే ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ, సీబీఎస్ఈ ప్రయత్నించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. 2025-26లోనూ ఆ ప్రయత్నాలు జరిగినప్పటికీ, సాకారం కాలేదు. దీంతో వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

