హైదరాబాద్ మెట్రో దారెటు!
హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థకు తలమానికంగా నిలిచే మెట్రో రైలు ప్రాజెక్టు భవిష్యత్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం కారణంగా అడ్డంకుల పాలవుతున్నది. వెనుకా ముందూ చూసుకోకుండా ఎల్ అండ్ టీ నుంచి మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆర్థిక చిక్కుముడుల్లో ఇరుక్కుపోయింది.
హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థకు తలమానికంగా నిలిచే మెట్రో రైలు ప్రాజెక్టు భవిష్యత్తు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం కారణంగా అడ్డంకుల పాలవుతున్నది. వెనుకా ముందూ చూసుకోకుండా ఎల్ అండ్ టీ నుంచి మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయం ఆర్థిక చిక్కుముడుల్లో ఇరుక్కుపోయింది. కేంద్రం సాయం అందిస్తుందని, త్వరలో ప్రక్రియ పూర్తవుతుందని ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంటే మరోవైపు కేంద్రం అసలు ఈ వ్యవహారంతో తమకు సంబంధమే లేదన్నట్లుగా సంకేతాలు వెలువరిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ హైదరాబాద్ మెట్రో రెండో దశ తన పరిధిలోకి రాదని, ఐఆర్ఎఫ్సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) నుంచి రావాల్సిన రూ.13,500 కోట్ల రుణం గురించి తనకు తెలియదని చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారమంతా హుళక్కే అని తేలిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేకసార్లు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేసిన సంగతి తెలిసిందే.
2025 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి, ఎల్అండ్టీ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో సుమారు రూ.13,500 వేల కోట్ల రుణభారాన్ని రాష్ట్రం స్వీకరించి, అదనంగా ఈక్విటీకి పరిహారం చెల్లించి మొదటి దశను స్వాధీనం చేసుకోవడానికి సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరింది. అయితే, అందుకు నిధులు సమకూరక ఆ ఒప్పందం ముందుకు కదలక మొరాయిస్తున్నది. మెట్రో మొదటి దశ స్వాధీనానికి రూ.13,500 కోట్ల రుణానికి ఐఆర్ఎఫ్సీ అంగీకరించడంతో స్వాధీన ప్రక్రియకు మార్గం సుగమమైందని అంతా అనుకున్నారు. జపాన్‌కు చెందిన ఆర్థిక సంస్థ నుంచి తక్కువ వడ్డీతో నిధులు సమకూర్చే ప్రతిపాదన ఉన్నదని, సుమారు నాలుగు శాతం వడ్డీతో రుణాన్ని పొందడం ద్వారా ఎల్అండ్టీ తీసుకున్న పాత రుణంపై ఉన్న 8.25 శాతం వడ్డీ భారాన్ని తగ్గిస్తామని రాష్ట్ర సర్కార్ గొప్పలు చెప్పుకొన్నది. ఇందుకుగాను సుమారు రూ.1,440 కోట్ల మార్జిన్ మనీ, రూ.84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించినట్లు సీఎం వెల్లడించారు. అయినప్పటికీ రుణం విడుదల కాకపోవడంతో పీటముడి పడింది. జూన్‌లో రేవంత్‌రెడ్డి కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, రుణం విడుదల చేయాలని లేదా రాష్ట్రం ప్రత్యామ్నాయ మార్గాల్లో విస్తరణ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్బీఐ క్యాప్స్ ద్వారా మరోసారి ఆస్తుల విలువను అంచనా వేయించడం, కొత్త రుణ మార్గాలను అన్వేషించడం కూడా ప్రక్రియను మరింత జాప్యం చేస్తున్నాయి. కేంద్రం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో మెట్రో స్వాధీనం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మెట్రో ప్రాజెక్టు రూపకల్పన గతంలో జరిగినప్పటికీ, కేసీఆర్ పాలనలోనే మొదటి దశలోని మూడు కారిడార్ల నిర్మాణం వేగం పుంజుకొని 2017 నుంచి 2020 మధ్య దశలవారీగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సుమారు 69 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ వ్యవస్థ హైదరాబాద్ రవాణా ముఖచిత్రాన్ని మార్చివేసింది. నగర విస్తరణను ముందుగానే అంచనా వేసిన కేసీఆర్ ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌కు రూపకల్పన చేసి, 2022 డిసెంబర్లో శంకుస్థాపన కూడా చేసింది. అంతేకాకుండా నగరంలోని పలు ప్రాంతాలకు మెట్రో అనుసంధానం కల్పించే విస్తరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ సర్కార్ ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టు మెట్రో మార్గాన్ని పక్కనపెట్టి, కొత్త మార్గాల వెతుకులాట మొదలుపెట్టింది. ‘మొదటిదానికి మోక్షం లేదు..కడదానికి కల్యాణం’ అన్నట్టుగా స్వాధీనం సమస్యే పరిష్కారం కాలేదు, ఈలోగా రెండో దశ డోలాయమానంలో పడింది. దీంతో నగరానికి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు దారీతెన్నూ లేకుండా పోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ రుణ మార్గాలపై వేగంగా నిర్ణయం తీసుకొని, మెట్రో స్వాధీనానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించడం మంచిది. ఎల్అండ్టీతో మిగిలిన ఒప్పంద సమస్యలను పరిష్కరించి, రెండో దశ ఆమోదంపై దృష్టి పెట్టాలి.
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

