Watch Band | రోజూ వాడే వాటినే.. ‘వావ్’ అనిపించేలా ముస్తాబు చేసుకోవడంలో అసలైన మజా ఉంది. కాలాన్ని తెలిపే గడియారమైనా సరే, కాలంతో పాటు పరిగెడితేనే మనకు నచ్చుతుంది. అందుకే రిస్ట్ వాచీ కూడా అమ్మాయిల అవుట్ ఫిట్‌కు సరిపోయేలా ముస్తాబు అవుతున్నది. రకరకాల రంగులు, తీరొక్క డిజైన్లు తనలో పొదువు కుంటున్నది.
వాచీ అంటే చేతికి పెట్టుకునేదే కాదు, కట్టుకునేది కూడా అన్న రీతిలో సరికొత్త సొబగులు అద్దుకుంటున్నది. ‘టాప్ నాట్ బో స్క్రంచీ వాచ్ బ్యాండ్’లు ఈ కోవలోవే. రబ్బర్ బ్యాండ్ తరహాలో ఉండే వీటిని స్మార్ట్ వాచీకి పెట్టుకోవచ్చు. అందమైన వస్త్రంతో చేసిన హెయిర్ బ్యాండ్‌ను చేతికి ముడేసుకున్నట్టు ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాయివి. ఈ ట్రెండీ నాట్ స్క్రంచీలు మ్యాచింగ్ ప్రియులకూ తెగ నచ్చుతున్నాయి. మ్యాచింగ్ రేఖ దాటకుండా, ఫ్యాషన్ వృత్తంలో ఉండే వీటిని పెట్టుకుంటే ఎక్కడైనా మనమే కేంద్ర బిందువు.. అదీ లెక్క!