పాపన్నపేట, సెప్టెంబర్ 23 : మెదక్ జిల్లా పాపన్నపేట మండల మండల పరిధిలోని వివిధ గ్రామాలలో అల్ఫాజోలం అమ్మకాలు పెద్ద ఎత్తున కోన సాగుతున్నాయి. మండల పరిధిలోని పలువురు కల్లు వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా అమ్మకాలు కొనసాగిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. గత కొన్ని నెలలక్రితం మండల పరిధిలోని పొడిచన్పల్లికి చెందిన ఇరువురు కల్లు వ్యాపారులు అల్ఫాజోలం అక్రమ వ్యాపారం చేస్తూ పట్టుబడగా ఒక వ్యాపారి పరారీ అయ్యాడు.
ఇలాంటి సంఘటనలు మండలంలో భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. ఇది ఇలా ఉండగా మంగళవారం అర్ధరాత్రి పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్పేటకు చెందిన ఒక వ్యాపారి సుమారు నాలుగు లక్షల విలువ గల అల్ఫాజోలం స్మగ్లింగ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా నేరడిగుంట ప్రాంతం లో పట్టుబడ్డట్లు స్థానికుల ద్వారా సమాచారం అందింది. ఇతడిని అక్కడి ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.