నవనవశోభలన్ దనరి నందన సీనుగ మారిపోయెనీ
యవనికి రత్నమైన మహిమాన్వితరాష్ట్రము నిత్యవృద్ధితో
నవిరళదీక్షతో ప్రగతి నందినవేళ దశాబ్ది వేడుగల్
సువిశదపై జనావళికి చూడగ కన్నుల పంటలయ్యెడిన్ !
రైతులకండదండలుగ రాష్ట్రములో వెలుగొందె బంధుర
ప్రతతిగ ‘రైతుబంధు’ జనకంజితసేవలు గ్రామసీమలన్
జతకలియంగ నాగులుల జాతరలే విలసిల్లె నెల్లెడన్
వ్రతముగ జేసినట్టి గుణరాజితకర్మల నుద్యమోద్ధతిన్!
పల్లెలు రాష్ట్రపున్ ప్రగతి బాటలు వేయుచు సాగుచుండగా
కొల్లగ రూపరేఖలును గోచరమైనవి యెందుగాంచినన్
ముల్లెలు గట్టు సంపదల మూలములై జనజీవితాలలో
నల్లిన స్నేహమాలికలు నభ్యుదయమ్ముల బాట వట్టెడిన్ !
పట్టణముల్ నవీనమగు వాసములన్ వికసింపజేయుచున్
పెట్టని కోటలై కనకవీధులవోలిక వెల్గుచుండెడిన్
కట్టుచు రమ్య సౌధముల గాచుచు జీవన వాహినిన్ సదా
పట్టగలేని మోదముల పాత్రములైనవి నేడు చూడగన్!
త్రావగ మంచినీరములు దప్పిక దీర్చుచునింటిలోననే
సేవలనిచ్చుచున్నవి యశేషజనమ్ముల యార్తి దీర్చుచున్
భూవనిలో భగీరథుని పూర్వుపు సేవల పూలదారిలో
కావగనిల్చె నాళముల కమ్మనిధారలు ప్రాణదాతలై !
చెరువులు పూర్ణకుంభముల జీవనధారల నిండిపోవగా
కరువులు దీరిపోయునవి కాన్కలనిచ్చుచుపైరుపంటలన్
నిరతము మత్స్యకారులకు నిండెడి వృత్తుల నిచ్చి పండుగల్
జరుపగ డప్పుచప్పుడుల తానములాడెడి దివ్యకన్యలై !
ఆసరలన్ సరాసరిగ నందగజేయుచు దీనసేవలో
భాసురమార్గజాలముల వాసిల జేయుచు పెండ్లిసాయముల్
వేసటలేని యుత్సుకత వేనకువేలుగ లబ్ధినొందగా
కాసుల పంటలన్ గొనెడి కైవడి క్షేమములుల్లసిల్లెనే!
పచ్చదనమ్ములేర్పరచి భాసిలురాష్ట్రములోననేయెడన్
మెచ్చుధనమ్ములై విరియు వేడ్కలు విచ్చిన పూల సెజ్జలై
మచ్చికజేసికొన్నవి సమస్త తరూర్భవ సంఫలద్రుచుల్
నచ్చిన నందనమ్ములయి నాటుచు మొక్కల నిక్కునందముల్!
వేలును లక్షలున్ కనగ విద్యలు గ్రంథపు పెన్నిధుల్ భళీ
వాలుచున్నవీ ధరణి వాసిలుచాత్రుల పాఠశాలలన్
మేలగు చిత్రలేఖనసమీరిత యంతరజాల విద్యలన్
చాలినవై వినోదముల శారదలై వికసించి మించవే
అమరులుగా యశోధనులనందగజేసిన పుణ్యభూమియై
యమలిన వైభవమ్ములకు నావహమై శివమైప్రసిద్ధమై
ప్రముదిత రాష్ట్రశోభ భువి రాజిలుచున్నది నింగిదాకగా
రమణమహార్ణవోపమచిరత్నపురత్నము భారతవనిన్ !
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
94404 68557