చివ్వెంల, సెప్టెంబర్ 20 ; ఆయనేం పెద్ద స్టార్ కాదు. సెలబ్రిటీల కుటుంబంలో పుట్టలేదు. సినీ పరిశ్రమలో పరిచయాలూ లేవు. టాలీవుడ్లో నిలదొక్కుకోవాలనే పట్టుదలతో ఒక్కొక్క నిచ్చెన ఎక్కుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు హీరో గౌతమ్ కృష్ణ. సూర్యాపేట జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని బీబీగూడేనికి చెందిన గౌతమ్‌కృష్ణ తన తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తనకు చిన్నతనం నుంచే సినిమాలంటే అసక్తి ఉండడంతో నటనవైపు మళ్లాడు. ఆకాశవీధుల్లో, సిద్దూ ది రాక్ స్టార్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బిగ్‌బాస్-7లో ఎంట్రీ ఇచ్చి మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. 8886676903 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి గౌతమ్‌కృష్ణను బిగ్‌బాస్ విజేతగా నిలుపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలుగులో పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా.. తాజాగా సీజన్-7 నడుస్తున్నది. ఈ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ బిగ్‌బాస్ విజేతగా నిలువాలని కలలు కంటున్నాడు సూర్యాపేటకు చెందిన డాక్టర్ గౌతమ్ కృష్ణ. ఈ రియాలిటీ షోలో మొత్తం 14 మంది హౌజ్‌లో ఉన్నారు. అందులో 11వ కంటెస్టెంటుగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు గౌతమ్ కృష్ణ.
గౌతమ్ కృష్ణ కుటుంబ నేపథ్యం..
తల్లిదండ్రులు ధరావత్ మనోజ్జాదవ్, మంగమ్మ. తండ్రి రిటైర్డ్ ఇంజినీర్, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.1996 ఏప్రిల్ 13న జన్మించిన గౌతమ్ కృష్ణ ప్రాథమిక విద్యాబ్యాసం సూర్యాపేటలోని అంజలి స్కూల్లో పూర్తిచేశాడు. 5 నుంచి పదో తరగతి, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని శారద యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు గౌతమ్. తనకు చిన్నతనం నుంచే సినిమాలంటే ప్రాణంగా పెరిగాడు. పాఠశాల, కళాశాల స్థాయిలో గౌతమ్ కల్చరల్, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లలో తన ప్రతిభ చూపించేవాడు. ఎంబీబీఎస్ పట్టా పొందిన తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు గౌతమ్ కృష్ణ.
11వ కంటెస్ట్‌గా గౌతమ్ కృష్ణ..
ఈ నెల 3వ తేదీన అక్కినేని నాగార్జున చేతుల మీదుగా అత్యంత గ్రాండ్‌గా లాంచ్ చేసిన బిగ్‌బాస్-7 గత ఆరు సీజన్ల కంటే భిన్నంగా రూపొందించారు. ఈ షోలో మెత్తం 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. గౌతమ్ రెండు సినిమాల్లో నటించి మరో సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత బిగ్‌బాస్ టీం హౌస్‌లోకి ఆహ్వానించింది. గౌతమ్ కృష్ణ ఎంట్రీ సమయంలో డాక్టర్ అని తెలియడంతో అక్కినేని నాగార్జున.. బిగ్‌బాస్ హౌస్‌లో నీ అవసరం ఎంతైనా ఉందని చెప్పడం గౌతమ్‌కు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు గౌతమ్ అభిమానులు. అంతేకాకుండా గౌతమ్ ఎంట్రీ సమయంలో చేతికి బేడీలు వేయడం స్పెషల్ గుర్తింపు అంటున్నారు.
డాక్టర్ టు యాక్టర్&
గౌతమ్ కృష్ణ తల్లిదండ్రులు తమ కుమారుడు డాక్టర్ కావాలని కలలు కన్నారు. కానీ, తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని, తాను సిమాల్లోకి వెళ్తానని తల్లిదండ్రులను ఒప్పించి నటన వైపు అడుగులు వేశాడు గౌతమ్. డాక్టర్ చదువుతోపాటు ఎంబీఏ పూర్తిచేసిన వెంటనే 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. 2019లో ‘ఆకాశ వీధుల్లో’ సినిమాకు సొంతంగా కథ రాసుకొని దర్శకత్వం వహించడంతోపాటు కథానాయకుడిగా నటించాడు. హీరోయిన్గా పూజిత పొన్నాడకు అవకాశం ఇచ్చారు. 2022 సెప్టెంబర్ 2న ఈ సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందడంతోపాటు తన నటనతో పరిశ్రమను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా గౌతమ్‌కు బాగానే గుర్తింపు తీసుకొచ్చింది. గౌతమ్ హీరోగానే కాకుండా మంచి కథలు రాయడం, దర్శకత్వం చేయడంతో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. హిందీలో సిద్ధూ ది రాక్ స్టార్ అనే సినిమాలో నటించి అక్కడా తన ముద్ర వేసుకున్నాడు. ప్రస్తుతం మరో కొత్త సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని బిగ్‌బాస్-7లో అడుగు పెట్టాడు.
ఓట్ ఫర్ గౌతమ్ కృష్ణ
తను దర్శకత్వం వహించి హీరోగా నటించిన తొలి సినిమా ఆకాశవీధుల్లో, సిద్ధూ ది రాక్ స్టార్, తాజాగా మరో కొత్త సినిమాలో హీరోగా నటించిన గౌతమ్ కృష్ణకు ఇన్‌స్టాగ్రామ్‌లో 90.30కే ఫాలోవర్స్ ఉన్నారు. ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలనే ఉద్దేశంలో బిగ్‌బాస్-7లో ఎంట్రీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బిగ్‌బాస్-7లో తమ కుమారుడు గౌతమ్ కృష్ణ ఆటను చూసి ఎంజాయ్ చేయండి. గౌతమ్ కృష్ణకు ఓటు వేసి మీ మద్దతు తెలపండి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు గౌతమ్ తల్లిదండ్రులు. 8886676903 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి గౌతమ్ కృష్ణ బిగ్‌బాస్-7లో గెలుపొందేందుకు సహకరించాలని కోరుతున్నారు.