బీబీనగర్, మే 22 : ధాన్యం కొనుగోళ్ల విషయంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డికి అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహా ధర్నాలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైళ్ల, రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ నెల 30వ తేదీలోగా ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని ప్రకటించారని, అయితే ఇప్పటి వరకు 20 శాతం కూడా కొనుగోళ్లు పూర్తి కాలేదన్నారు. 40 రోజులుగా కొనలేని ధాన్యాన్ని ఎనిమిది రోజుల్లో ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి నెలరోజులు దాటినా కొనుగోళ్లు పూర్తి చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ హయాంలో పార్టీ నాయకులు ప్రతి ఒకరూ రోడ్లపై నిలబడి లారీలను కొనుగోలు కేంద్రాలకు తరలించే వారని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకునేవారన్నారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు, నాయకులు రైతులను పలుకరించిన పాపాన పోలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాలు వస్తాయని భయంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నా అధికారులు మాత్రం కార్యాలయాలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. కటింగుల పేరుతో రైతులను దోచుకుంటున్నారని, బస్తాకు అదనంగా రెండు కిలోలు తీసుకుంటూ మిల్లర్లు, దళారులు రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. మహాధర్నా అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యరల సుధాకర్ గౌడ్, మాజీ రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక జైపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు మల్లగారి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, నాయకులు పిట్టల అశోక్, గాదె నరేందర్ రెడ్డి, మంచాల రవికుమార్, తలబోయిన గణేష్ యాదవ్, గాదె కవిత నరేందర్‌రెడ్డి, సోము రమేష్, దేవరుప్పుల పృథ్వీరాజ్, జకి నగేష్ పాల్గొన్నారు.