కవి సమ్మేళనం
నవ జీవన ప్రాకృతిక సౌందర్యానికి ప్రతీక ‘ఉగాది’ పండుగ. శిశిర సమయాన తనలోని వార్ధక్యపు వియోగ దుఃఖాన్ని
నేలరాల్చి, లేలేత చిగురుల చీర చుట్టుకొని, ప్రియసఖుడైన వసంతుడి రాకకోసం నిలుచున్నది. వసంతుడితో జతకట్టిన ఆ ప్రకృతి తరుణి పుడమి తల్లికి కట్టిన మామిడి తోరణమే ఉగాది… శోభకృత్ నామ సంవత్సరానికి ముగింపు పలికి, ‘క్రోధి’కి స్వాగతం పలుకుతున్నది.
‘వాడిపోగానే ఓడిపోయామనుకుంటే ఎట్లా..? నేను మళ్లీ చిగురిస్తా’నని ధీమా ఇస్తున్నది క్రోధి నామ సంవత్సరం. అంతేకాదు, తెలుగు ప్రజల ఇంటిముంగిట వెలుగులు నింపడానికి నేను వచ్చేస్తున్నానంటూ సందడి చేస్తున్నది. షడ్రుచుల అమృతం నాలికపై నర్తింపజేసి నరాలను జివ్వుమనిపించడానికి ఆరాటపడుతున్నది. రండి.. రారండి.. కోకిలమ్మ పిలుస్తున్నది, మనమంతా క్రోధికి స్వాగతం పలుకుదాం… మన రైతన్నకు ఈ ‘క్రోధి’ సంవత్సరం ఏరువాక ఫలాలను అందివ్వాలని, బంగారు పంటలతో ఈ క్రోధి సంవత్సరం సకల జనుల పాలిట శాంతి సంతోషాల సారథి కావాలని, వెలుగుల కాంతులీనాలని కోరుకుందాం…
ఉగాది
ఉగాది నవ యవ్వన ప్రాకృతిక సౌందర్యానికిది ప్రతీక.వర్షాకాలపు చిరుజల్లులతో స్నానం చేసిన ఆ ప్రకృతి తరుణి,ఆ శరత్ చంద్రుని వెన్నెలనంతా అవపోసన పట్టి, తన ఒంటికి పూతగా పూసుకొని,హేమంతపు చలి నెగళ్లతో వెచ్చని ఊసులాడి,శిశిర సమయాన తనలోని వార్ధక్యపు వియోగ దుఃఖాన్ని నేలరాల్చి,బుగ్గన లేలేత చెంగావి రంగు కుసుమ పూదోటల్ని పులుముకొని,ఆకుపచ్చని చీరను ఒయ్యారంగా చుట్టుకొని, ప్రియసఖుడైన వసంతుడిరాకకై నిలుచుంది. వసంతుడితో జతకట్టిన ఆ ప్రకృతి తరుణి పుడమి తల్లికి కట్టిన పచ్చటి తోరణమే ఉగాది.
వసివాడిన చోటే విలసిల్లిన ఆ చిగురు చెబుతుంది, కోల్పోవడం అంటే ఓడిపోవడం కాదు నూతన మార్పుకు అవకాశం కల్పించండి అనీ. ఉగాది అంటే మనుషులు జరుపుకొనే పండుగ కాదు ఈ అనంత ప్రకృతి తనను తాను ముస్తాబు చేసుకునే వేడుక..!
ఎం.కురుమయ్య యాదవ్
77995 53493
క్రోధీ! జర మాఫ్ కరో!!
దేశం
అధికార దాహంతో ఊగిపోతున్నది
కవి కోకిలల్లారా
మీ గానం వినేదెవ్వరు?!
పొలాలు ఎండినా
జనం నాలుకలు తడారినా
మన నేతలకు షడ్రసోపేతమైన
పదవీ లాలస తప్ప మరో ధ్యాస లేదు!
ఎవరో అన్నారు నాతో
ఊసరవెల్లుల జాడే లేదని
మిత్రమా! నువ్వు గుర్తు పట్టడం లేదు
మన నేతలే వాటి ప్రతి రూపాలు!
రాజనీతి కొరవడిన రాజకీయాలు
ఆ సేతు హిమాచలం ఒకే తీరు
విలువలకు కొలమానాల్లేవ్
జో జీతా వహీ సికందర్!
మార్పు ఫలాలు అనుభవిస్తున్న వేళ
ఏ పంచాంగం దాని గుట్టు విప్ప లేదు
దాని ప్రతి మాటకు వాళ్ళ దగ్గర
వక్రభాష్యం సిద్ధంగా ఉంది!
నీవు అట్లా కాదని వాదిస్తే
తొక్కి పేగులు మెడలో
నీవు అట్లా లేదని ఎదురొస్తే
ఆరు మీటర్ల గోతుల్లో!
ఓ క్రోధి నామ సంవత్సరమా
జరా హమ్కో మాఫ్ కరో
మా మీద మాకే కోపంగా ఉంది
కూచున్న కొమ్మను నరుక్కున్న తెలివి మాది!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261
క్రోధికి స్వాగతమ్ము (ఆటవెలది పద్యాలు)
తెలుగు ప్రజల నింట వెలుగు ప్రభలునింప
క్రోధి వర్షమొచ్చె కోర్కె దీర్చ
స్వాగతమ్ము పలుక సాగిరండితమరు
సంద్రమలలవోలె చక్కగాను
కొత్త చీరకట్టి క్రోధియే వచ్చేను
వలపు లొలుకబోస్తు వధువు వోలె
వరుడి చెంత జేర వయ్యారి భామల
స్వాగతమ్ము పలుక సాగిరండి
కోకిలమ్మ కూత క్రోధిని పిలువంగ
కోమలాంగి వనిత కోరు రుచులు
ఆరు రుచుల తోడ యందాల క్రోధికి
స్వాగతమ్ము పలుక సాగిరండి
జాదవ్ ,పుండలిక్‌రావు పాటిల్
94413 33315
కొత్త వత్సరం!
క్రోధి నామం అన్నట్టు
గ్రీష్మసూరీడు వెచ్చగా గిచ్చితే
మామిడిచెట్టుపై గండుకోయిల అచ్చంగా
పిలుస్తోంది
వేపచెట్లు వెండి పరదాలు కప్పుకున్నాయి
వాసంతపు వయ్యారాలన్నీ కళ్లముందు
కనబడుతున్నాయి
చైత్రశుద్ధ పాడ్యమి నాడు
ఉగాది తెలుగిళ్లలో అడుగెట్టింది
తోరణాలు ముగ్గులు పండుగ శోభను పల్లకీ
ఎక్కిస్తే
ఆరు రుచుల అమృతం నాలుకపై నర్తించి
నరాల్ని జివ్వుమనిపించింది
పంచాంగ శ్రవణాలు నవగ్రహాలను
శాంతింపజేస్తే
ఏరువాక ఫలాలు రైతు బాంధవులయ్యాయి
బంగారు పంటలతో క్రోధి
జనుల పాలిట శాంతనిధి
సంతోషాల సారథి కావాలని
కాంతులీనాలని కోరుకుందాం!
భీమవరపు పురుషోత్తమ్
99498 00253
చైత్ర మాసం
శిశిరంలో చలి పులి గజదొంగ గారు
నిత్యం తనువంతా తీవ్రంగా తడిమేస్తూ
సిరిసంపదలేం దోచుకోబోయారో
దౌర్జన్యాల దాష్టికాలేంజేయబోయారో!
ఆడంబరంగా అగుపించే ఆస్తుల్ని
సర్వంగోల్పోయామని రాల్చుకొని జూపిస్తూ
ఓడుబోడులమని అరకానీకి గొరగామని
తుషారబ్బట్టలు పొగమంచు దుప్పట్లప్పుదెచ్చుకుని!
వాసంతానేం తెలియని ధైర్యమో తరులకి
భద్రంగా బోషాణంలో దాచి నగా నట్రలు
రంగురంగుల సొగసైన చీనాంబరాలు
ఒక్కొక్కటిగా తీసి పట్టుకొచ్చి పెట్టుకున్నట్టు!
కొమ్మకొమ్మకీ చిక్కటి చిగుర్ల పట్టు వస్ర్తాలు
జూకాల్లా తరుశాఖలకి వ్రేలాడ్తూ లేకాయలు
వివాహానికి నవవధువు ముస్తాబవుతూ
వజ్ర వైడూర్యాలు కెంపుపచ్చల్ధరించినట్టు!
అద్భుతహొయల విరులమేయ సౌందర్య సిరులు
మధుమాసపు రేడు సూరీడ్ని జూసుకొనేమో
రవి దొర చలిదొంగని బందీజేశాడేమోనంటూ
వాసంత సొబగులు వేనోళ్ల పొగుడుతూ కోయిలలు!
రవికిషోర్ పెంట్రాల
అమ్మా ఉగాదీ! క్షమించమ్మా!!
సంతోషముతో స్వాగతం పలికే రోజులు లేవమ్మా!
ఆవేదనతో ఆహ్వానించే రోజులు వచ్చాయమ్మా!
అమ్మా! ఉగాది క్షమించమ్మా!!
అందమైన ప్రకృతి ఇంటిని ధ్వంసం చేస్తున్నాము
గిరులను తరులను పశుపక్షాదులను అంతం చేస్తున్నాము..
వసంతం విడిది చేసే చోటు లేకుండా చేస్తున్నాము…
ఈనాటి మానవునికి
చెట్టు చేమ కన్నా
సెల్ టవర్లే మిన్న
ఆది మానవుని కన్నా
అధమంగా జీవిస్తున్నాడు
ఆధునిక మానవుడు
ఆది మానవుడు ప్రకృతిలో జీవించాడు
ఆధునిక మానవుడు ప్రకృతిని ధ్వంసం చేస్తూ జీవిస్తున్నాడు
అంతరిక్షానికి వెళ్లానని గర్వపడుతున్నాడు
అవనిని రక్షించుకోవాలనే విచక్షణ కోల్పోతున్నాడు
అమ్మా ఉగాదీ! క్షమించమ్మా!!
అమ్మా ఉగాది!
వసంత శోభలతో
ఆమని ఆహ్లాదంతో
పూల అందాలతో
కోయిల గీతాలతో
స్వాగతం పలకలేకపోతున్నాను
అమ్మా ఉగాది! క్షమించమ్మా!!
బూర దేవానందం 81435 89789
వచ్చె క్రోధి వత్సరం
మావి చిగురు మెక్కి మత్తెక్కి పికములు
మధుర గానంబుతో మదిని దోచ
గుమిగూడి భ్రమరాలు కుసుమ కన్నెల గాంచి
మందహాసము తోడ మసలుచుండ
మ్రాను గుబురుల్లోన మధుమక్షికంబులు
మరుగైన చోటుకై తిరుగుచుండ
వనములు కొంగ్రొత్త వన్నెలు ధరియించి
వలరాజు మదిలోన వలపు నింప
వేదమంత్రాలు వీనుల విందు జేయ
కష్ట సుఖములన్ షడ్రుచులు కలుపుచుండ
భావి బ్రతుకు పంచాంగము బయలు పరచ
క్రోధి వత్సరం బరుదెంచె కోర్కెలలర
వూట్ల భద్రయ్య
95502 56840
నవ వసంతం
చైత్రమాసపు నవోదయాన
గొంతు విప్పిన
కోయిల కూజితాలతో
మంగళ ధ్వనులు కమనీయమై
ఉగాది స్వరాలు వినబడుతుంటే
నవ వసంతపు శోభలు నింప
ఎన్ని ఊహలో
ఎన్ని ఉగాదులో నవోన్మేషమై
అల్లరిగా పలకరించే
విరితావులు కొత్త ఆశల చిగురులను తొడుక్కొని
హరిత సుందరి
సరికొత్తగా ముస్తాబై
రమణీయ సోయగంతో
ప్రకృతి ముంగిట నిలిచి
నవ వసంతుడికి
స్వాగతం పలికింది
శుభాల ఊసులెన్నో
మోసుకొస్తున్న వసంతుడిని
ఆమని
ఆకుపచ్చ ఆనందమై ఆహ్వానించింది
ప్రకృతి కన్య పరవశించింది
మల్లెల సుగంధం
హాయిని నింపుతూ
మామిడి పూత పరిమళాలు గుబాళిస్తూ
షడ్రుచులతో జీవితతత్వాన్ని బోధిస్తూ
వర్ణ వర్ణ కుసుమాల
సరంజామాను
బహుమతిగా ఇస్తూ
సహజరుచుల
తీపి ఆనందాన్ని పంచగా
తెలుగు లోగిళ్ల
గుమ్మాలకు పచ్చ తోరణమై
ఇంటింటా సంబరాల
సందడి చేసింది భిన్న సంస్కృతులకు
పునాదిగా
ఉత్సాహ సమీరాల్ని తెచ్చి
స్ఫూర్తి సందేశాలిచ్చింది
శ్రీ క్రోధి నామ వత్సరం
నెల్లుట్ల సునీత
79894 60657
శ్రీ క్రోధీ స్వాగతం..
రావమ్మా శ్రీ క్రోధీ రా..
నీ రాక కోసమే మా ఎదురుచూపులు
నీ రాక కోసమే మా పడిగాపులు
తెలంగాణ గుమ్మానికి తోరణాలు కట్టి
షడ్రుచుల పచ్చళ్లను నైవేద్యంగా పెట్టి
సేమ్యా పాయసాన్నీ సిద్ధం చేశాం తల్లీ రా..
పాలపిట్టలా రెక్కలు కట్టుకుని వాలు
ఈ నేల మీద ఈ పూల తావి మీద
చెరుకు గడల ముక్కలు
తీపి చెక్కర సుడులు
ఇచ్చోటనే నీ కోసం తచ్చాడుతున్నాయి.. తల్లీ
చెలిమి తోడ చెలమల్లో నీరుబుకుతూ రా
చేదు వేప వసంతమై తేనెలూరుతూ రా…
రావమ్మా.. రా.. శ్రీ క్రోధీ రా..
కుతుబ్‌షాహీల ఖూబ్ సూరత్ ముచ్చట్లు
శాతవాహనుల సమైక్య జీవన అచ్చట్లు
కమనీయ సూఫీ బోధనా ఖిస్తీ
కవుల కళాకారుల మిశ్రమ దోస్తీ.. అబ్బో
ఇక్కడి చరిత్ర చిత్రించిన చిత్రం
ఇక్కడి ధరిత్రి లిఖించిన పత్రం
రావమ్మా.. శ్రీ క్రోధీ రా
క్రోధం వీడి మోదంతో రా… మోహనంగా రా..
భిన్నత్వం మా తత్వం ఏకత్వం మా చిత్తం
రకరకాల పూల బతుకమ్మ వోలె
ఏర్చి కూర్చుకున్న బతుకులు మావీ
జీనా యహా.. మర్నా యహా
రామ్ రహీమ్‌లు భాయీ భాయీ
మానవత్వమే అలాయీ బలాయీ
మరువని స్నేహత్వం తరగని ధీరత్వం
ఉర్సు ఉత్సవాల సమైక్య గీతం
అస్సోయ్ దుల్ హా పీర్ల పండుగ
ఇఫ్తార్ విందుల రంజాన్ మెండుగ
కళకళలాడే ఆషాడ బోనం
కువకువలాడే వేకువ రాగం
చర్చీ మసీదు ఆలయ వేదం
ప్రేమను పంచే ఆత్మ ప్రభోదం
రావమ్మా రా.. శ్రీ క్రోధీ రా..
శోధిస్తూ రా.. శోభాయమానంగా రా..
ఉరుముల మెరుపుల విప్లవ మేఘం
ఉగాది కోయిల పరిప్లవ రాగం
క్షణకాలం కమ్ముకున్న చీకట్లు నల్లవి
పాటకు జేజేలు పలికిన పల్లవి
ఇది సామరస్య విలువల గడ్డ
సమైక్య భావనల అడ్డ
నా తెలంగాణ ఉగాది హుషార్ల శోభలతో
అన్నీ ఆకళింపు చేసుకుంటూ రావమ్మా శ్రీ క్రోధి రా
ఎన్నికై రా… మన్నికై రా..
స్వాగతం… నీకు సుస్వాగతం..!
డాక్టర్ కటుకోఝ్వల రమేష్
99490 83327
ఇట్లు మీ కోయిల!
మీరు స్వాగతిస్తున్నారు సరే
మరి మీ వాకిట్లో మామిడి చెట్టు ఉందా!
మామిడి చెట్టు పండుగకు తోరణమిస్తుంది
కాయలు పండ్లతో అంగడి మామిడి
నేల మీద చల్లని నీడౌతుంది
ఎక్కడ మామిడి చెట్టు ఉందో
అక్కడికి నేను రాగమయినై వస్తాను
నాకు శాలువాలు, మాలలు, స్వర్ణ కంకణాలు వద్దు
ఏ బిరుదులు వద్దు
నాది చిన్న పొట్ట
మీకే బరువు కాను
ఇంత మామిడి చిగురు చాలు!
పంచమ రాగంతో ప్రపంచమౌతాను
కచేరికి తప్పక వస్తాను!
ముఖ్య అతిథిగా నా పేరు రాసుకోండి
నా వెంట మా కోయిలలన్నీ వస్తాయి
మామిడి చెట్టే మాకు వేదిక, వేడుక!
కందాళై రాఘవాచార్య
87905 93638