తరగతి గదిలో పిల్లలకు పాఠాలు చెప్పినా, కలం పట్టి కమ్మని పద్యాలు రాసినా, సభా వేదికపై శ్రావ్యమైన కంఠస్వరంతో కవితాగానం చేసినా, చిత్ర విచిత్ర వర్ణాలతో ఆకర్షణీయమైన బొమ్మలు గీసినా, ఉలితో కఠినమైన శిలలను అందమైన శిల్పాలుగా చెక్కినా, అద్భుతమైన నటనా కౌశలంతో రంగస్థలాన్ని ఉర్రూతలూగించినా, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు చేసినా ఆయనకు ఆయనే సాటి. ఇలాంటి విభిన్న ప్రక్రియల్లో తనదైన ప్రత్యేక ముద్రను పదిలపరచుకున్న మహనీయుడు కవిరాజు నంబి శ్రీధర్‌రావు.
నంబి శ్రీధర్‌రావు నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో 1934 ఏప్రిల్ 20వ తేదీన లక్ష్మీబాయి, గుండాచార్యులు దంపతులకు జన్మించారు. బీఏ పట్టభద్రుడైన ఆయన చిన్ననాటి నుంచే తెలుగు సాహిత్యం పట్ల అభిమానం పెంచుకున్నారు. తెలుగు, సంస్కృత కావ్యాలు, వ్యాకరణ, అలంకార, ఛందశ్శాస్ర్తాలను అధ్యయనం చేశారు. సంగీతం, సాహిత్యం, శిల్పం, చిత్రలేఖనం, నాట్యం వంటి లలితకళల్లో విశేషమైన ప్రతిభ ఉన్న శ్రీధర్‌రావు అనేక సంగీత కచేరీలు చేశారు. దేవతామూరులు, దేశ నాయకుల ఆకారాలను అత్యంత రమణీయమైన శిల్పాలుగా తీర్చిదిద్దారు. పద్యాలు, పాటలు, తత్వాలు, శ్లోకాలు, మంగళహారతులు మొదలైన ప్రక్రియల్లో రచనలు చేసి, పండిత పామరులను ఆయన మెప్పించారు. నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన వంటి మహాకవుల శైలి శ్రీధర్‌రావు కవిత్వంలో కనిపిస్తుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
‘పొత్తంబై కడు నేర్పుతో హితము నుద్భోధించు మిత్రుండు సం
విత్తంబై యొక కార్య సాధనమునన్ వెల్గొందు మిత్రుండు స్వా
యత్తంబైన కృపాణమై యరుల నాహారించు మిత్రుండు ప్రో
చ్ఛిత్తంబై సుఖమిచ్చు మిత్రుండు తగన్ శ్రీ లొంక రామేశ్వరా’
మిత్రుడు మంచి పుస్తకం లాంటివాడు. ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తాడు. అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటాడు. ఆపదలో రక్షణ కవచంలా ఉండి శత్రువుల నుంచి కాపాడుతాడు. మనస్సుకు హాయిని, సుఖాన్ని కలిగించేవాడు అసలైన మిత్రుడని మిత్రుని లక్షణాలను పై పద్యంలో చక్కగా వివరించారు శ్రీధర్‌రావు.విశ్వనాథ సత్యనారాయణ, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, దివాకర్ల వేంకటవధాని, డా.సి.నారాయణరెడ్డి వంటి మహా కవులతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగియుండేవారు శ్రీధర్‌రావు. వారితో కలిసి అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సుదీర్ఘమైన సాహిత్య చర్చలు కూడా చేసేవారు.శ్రీ మన్నింబగిరి నరసింహ శతకం, శ్రీ లొంక రామేశ్వర శతకం, శారదా గణితం, ప్రహ్లాద చరిత్ర, శ్రీకృష్ణలీలలు, శ్రీ దుర్గా వరదాయినీ స్తోత్రమాల, శ్రీ మన్నింబాచల క్షేత్ర మహాత్మ్యం, శ్రీధరీయం, గోరు వంక, తెలుగు పూదోట, చందమామ, రవళించు హృదయం, జనని, హిందువులం మొదలైన 15 కావ్యాలు రాశారు శ్రీధర్‌రావు.
‘గరుడ గమన కలుష దమన
జలధి శయన జలజ నయన
దుష్ట శిక్షణా! దేవా! శిష్ట రక్షణా!
నీవు నీవే నేను నేనే
నింబగిరి నిలయా నృసింహా’
వంటి తత్వాలు ఎందరినో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ తత్వాలను అక్కడి ప్రజలు పాడుకుంటారు. గణితం నేర్చుకోవడంలో విద్యార్థులకు కలిగే ఇబ్బందులను స్వయంగా గ్రహించి గణిత సూత్రాలను పద్యాల్లో రాస్తే బాగుంటుందని భావించి ‘శారదా గణితం’ అనే పుస్తకం రాశారు శ్రీధర్ రావు. ఈ పుస్తకం విద్యార్థులకు చక్కని కరదీపికలా ఉపయోగపడుతున్నది.
‘శ్యామలా కమలా కలా ఫణి
హార నూపుర మేకలా!
రామ మానస వాసినీ శత
రాజబింబ విభాసినీ!’
అంటూ దుర్గామాతను కీర్తిస్తూ రాసిన గీతం అత్యంత సుందరంగా, అమృత ధారలా పరవళ్లు తొక్కుతుంది. ‘శ్రీ మన్నింబాచల మాహాత్మ్యం’ అనే నిర్వచన పద్య కావ్యాన్ని ప్రత్యేకమైన శైలిలో రచించి ఆ క్షేత్రనాథుడు లక్ష్మీనరసింహస్వామికి అంకితం చేశారు శ్రీధర్‌రావు. ఈ కావ్యంలోని వర్ణనలు అద్భుతంగా ఉండడమే కాకుండా సమకాలీన జీవనానికి అద్దం పడుతాయి. తెలంగాణ పల్లె జీవితం, ఆనాటి సాంఘిక ఆచారాలు, జీవన వైవిధ్యాలు, దైనందిన జీవితంలోని కార్యక్రమ సరళి మన కండ్లకు కట్టినట్లు చిత్రించారు శ్రీధర్‌రావు. ఆయన రాసిన పద్యాలు ప్రస్తుతం పదవ తరగతి విద్యార్థులు పాఠ్యాంశంగా చదువుకుంటున్నారు.
‘భూములు భామలు గీములు
కామాలయ గోపురములు
కనువిందగు త
త్సీమల జేరేడు జఢునకు
క్షేమం బెటులబ్బు
నింబగిరి నరసింహా’
ఇలాంటి అద్భుతమైన ఎన్నో పద్యాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఈ పద్యాలు ఇప్పటికీ జనం నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. అనేక సాహిత్య సంస్థలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న శ్రీధర్‌రావు ఎన్నో సభా కార్యక్రమాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ర్టాలకు కూడా అతిథిగా వెళ్లి ఎన్నో బిరుదులు, పురస్కారాలు, గౌరవ సత్కారాలు పొందారు. 2000 సెప్టెంబర్ 19న నంబి శ్రీధర్‌రావు పరమపదించారు.
-తిరునగరి శ్రీనివాసస్వామి ,9440369939