పేదలకు గృహయోగం.. సొంత జాగా ఉంటే గృహలక్ష్మి ఇండ్లు
సంక్షేమ సారథి, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. సొంతజాగా ఉండి ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సంకల్పించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇండ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. తొలి దఫాగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఇండ్ల నిర్మాణాలకు పునాదిరాయి పడనున్నది.
- ఉమ్మడి జిల్లాలో తొలిదఫా 36వేల ఇండ్లు
- నిర్మాణానికి రూ.1,080 కోట్ల నిధులు
- నియోజకవర్గానికి 3వేల ఇండ్ల చొప్పున కేటాయింపు
- ఒక్కో ఇంటికి రూ.3లక్షలు.. మూడు విడుతలుగా చెల్లింపులు
- నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వ సాయం
- ఇప్పటికే నిర్మాణంలో 16,800 డబుల్ బెడ్రూం ఇండ్లు
- పెండింగ్ గృహ రుణాలు రూ.450కోట్ల మాఫీకి అవకాశం
- ఇండ్లులేని పేదల్లో సంతోషం.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
సంక్షేమ సారథి, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. సొంతజాగా ఉండి ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సంకల్పించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇండ్ల నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. తొలి దఫాగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఇండ్ల నిర్మాణాలకు పునాదిరాయి పడనున్నది. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1080 కోట్లతో 36వేల ఇండ్లు నిర్మాణం కానున్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల చొప్పున నేరుగా నగదు బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నది. దళారుల ప్రమేయానికి తావులేకుండా అత్యంత పారదర్శకంగా పథకం అమలు కానున్నది. మరోవైపు ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 16,800 డబుల్ బెడ్రూం ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.
మున్సిపాలిటీల్లో మెజార్టీ ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో పురోగతిలో ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని కొనసాగిస్తూనే గృహలక్ష్మి పథకం కూడా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక గతంలో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ గృహాలు పొందిన వారికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.450 కోట్ల రుణాలను సర్కారు మాఫీ చేసే అవకాశం ఉన్నది. ప్రభుత్వ నిర్ణయంతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మార్చి10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన ఇండ్ల పథకంలో ఒకటి, రెండు రూమ్లతోనే నిర్మాణాలు ఉండేవి. వీటిల్లో పారదర్శక విధానాలు లేక అసలైన పేదలకు అందేవి కావు. దళారులు, మధ్యవర్తుల పైరవీలకే పెద్ద పీట ఉండేది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వమే ఇంటి స్థలాన్ని చూపించి, రెండు బెడ్రూంలు, హాల్, వంట గది ఉండేలా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.6.33 లక్షలతో డబుల్ బెడ్రూం ఇండ్లకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. ఇలా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 1,400 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది.
ఉమ్మడి జిల్లాలో 16,800 ఇండ్లు నిర్మించి పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియ కొనసాగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల పూర్తి కాగా మరికొన్ని చోట్ల పురోగతిలో ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలోనే లబ్ధిదారులకు అందజేసేందుకు పనులు వేగవంతం చేశారు. ఇలా ఇంటి స్థలం కూడా లేని నిరుపేదల కోసం ఓ వైపు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని కొనసాగిస్తూనే మరోవైపు సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకోలేని వారి కోసం సీఎం కేసీఆర్ ఆలోచన చేశారు. గృహలక్ష్మి పథకం పేరుతో సొంతింటి కల నెరవేర్చాలని సంకల్పించారు. వచ్చే ఆర్థ్ధిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నుంచి ఈ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం విధి విధానాలపై కసరత్తు చేస్తున్నది.
గృహిణి పేరుతోనే ఇల్లు మంజూరు
గృహలక్ష్మి పథకంలోని ఇండ్లన్నింటినీ మహిళల పేరుతోనే మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ పథకానికి గృహలక్ష్మి అని పేరు పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించే రూ. 3లక్షల ఆర్థిక సాయం కూడా మహిళల అకౌంట్లల్లోకి రానున్నాయి. దాంతో ఈ పథకంలో మహిళలే కీలకం కానున్నారు. అతి త్వరలోనే పూర్తి విధివిధానాలు ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. మరోవైపు గతంలో గృహ నిర్మాణం సంస్థ ద్వారా ఇండ్లు నిర్మించుకున్న వారి రుణాలు సైతం మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.450 కోట్లు రుణ మాఫీ అయ్యే అవకాశం ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇండ్ల యజమానులకు రూ.4వేల కోట్ల లబ్ధి జరుగనుండగా జిల్లాలోని రుణగ్రహీతలకు కూడా వెసులుబాటు లభించనుంది. జిల్లావాసులకు రుణమాఫీ లబ్ధిపై జిల్లా అధికారులు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు.
గృహలక్ష్మి పథకం వల్ల సొంత జాగాలున్న పేదలకు ఈ పథకం సులువుగా అందుబాటులోకి రానుంది. సొంత జాగాలు ఉండి డబుల్ బెడ్రూం ఇండ్లకు అర్హత లేని పేదలంతా ఈ పథకంతో లబ్ధిపొందనున్నారు. దీంతో ఈ పథకంపై సొంత జాగాలున్న పేదల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం కేసీఆర్‌తోనే సామాన్యుడికి ఇలాంటి పథకాలు సాధ్యమని ప్రశంసిస్తున్నారు. తాజాగా గృహలక్ష్మి పథకాన్ని కూడా అదేతరహాలో రూపొందిస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ పైసా నేరుగా లబ్ధిదారులకు చెందుతుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
సొంత జాగా ఉండి ఇండ్లు నిర్మాణం చేసుకోలేని పేదల కోసం సీఎం కేసీఆర్ బృహత్తర పథకాన్ని ప్రకటించారు. గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థ్ధిక సాయం చేయాలని సంకల్పించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం చేయనుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుడికే నగదు సాయం అందేలా పకడ్బందీగా పథకానికి రూపకల్పన చేస్తున్నారు. ఇంటి నిర్మాణంలో వివిధ దశలకు అనుగుణంగా ఒక్కో దఫాలో రూ.లక్ష చొప్పున మొత్తం మూడు దఫాలుగా ఈ సాయం లబ్ధిదారుడికి అందనుంది. తొలి దఫాలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రూ.1,080 కోట్ల ప్రభుత్వ సాయంతో మొత్తం 36 వేల ఇండ్ల నిర్మాణం జరుగనుంది. ఇంటి జాగా ఉన్న ప్రతి నిరుపేదకు సొంతింటి కల నెరవేరే వరకు ఈ పథకం ప్రతీ సంవత్సరం అమలు కానుంది.
నా నమ్మకం నిజమైతున్నది
ఎవరికి ఏం కావాల్నో తెలుసుకుని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్త్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో ఒక రోజు నాలాంటి పేదోళ్లకు తప్పకుండా ఇల్లు కట్టిస్తడనే నమ్మకంతో ఉన్న. అది ఇయ్యాల గృహలక్ష్మి పథకంతో నిజమైతున్నది. పదేండ్ల కింద నా భర్త చనిపోయిండు. మాది పేద కుటుంబం. ఇద్దరు పిల్లల చదువులు, ఖర్చులతో బతుకు కష్టమైతున్నది. ఎన్నో ఏండ్లుగా ఒక ఇల్లు కట్టుకుంటే బాగుండు అనే కోరిక ఉండే. అది కలగానే మిగిలిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ రూపంలో ఇప్పుడు నిజం
కాబోతున్నది. జాగా ఉన్నోళ్లకు ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు ఇస్తామనడం బాగుంది. ఈ విషయం ప్రభుత్వం చెప్పగానే నా పాణం లేసొచ్చినట్లయ్యింది. అన్ని అర్హతలున్న నాకు ఇల్లు వస్తదనే నమ్మకం ఉంది.
– మీసాల నాగమణి, కట్టవారిగూడెం, గరిడేపల్లి మండలం
పేదలపాలిట పెన్నిధి సీఎం కేసీఆర్ సారు
మాది చాలా నిరుపేద కుటుంబం. నా భర్త ఏడేండ్ల క్రితం గుండెపోటుతో చనిపోయిండు. నాకు నలుగురు ఆడపిల్లలు. ఇద్దరు అమ్మాయిల పెండ్లి చేసినంక నాభర్త చనిపోయిండు. కూలి పనిచేస్తూ పిల్లలను సాధిన, ఎదిగి వచ్చిన మిగతా ఇద్దరు పిల్లలు పెండ్లి చేయలేక అనేక ఇబ్బందులు పడ్డాను. సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి ఇచ్చి నా ఇద్దరు ఆడబిడ్డలను మామయ్యలెక్క ఆదుకుండు. నాకు వితంతు పింఛను ఇస్తుండు. ఇప్పుడు రూ.3 లక్షలు ఇస్తామని చెప్పడం ఆనందంగా ఉన్నది.
– వేముల ఎల్లమ్మ దామరచర్ల
సాయం చేస్తానని చెప్పడం సంతోషంగా ఉంది
మాకు కొత్త ఇండ్లు వస్తాయి సంతోషంగా ఉంది. మాకు జాగా ఉన్నా సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి స్థోమత లేదు. దాంతో నేను, మా తల్లిదండ్రులు గుడిసెలోనే నివాసం ఉంటున్నాం. వర్షం వస్తే మొత్తం కురుస్తది. సీఎం కేసీఆర్ సారు ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షల సాయం చేస్తానని చెప్పడం సంతోషంగా ఉంది. మా లాంటి పేదల కోసం సీఎం కేసీఆర్ సర్కార్ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
– బకరం గణేశ్, చొల్లేడు గ్రామం, మునుగోడు మండలం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Griha Lakshmi
- hearts
- Homeless
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | పచ్చికొబ్బరి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. ఎందుకో తెలుసా..?
MLC Dasoju Shravan Kumar | ప్రకాష్ గౌడ్‌కి రెడ్ కార్పెట్ వేసి.. మా సుధీర్ రెడ్డినేమో అడ్డుకున్నారు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజియన్ బతుకమ్మ, దసరా ఆదాయం
అనంతగిరి ఎంఈఓగా వెంకటయ్య బాధ్యతల స్వీకరణ
‘కరువు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

