తాజాగా విడుదలైన ‘బార్బీ’ హాలీవుడ్ మూవీ సంచలనాలు సృష్టిస్తున్నది. ఈ సినిమాలో బార్బీ బొమ్మను ఓ పాత్రగా మలిచారు దర్శకుడు. అంతర్జాతీయంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది కూడా. ఆ ప్రభావం ఫ్యాషన్ ప్రపంచం మీదా పడింది. బార్బీ వన్నె అయిన పింక్‌కు ఆదరణ పెరిగింది. ఆ రంగు డ్రస్‌లు, బ్యాగులు, పాదరక్షలు, లిప్‌స్టిక్ మొదలైనవి ఎగబడి కొంటున్నారు మహిళా జనం.
సాక్షాత్తు బార్బీ నిర్మాతలే.. ప్రత్యేక ఒప్పందాలు చేసుకుని మరీ స్పెషల్ ఎడిషన్లు విడుదల చేస్తున్నారు. ఇదో మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా. గృహాలంకరణలోనూ ఈ రంగు హల్చల్ చేస్తున్నది. గులాబీ రంగు సోఫాలు, కుర్చీలకు ఎక్కడలేని గిరాకీ వచ్చేసింది. అంతర్జాతీయ గడియారాల కంపెనీ ఫాజిల్ బార్బీ రేంజ్ రిస్ట్ వాచీలు, జువెలరీ ఆవిష్కరించింది. ఈ ట్రెండ్‌కు కారణమైన బార్జీ పాత్రధారి మార్గోట్ రాబీకి పింక్ మార్కెట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి.