హత్నూర, సెప్టెంబర్ 30 : పారిశుధ్య చర్యలు పాటిస్తూ స్వచ్ఛత గ్రామాలుగా తీర్చిదిద్దాలని హత్నూర ఇంచార్జి ఎంపీడీవో యూసుఫ్ సూచించారు. బుధవారం హత్నూరలో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, పారిశుధ్య కార్మికులకు పారిశుధ్య చర్యలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి స్టీల్ పాత్రలు వాడాలన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఇంటి పరిసరాలు, గ్రామపురవీధులను స్వచ్ఛతగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా ఉంటారన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టేలా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం గ్రామాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు జరిపి సన్మానించారు. కార్యక్రమంలో ఎస్బిఎం కో ఆర్డినేటర్ స్వామి, ఏపీఓ ప్రవీణ్ పాల్గొన్నారు.