మెదక్, అక్టోబర్ 7( నమస్తే తెలంగాణ) : భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (MHA) ఆదేశాల మేరకు అక్టోబర్ 2026 నెలను నేషనల్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ మంత్‌గా నిర్వహిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) సూచనల మేరకు మెదక్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్లను ఎస్పీ విడుదల చేశారు. గుర్తుతెలియని కాల్స్, మెసేజ్‌లు, లింకులు, అనుమానాస్పద ఆఫర్లకు స్పందించవద్దని సూచించారు. పార్ట్‌టైమ్ జాబ్, లోన్ యాప్, ఆన్లైన్ షాపింగ్, పెట్టుబడులు, అధికారుల పేరుతో జరిగే ఇంపర్సనేషన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, OTP, ATM PIN, UPI PIN, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేయడంతో పాటు https://cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు. సకాలంలో సమాచారం అందిస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
అక్టోబర్ నెలంతా పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు, ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్ చంద్ర బోస్, ఆర్ఐ శైలందర్, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.