మునిపల్లి, నవంబర్ 27: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకూ ఎంతో ప్రాధాన్యమిస్తున్నది. సర్కారు ప్రోత్సాహంతో గురుకుల పాఠశాలు, కళాశాలల్లో చుదుకునే విద్యార్థిని, విద్యార్థులు ఆటల్లో అదరగొడుతున్నారు. జిల్లా స్థాయి నుంచి దేశస్థాయిలో సైతం క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్న వారిలో తెలంగాణ గురుకులాల్లో చదువుకునే విద్యార్థులే ముందు వరుసలో నిలుస్తున్నారు. అనుభవం ఉన్న క్రీడా ఉపాధ్యాయుల శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా చౌరస్తాలో ఉన్న తెలంగాణ గురుకుల మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో (బీబీఏ)మొదటి సంవత్సరం చదువుతున్న ఆగసర నందిని హర్డిల్స్ ఆటలో దేశస్థాయిలో 5వ ర్యాంకు సాధించి తోటి యువతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నది. తెలంగాణ తరుపున ఇతర రాష్ర్టాలు, దేశాల్లో పాల్గొని రాష్ర్టానికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. దేశ స్థాయి ఆటల్లో ఎన్నో గోల్డ్, సిల్వర్ పతకాలు సాధించింది.
అరుదైన రికార్డులు..
నాలుగు నెలల క్రితం కొలంబియాలో జరిగిన వరల్డ్ అండర్ 20 అథ్లెటిక్స్‌లో 100మీటర్ల దూరాన్ని 13.34సెకన్లలో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టిన తొలి మహిళగా ఆగసర నందిని రికార్డుల్లోకి ఎక్కింది. చదువు కొనసాగిస్తూనే అతిచిన్న వయస్సులో 11గోల్డ్, 7సిల్వార్, 6బ్రాన్జ్ మొత్తం 24 మెడల్స్ సాధించింది. ఇటీవల కాలంలో ఇతర రాష్ర్టాల్లో నిర్వహించిన పలు పోటీల్లో అదరగొట్టింది. తెలంగాణ యువ అథ్లెటిక్ ఆగసర నందిని జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా స్వర్ణంతో మెరిసింది. ఛత్తీస్‌గఢ్ వేదికగా జరిగిన అండర్ 23చాంపియన్‌షిప్ మహిళల 100మీటర్ల హర్డిల్స్‌లో 13.73సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం కైవసం చేసుకుంది.
తండ్రి చాయ్ హోటల్ యజమాని..
దేశ, అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో అదరగొడుతున్న ఆగసర నందినిది చాలా పేద కుంటుంబం. తండ్రి ఎల్లప్ప కర్ణాటకలోని బళ్లారి నుంచి 18ఏండ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. కుటుంబ పోషణ కోసం ఎల్లప్ప (హైదరాబాద్)ఈసీఐఎల్ ఓ కాలనీలో చిన్న చాయ్ దుకాణం నడిపిస్తున్నాడు. ఆగసర తల్లి బట్టలు ఇస్త్రీ చేస్తున్నది. ఆగసరకు ఆటలు అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి క్రీడలపై ఉన్న ప్రత్యేక ఆసక్తితో కఠోరంగా శ్రమించి స్కూల్ స్థాయి నుంచి దేశస్థాయి వరకు ఆటల్లో ఎన్నో విజయాలు సొంతం చేసుకున్నది. నందిని ఆటల్లో రాణిస్తుండడంతో కుటుంబసభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దాతల కోసం ఎదురుచూపు..
హర్డిల్స్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఆగసర నందిని దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది.నిరుపేద కుటుంబంలో పుట్టిన నందిని ఆటల్లో పేదరికాన్ని లెక్కచేయకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. విదేశాల్లో రాణించాలంటే నందినికి అథ్లెటిక్స్‌లో మెరుగైన శిక్షణ ఎంతో అవసరం. నందిని తండ్రి చాయ్ హోటల్ నడిపితే, అమ్మ బట్టలు ఇస్త్రీ చేస్తుంది. కూతురికి మంచి శిక్షణ ఇప్పించేందుకు నందిని కుటుంబం చాలా ఇబ్బందులు పడుతున్నది. ఇటీవల పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లేటప్పుడు బుధేరా మహిళా డిగ్రీ కళాశాల బృందం అందించిన చిన్న సాయంతో పోటీల్లో పాల్గొని విజయంతో తిరిగి వచ్చింది.
– నాగపురి రమేశ్, హెడ్‌కోచ్
సర్కారు సాయం అందించాలి…
ఆగసర నందిని ఆటల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నది. ఆటల్లో పాల్గొనేందుకు నందినికి సరైన సదుపాయాలు కల్పించలేపోతున్నాం. కర్ణాటకలో ఉపాధి లేక హైదరాబాద్‌కు వలస వచ్చి నివాసం ఉంటున్నాం. మాది నిరుపేద కుటుంబం. ఆగసర పోటీల్లో పాల్గొనేందుకు కావాల్సిన శిక్షణ ఇప్పించేందుకు మా ఆర్థిక పరిస్థితి సరిపోదు. సర్కార్ సాయం అందిస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో క్రీడలకు మంచి గుర్తింపు వచ్చింది. నందినికి చేయూతను ఇస్తే తెలంగాణ రాష్ర్టానికి మంచి పేరు తీసుకొస్తుంది.
-ఎల్లప్ప, నందిని తండ్రి
సరైన శిక్షణ కావాలి
నా ఆటకు సరైన శిక్షణ తీసుకోకపోవడంతో దేశస్థాయి హర్డిల్స్‌లో అనుకున్నంతగా రాణించలేకపోతున్నా. దేశస్థాయి హర్డిల్స్‌లో పోటీల్లో పాల్గొని విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సరైన శిక్షణ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తే తెలంగాణ పేరు నిలబెడతా. నాకు శిక్షణ ఇప్పించేందుకు మా అమ్మా, నాన్న చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటి వరకు నేను రాష్ట్ర, దేశస్థాయిలో 11-గోల్డ్, 7-సిల్వర్,6-బ్రాన్జ్ మెడల్స్ సాధించాను. ప్రభుత్వం మెరుగైన శిక్షణ అందిస్తే మరిన్ని పతకాలు సాధిస్తా.
– ఆగసర నందిని, ఇండియన్ అథ్లెటిక్స్ క్రీడాకారిణి