రాజోళి, మే 26 : తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతలైన సుంకేసుల డ్యాం నుంచి పుల్లూరు వరకు ఎలాంటి ఇసుక రవాణా చేయకూడదని కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి హుకుం జారీ చేశారు. మంగళవారం సరిహద్దు వివాదంపై ఏపీ కర్నూల్ కలెక్టర్, తెలంగాణ జోగుళాంబ గద్వాల కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరు రాష్ర్టాలకు చెందిన మైనింగ్ శాఖ, రెవెన్యూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సుంకేసుల డ్యాం, తూర్పుగార్లపాడు నది తీర ప్రాంతాలను పరిశీలించారు. కర్నూల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి ఏపీ ప్రజలతో కలిసి తూర్పు గార్లపాడులోని ఇసుకను అనుమతులున్న ర్యాంపు వద్దకు చేరుకొని అధికారులతో మాట్లాడారు.
భూగర్భ జలాలను కాపాడాలనే ఉద్దేశంతో తుంగభద్రా నది ఏపీ తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలను ఆపామని గద్వాల జిల్లా మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు తెలిపారు. మీరు కూడా తుంగభద్ర నది నుంచి ఇసుక తరలింపు ఆపాలని అధికారులకు సూచించారు. స్థానిక అవసరాలకే మాత్రమే వాడేందుకు అనుమతులు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో ఇసుకను అక్రమంగా తరలిస్తురని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో పరిస్థితులు ఉద్రిక్తత చోటుచేసుకుంటున్న సందర్భంలో ఇక్కడకు వచ్చినట్లు వారు తెలిపారు.
గద్వాల జిల్లా అధికారులను హెచ్చరిస్తూ మీరు కఠిన చర్యలు తీసుకొని ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కావాలన్నా ఎక్కడో ఒకచోట ర్యాంపుల అనుమతులు ఇచ్చి తెచ్చుకోవాలని, ఇక్కడ నుంచి మళ్లి ఇసుకను తరలించి సమస్య మరి పెంచే ప్రయత్నం చేయొద్దని హుకుం జారీ చేశారు. ఏపీ నాయకుడు మాట్లాడుతుంటే తెలంగాణ అధికారులు ఏమి మాట్లాడలేక తెల్లమొహం వేశారు. ఏపీ నాయకుడు అలా బెదిరిస్తే గద్వాల ప్రజల పరిస్థితి ఏంటని ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వ్యక్తులకు ఇసుక ఎక్కడి నుంచి తేవాలని తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపకపోతే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు ఆగిపొవాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మైనింగ్ అధికారులతో మాట్లాడి సరిహద్దు వ్యవహరంపై ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ అనుమతులతో ప్రజలకు ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కార్యక్రమంలో కర్నూల్ ఆర్డీవో సందీప్ కుమార్, మైనింగ్ డీడీ నాగిని, ఆర్ఐ శివ పార్వతి, రెవెన్యూ , పోలీస్ శాఖ అధికారులు ఉన్నారు. తెలంగాణకు చెందిన మైనింగ్ ఏడీ రమణ, ఆర్ఐ సత్యనారాయణ, డీఎస్పీ మొగులయ్య, సీఐ శంకర్, ఎస్సై గోకారి, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.