కట్టంగూర్, ఏప్రిల్ 09 : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు చేస్తున్న దోపిడిని అరికట్టాలని బిఎస్పీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కత్తుల కాన్షీరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కట్టంగూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు హమాలి కాంట్రాక్టు వ్యవస్థ కలిసి రైతులను బహిరంగంగా దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బస్తా 40 కిలోలు ఉండాల్సి ఉండగా తరుగు, బస్తా బరువు పేరుతో 850 గ్రాములు అదనంగా, 40 కిలోల 850 గ్రాములు తూకం వేస్తూ రైతులను దోపిడీకి గురి చేస్తున్నారన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకర్యాలు కూడా లేవని టెంట్ సదుపాయం, తాగునీటి కొరత, సరిపడా బస్తాలు లేకపోవడం, హమాలీలు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధరల పెరుగుదలతో వానాకాలం, యాసంగి పంటల ఖర్చులు పెరిగినా రైతుకు సరైన ధర లభించడం లేదని, దాంతో రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకతవకలకు పాల్పడుతున్న కొనుగోలు కేంద్రాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.