రెప్పపాటుల వెనుక దాక్కుని
సామ్రాజ్యాలను కూల్చేసే
ఒక అదృశ్య హంతకుడు
ఆయుధం పట్టడు, రక్తం చిందించడు
నిలువెల్లా గాయాలు చేసి
గతాన్ని శ్మశానంగా మారుస్తాడు
మొగ్గను పువ్వుగా మార్చే ప్రేమ అతనిదే,
ఆ పువ్వును రాల్చే క్రూరత్వమూ అతనిదే.
ఎవరికీ లొంగడు, ఎవరి కోసమూ ఆగడు
తన లయ తప్పని అడుగులతో
జగత్తును శాసించే ఏకైక ఏకాకి
గడియారపు ముల్లుల వెనుక
నవ్వుకునే ఒక నిరంకుశ శిల్పి
నువ్వు గెలవాలని చూసేలోపే
నీ ఆయుష్షును అనుమతి లేకుండా
తీసుకునే ఒక నిశ్శబ్ద నియంత!
వర్తమానాన్ని తన చేతులతో
మలుస్తున్న ఒక సృజనశీలి
– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
8008577834