చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయడానికి కారణాలు అనేకం ఉంటాయి. పని ఒత్తిడి, ఆఫీస్ రాజకీయాలు, తక్కువ జీతం, సరైనగుర్తింపు లభించక పోవడం.. ఇలా విషయం ఏదైనా కావొచ్చు.. ఉద్యోగం మానేయాలనే ఆలోచన ఇప్పుడు చాలామందికి కలుగుతున్నది. వెంటనే రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. అయితే, రాజీనామాకు ముందు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొన్ని విషయాలపై లోతైన స్పష్టత ఉండాలి. ఆ తర్వాతే.. ముందడుగు వేయాలి.

‘ఇష్టపడే పనిని మాత్రమే చేయండి. నచ్చిన రంగాన్నే ఎంచుకోండి’.. కొన్ని దశాబ్దాలుగా మోటివేషనల్ స్పీకర్లు నూరిపోస్తున్న మాటలివి. వినడానికి అద్భుతంగా ఉన్నా.. వీటిని ఆచరణలో పెట్టడం అంత సులువుకాదు. కానీ, చాలామంది ఈ మాటలను నమ్మి.. చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుంటారు. ఇష్టపడే పని దొరక్క.. ఆర్థిక కష్టాల చట్రంలో ఇరుక్కు పోతారు. అందుకే, అవకాశం వచ్చేవరకు.. మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే ఉద్యోగంలో కొనసాగడమే మంచిది. అది అవసరం కూడా!

నిజానికి మీ ఉద్యోగ హోదా కన్నా.. మీరే ఎంతో విలువైనవారు. మీ ఐడీ కార్డుపై ఉండే మీ డెజిగ్నేషన్.. మీకు అంతగా నచ్చకపోవచ్చు. కానీ, మీ విలువ కేవలం ఆ హోదాపైనే ఆధారపడి లేదు. మీరు అంటే.. మీ పదవి, మీ జీతం మాత్రమే కాదు. కొన్నేళ్లుగా చిన్నహోదాలోనే కొనసాగుతున్నంత మాత్రాన.. చింతించాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే, ఆఫీస్‌లో మీ హోదా.. ఓ వ్యక్తిగా, ఓ మంచి భాగస్వామిగా, ఓ బాధ్యతాయుతమైన పేరెంట్‌గా.. మీ విలువను తగ్గించలేదు. అందుకే, మీ విలువను మీ ఉద్యోగ హోదాతో ముడిపెట్టడం మానేయండి.
ఉద్యోగం, ఆత్మగౌరవం.. ఒకే ఒరలో ఇమడలేని కత్తులు. ఆత్మగౌరవం కోసం ఆరాటపడితే.. ఉద్యోగంలో ఆత్మసంతృప్తి పొందలేరు. అందుకే, మీ ఆత్మగౌరవాన్ని మీ ఉద్యోగం నుంచి వేరు చేయండి. అప్పుడే మీ జీవితాన్ని మరింతగా ఆస్వాదించడం మొదలుపెడతారు. వృత్తిపరమైన ఎదురుదెబ్బలను వ్యక్తిగతంగా తీసుకోవడం మానేస్తారు.

ఉద్యోగం మానేయడమే మేలు.. అనే స్పష్టత మీలో ఉంటే, నిరభ్యంతరంగా ముందుకు సాగండి. కానీ, రాజీనామా చేయడానికి ముందే.. మీకున్న ఇతర అవకాశాలను పరిశీలించుకోండి. ఎప్పటి నుంచో నేర్చుకోవాలి అనుకుంటున్న కోర్సును ఇప్పుడే ప్రారంభించండి. మీరు ఆసక్తి చూపిస్తున్న రంగంలోని నిపుణులతో చర్చించండి. ఫ్రీలాన్సింగ్ లాంటివీ ప్రయత్నించి చూడండి. ఉద్యోగంలో కొనసాగుతూనే ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల.. మీకు ఓ సేఫ్టీ నెట్ ఉంటుంది.
చివరగా.. ఈ అంశాలన్నిటినీ పరిశీలించిన తర్వాత, మీరు ఉద్యోగం మానేయాలా? వద్దా? అనే దానిపై ఒక నిర్ణయానికి రండి. అన్నిటిపైనా స్పష్టత తెచ్చుకొని.. మీ పునాదిని మరింత బలోపేతం చేసుకోండి. సమయం తీసుకుని అన్నిటికీ సిద్ధమవ్వండి. పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ తదుపరి అడుగు వేయండి. మీ జీవితాన్ని మార్చుకునే హక్కు.. మీ చేతుల్లోనే ఉంటుందని గుర్తుంచుకోండి.