రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
మాగనూరు : మాగనూరు మండలం వడ్వాట్ గ్రామ పరిధిలోని శంకర్ లింగ రైస్ మిల్లులో వెలుగు చూసింది. సుమారు రూ.7.85 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
మాగనూరు, అక్టోబర్ 22 : ప్రభుత్వ ధాన్యం నిల్వలకు రక్షణ కరువైందా? కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని మిల్లులో భద్రపరిచిన అధికారులు ఆ నిల్వలను పర్యవేక్షించడంలో విఫలమయ్యారా? మాగనూరు మండలం వడ్వాట్ గ్రామ పరిధిలోని శంకర్ లింగ రైస్ మిల్లులో వెలుగుచూసిన భారీ ధాన్యం గోల్మాల్ వ్యవహారం ఇప్పుడు ఈ ప్రశ్నలను లేవనెత్తుతోంది. సుమారు రూ.7.85 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
80,972 బస్తాలు ఎక్కడికి వెళ్లాయి?
ఎన్ఫోర్స్మెంట్ డీఎస్ఓ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. 2024లో అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శంకర్ లింగ రైస్ మిల్లులో సుమారు 76 వేల బస్తాల ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు కేటాయించారు. అదేవిధంగా 2024–25 రబీ సీజన్‌కు సంబంధించి మరో 4,972 బస్తాల ధాన్యం కలిపి మొత్తం 80,972 బస్తాలను మిల్లులో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా తనిఖీలు నిర్వహించగా మిల్లులో ఒక్క బస్తా ధాన్యం కూడా లేకపోవడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఈ ధాన్యం విలువ రూ.7,85,30,918గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
గతంలోనూ అక్రమాలు..
ఇదే వ్యవహారంలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. 2023లో మల్లికార్జున రైస్ మిల్లులో జరిగిన అవకతవకల నేపథ్యంలో ఆ మిల్లు యజమాని దండే కృష్ణయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ మిల్లులోని ధాన్యాన్ని భద్రపరిచేందుకు సొంత సోదరుడైన శంకర్ లింగేశ్వర రైస్ మిల్లుకు అప్పగించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ ధాన్యం భద్రత, నిల్వల పర్యవేక్షణకు సంబంధించి అధికారులు ఎలాంటి తనిఖీలు నిర్వహించారు? ఎప్పటికప్పుడు నిల్వలను ధ్రువీకరించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
ప్రభుత్వ ధాన్యం కోట్లాది రూపాయల విలువతో మిల్లులో నిల్వ ఉన్నప్పుడు దాని భద్రతను నిర్ధరించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుంది. నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం, రికార్డులతో భౌతిక నిల్వలను సరిపోల్చడం, అక్రమ తరలింపులు జరగకుండా చర్యలు తీసుకోవడం వంటి బాధ్యతలు కీలకం. అలాంటిది వేలాది బస్తాల ధాన్యం మాయమైనట్లు బయటపడే వరకు ఈ వ్యవహారం ఎలా కొనసాగిందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. నిల్వల పర్యవేక్షణలో ఎక్కడైనా లోపాలు జరిగాయా? సంబంధిత అధికారుల విధుల్లో నిర్లక్ష్యం ఉందా? ధాన్యం మాయమైన వ్యవహారంలో మరెవరిదైనా పాత్ర ఉందా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాధ్యులు ఎవరైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కేసు నమోదు.. సమగ్ర విచారణకు డిమాండ్
ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శంకర్ లింగ రైస్ మిల్లు యజమాని దండే తమన్నపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే కేసు నమోదుతోనే వ్యవహారం ముగియకుండా, ప్రభుత్వ ధాన్యం ఎక్కడికి వెళ్లింది? దానికి బాధ్యులెవరు? అనేది తేల్చాలి. అలాగే, పర్యవేక్షణలో లోపాలు ఉంటే సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాలి.
ప్రజాధనం, రైతుల కష్టార్జితం, ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన ధాన్యం విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదు. ధాన్యం మాయమైన వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
Human Egg | మానవ అండాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు.. ఈడీ దాడుల్లో భారీగా నగదు, ఆస్తులు సీజ్
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

