మీది మీదే మాది మాదే
భాసొక్కటే గాదు
సకలం మీది మీదే. .మాదీ మాదే
ఇడుపులపాయలా
ఇడుపు కాయితాలుంటయి
ఈరనాగమ్మలు ఉంటరు
తంగేడు పూలుంటయి
తద్దినాలుంటయి
మా పదాలు మాకు అభరణాలు
మా మాటలు మాకు సొగసులు
మా వాడుకలు మాకు వడ్డాణాలు
కప్పల బెకబెకలు.. దోర్నగిచ్చల కిచకిచలు
తాచుపాముల బుసబుసలు
ఊరవిస్కల మూలుగులు
మా పదాలు మాకు గుండెతడులు
మా వాడుకలు జీవభాషలు
ఇకారం ఇస్సీ చెయ్యకు
ఇగిలియ్యకు
ఇగిలిచ్చె పల్లు ఇంటికి సేట్
డబ్బింగ్లుండవు
అచ్చుపోసినట్లుంటది
ఇపుడు మీ విద్వేషపు మాటలు
మా గుండెల్లో పగుళ్ళు
సందర్బానికి సంగతులుంటయి
ముచ్చట్లుంటాయి.. మా అవ్వలు
ఇత్తనాలేసినట్లు..నాట్లేసినట్లు
రైకలు ముడేసుకున్నట్లు
పలుకుబడులను మండెగడ్తాం
అరువుదెచ్చుకోము.. అప్పుదెచ్చుకోము
ఆధిపత్యాలకై ఎదలిరుసుకోం
పురుడుసాని కాన్పు చేసి
బొడ్డుగోసిన భాష
మాయిముంత మాండలికాల తడులు
సేనుకోసే కొడవలి భాష
కట్టెలు కొట్టే గొడ్డలి భాష
యాటతిత్తులు దీసే కత్తి భాష
లందభాష..లగ్గంల మైలపోల భాష
బాసింగాల భాష
పుస్తె, మెట్టెల యాస
సవురం చేసే కత్తెర యాస
సరిగమల సన్నాయి శ్వాసలు
మా జీవద్భాషలు
సక్కటి ములుకోల కట్టెలా
జిట్రేగి శాగలా
కూరాడుకు నైవేద్యంలా
నీళ్లపేరుపు ఐరేనిలా.. ఫాతెహాల చిప్పలా.. మోత్కాకుల దొప్పల్లో కాల్చిన ఖార్జాల్లా
మా మాటలు మాకు పిల్లలు
మా పదాలే మా గుడిసెలకు వాసాలు
మా రాతలే మా మిద్దెకు దెంచెలు
మా నుడికారాలే మా మొగురాలు
మా అలంకారాలే మా తోరణాలు
అలుకు పెడ్తం.. బోనం పెడ్తం
ఆగిడి సాగుతం.. జమ్మిపంచుతం
పీర్లెత్తుతం మట్కీళ్లు సదివిస్తం
దొస్తరాదీన్ అంటం
ఎవరిని ఎక్కిరియ్యం.. కడుపుల కలుంటది
లొట్టినిండా కల్లున్నట్లు.. పావురాలుంటయి
అటికలనిండా ఆరివారముంటది
అంబటాలకు అంబలి.. సన్నీయపొద్దుకు బువ్వ
సల్లతో సల్లపుచ్చుకుంటం
దున్న ఇద్దాసు అచలాలు
హరికతలు యచ్చగానాలుంటాయి
రామదాసు హనమద్దాసుల కీర్తనలు
కురుమూర్తి కోలాటాలు
జంగమయ్య జాలెవోసినట్లు
ఇరగమరగ జానపండ్లు గాసినట్లు
మా జానపదాలు పెసరుతీగల కడాలు
పనిముట్ల పదాలు పోషమ్మ గుండ్లదండలు
అంకకత్తిలా అంకులు.. పన్నెండంకనాల అర్రలు
పనిముట్ల కశ్పెలు.. మంగలి కత్తుల అసిపెలు
మేదరి చాటలు.. కమ్మరి కొలుములు
పాతాళ గరిగెలు పట్టుకొస్తయి
కొంటెతనాలు కట్టిపెట్టండి
ఇమ్మతియ్యకపొయినా పర్వలేదు.. ఇకారం చేస్తే
ఇగురాలు చెడ్తయి..పక్కలు చెడ్తయి
ఇమాకత్ నడువదు
నీడలు నరికేసుకోకు! ఆగమాగం గాకు!
రాళ్లు నమిలినట్లు పదాలనములుతం
దుసరి తీగల బుట్లల్లినట్లు
చాంతాడు పేనినట్లు పద్యాలు
వడిసెలిసిరినట్లు
వలలిసిరినట్లు వాక్యాలనిసురుతం
వానొచ్చినట్లు..వరదొచ్చినట్లు
నదీ ప్రవాహంలా ఇసుర్రాయి పాటలు
వడ్లు పొటేసినట్లు కొట్నం పెట్టినట్లు కథలు
కాయితాల మీద అచ్చరాల మైదాకులు
తెలంగాణ తల్లి గొంతిప్పితే
దాసుకోవడానికి దోసిల్లు గాదు
గుమ్ములు గావాలె.. పీడెన్నడు ఇరుగడైతదో
-వనపట్ల సుబ్బయ్య
9492765358