శుక్ర మౌఢ్యమి కారణంగా మూడు నెలలపాటు ఆగిపోయిన శుభకార్యాలకు మళ్లీ తెరలేచింది. మూఢం కారణంగా సెప్టెంబర్ 22నుంచి శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు, నిశ్చితార్థాలు, వివాహాలు నిలిచిపోయాయి. పెండ్లి కుదుర్చున్నవారు, ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన వారు మూఢం ఎప్పుడు పోతుందా.. మంచి ఘడియలు ఎప్పుడొస్తాయా? అని ఇంతకాలం ఎదురు చూశారు. ఇప్పుడా సమయం రానే వచ్చింది. నవంబర్ 30తో మూఢం ముగియగా.. డిసెంబర్ 2నుంచి శుభ ఘడియలొచ్చాయి. దాంతో పెండ్లి ముహూర్తాలు, ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలకు జనం సిద్ధమయ్యారు. మంచి రోజులు ఈ నెల 19వరకు ఉండగా.. మళ్లీ జనవరి 22నుంచి మార్చి 18వరకు విశేషమైన ముహూర్తాలున్నట్లు పంచాంగ కర్తలు చెప్తున్నారు.
మూఢం కారణంగా పురోహితులు, టెంట్, మైక్ సెట్ల నిర్వాహకులు, వంటలు చేసేవారు, క్యాటరింగ్, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు, మంగళ వాయిద్యకారులు, ఫొటో, వీడియోగ్రాఫర్లకు మూడు నెలల పాటు పని లేకుండా పోయింది. శుభ ఘడియలు రావడంతో మళ్లీ వారికి చేతినిండా పని దొరుకనుంది. ఇప్పటికే కల్యాణ మండపాలు, ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు బుక్కయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు. శుభ ముహూర్తాలు దగ్గర పడుతుండడంతో నగలు, వస్త్ర దుకాణాలు కొనుగోలుదారులతో రద్దీగా కన్పిస్తున్నాయి. ఆయా వృత్తులవారు, పెండ్లి ఏర్పాట్లు చేసేవారు బిజీ అయ్యారు.
సాధారణంగా కార్తిక మాసంలో పెండ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈసారి మూఢం ఉండడంతో వివాహాలతోపాటు గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలేవీ జరుగలేదు. దాంతో మార్గశిర మాసంలో డిసెంబర్లో వచ్చే ముహూర్తాల కోసం జనం ఎదురుచూశారు. ధృక్ సిద్ధాంతం ప్రకారం డిసెంబర్లో 4, 8, 14, 17, 18 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలున్నట్లు వేద పండితులు చెప్తున్నారు. పూర్వ సిద్ధాంతం ప్రకారం డిసెంబర్ 2, 3, 4, 7, 8, 9, 14, 16, 18, 19 తేదీలు పెండ్లిళ్లకు మంచి ముహూర్తాలని పేర్కొంటున్నారు. దివ్యమైన ముహూర్తాలున్న ఐదు రోజుల్లోనే ఎక్కువ పెండ్లిళ్లు జరుగనున్నటు పురోహితులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెలలో ముహూర్తాలకు డిమాండ్ ఏర్పడింది. అయితే.. ఈ నెల 23న అమావాస్య, 24న పుష్యమాసం (శూన్య మాసం) ఆరభమవుతుండటంతో శుభకార్యాలు జరుపరు. తిరిగి జనవరి 22నుంచి మాఘమాసంలో మంచి రోజులు వస్తున్నాయి. ఈ నెలలో 22, 26, 27, 28 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. తిరిగి ఫిబ్రవరి, మార్చి నెలల్లో భాజాభజంత్రీలు మోగనున్నాయి. మార్చి 18 వరకు ముహూర్తాలున్నాయి.
దివ్యమైన ముహూర్తాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. డిసెంబర్ 4న రాత్రి 11:30గంటలకు, అర్ధరాత్రి ఒంటి గంటకు, 8వ తేదీ రాత్రి 11:38 గంటలకు కన్యాలగ్నం, రాత్రి 1:20 గంటలకు నిశీది ముహూర్తాలు ఉన్నాయి. 14న బుధవారం మహానక్షత్రం రాత్రి 11:15గంటలకు, 18న ఆదివారం రాత్రి చిత్త నక్షత్రంలో 11:11 గంటలకు, అర్ధరాత్రి 12:47కు సింహలగ్నం వివాహాలకు అనుకూలంగా ఉన్నాయి. పూర్వ సిద్ధ్దాంతం ప్రకారం మరిన్ని ముహూర్తాలు ఉన్నాయి.
– కుంభంపాటి శాండిల్యశర్మ, వేద పండితుడు, మట్టపల్లి
శుక్ర మౌఢ్యంతో సుమారు మూడు నెలలపాటు ఎలాంటి శుభకార్యాలూ జరుగలేదు. డిసెంబర్ 2నుంచి 19వరకు మంచి ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత మళ్లీ జనవరి 22నుంచి మార్చి 18వరకు శుభ ఘడియలు పుష్కలం. మూడు నెలలకుపైగా పెండ్లిళ్లు, శుభకార్యాలు జరుపుకోవడానికి మంచి అవకాశం.
– పెన్నా మోహనశర్మ, పురోహితుడు, నల్లగొండ