నేరేడుచర్ల, జూన్ 17 : రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్‌నగర్‌లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి డిజిటల్ సభ్యత్వ నమోదుపై శిక్షణ తరగతులు, ఓటరు జాబితా పరిశీలన(సర్) సన్నాహక సమావేశాన్ని నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి జగదీశ్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్(సర్) ప్రక్రియ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. సర్ ప్రక్రియపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మూడు నెలలు పాటు అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్, బిజేపీలు రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఓట్లను తొలగించే పనిలో ఉన్నాయన్నారు.
కార్యకర్తలు అప్రమత్తంగా ఉంటూ బీఎల్ఓలు, బీఎల్ఏలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లను కాపాడాలని సూచించారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ తయారు చేసిన హైబ్రీడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పాలన అధ్వాన పరిస్థితికి చేరిందన్నారు. రియల్ దందా, భూముల ఆక్రమణ తప్ప పాలనను రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి దమ్మూ, ధైర్యం ఉంటే హుజూర్నగర్ నియోకవర్గంలో ప్రజాపాలన చేపట్టాలన్నారు. ఇక్కడ పోలీస్ పాలన సాగుతోందని, బీఆర్ఎస్ నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టి భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులను ఎత్తివేయడంతో పాటు వేధించిన పోలీసు అధికారులను ముద్దాయిగా నిలబెడతామని హెచ్చరించారు. నియోజకవర్గ సమన్యయ కర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి.. మంత్రి ఉత్తమ్‌పై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్రమంగా కేసులు పెట్టారని అన్నారు. బీర్ఎస్ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు ధైర్యంగా ఉండాలని, మన ప్రభుత్వం రాగానే అధికమొత్తంలో నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను అడ్డుగోలుగా వాడుకుంటున్నా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతులు రాజులుగా ఉండేవారని, కానీ నేడు రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. 1.50లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని గొప్పలు చెబుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. నేటికీ ధాన్యం కొనుగోళ్లు జరగక కల్లాల వద్దనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందని, ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి 50వేల మెజార్టీతో గెలుపొందుతాడని, కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్చార్జి కంచర్ల కృష్ణారెడ్డి, రేగట్టె మల్లికార్జున రెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, పిల్లుట్ల రఘు, కొప్పుల సైదిరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, ఎల్ఎన్ రెడ్డి, బెల్లకొండ అమర్ గౌడ్, పచ్చిపాల ఉపేదర్, అరిబండి సురేశ్‌బాబు, దొండపాటి అప్పిరెడ్డి, లకుమళ్ల జ్యోతి, చందమళ్ల జయబాబు, కిష్టపాటి అంజిరెడ్డి, కడియం వెంకటరెడ్డి, నాగండ్ల శ్రీధర్, అబ్దుల్ నబీ, చెన్నబోయిన సైదులు, పసుపులేటి సైదు లు, రాపోలు నవీన్‌కుమార్, హరి లక్ష్మణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు చురుకుగా పాల్గొనాలని పార్టీ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్ధు నర్సింహారెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారినే పార్టీ సభ్యులుగా చేర్చుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రక్రియను కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గతంలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులను, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు జరిగే సర్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాను వార్డుల వారీగా క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు సవరించుకోవాలని సూచించారు. ఫామ్ -6, 7,8లపై బీఆర్ఎస్ బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని, తెలంగాణలో సర్ చేపట్టి అడ్డదారిలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.