యుద్ధం ముగిశాక నేను నీకు కొత్తగా కనిపిస్తాను
ఒట్టు నేను నీకు సరికొత్తగా కనిపిస్తాను
మా పెరటి తోటలోఎప్పటిలాగే పూసిన పువ్వులను
నీకు వాసన చూపిస్తాను
మా దిగుడు బావిలో
కన్నీళ్లు కలవని స్వచ్ఛమైన మంచినీటిని
దోసిలితో రుచి చూపిస్తాను
మల్లెపువ్వులాంటి మా చిన్నది నవ్వే నవ్వును
నీ చెంపలకు అతికిస్తాను
మా అమ్మ చేస్తున్న రొట్టె వాసనను
నీ నాసికకు అంటించి
నిన్ను మరో లోకంలో విహరింపజేస్తాను
రాలిపోయిన నవ్వుల పువ్వులను
ఏరుకుంటూ మాలకడుతున్న పిల్లల్ని చూపిస్తాను
రక్తమూ, కన్నీళ్లతో తడిసిన మట్టిని కడిగేసి
ప్రేమతో శుద్ధి చేసుకుంటున్న
మైదానాలను చూపిస్తాను
తప్పిపోయిన కుక్కపిల్ల తిరిగొచ్చిన
మా బుజ్జిదాని ఆనందాన్ని
నువ్వు అనుభవించేలా చేస్తాను
పరుగెత్తుకుంటూ వెళ్లి నియంత కోటుకు
తెల్లని గులాబీ పువ్వును
అతికిస్తున్న చిన్నదాని స్వచ్ఛమైన ఆత్మవిశ్వాసపు
నవ్వును చూపిస్తాను
యుద్ధం ముగిశాక తెగిపడిన కలల సాక్షిగా
యుద్ధమంటే ధ్వంసం చేయటంలో ఉండదని
శిథిలమైన కలల సౌధాలను
పునర్నిర్మించుకుంటూ
బతుకుల్ని నిలబెట్టుకోవటానికి
చేసే యుద్ధమే యుద్ధమని
ఒక సరికొత్త యుద్ధ పాఠం నీకు వినిపిస్తాను
-చిత్తలూరి
9133832246