హోంమంత్రి ఇచ్చిన ‘ది మిస్టరీస్ ఆఫ్ ద్వారకా’ అసైన్మెంట్ ఏమిటో తెలుసుకొందామని తన టీమ్‌తో కలిసి డీసీపీ ఆఫీసుకు వెళ్లాడు రుద్ర. డీసీపీ డైరెక్టుగా పాయింట్‌కు వచ్చాడు. ‘రుద్ర అండ్ టీమ్ అందరూ జాగ్రత్తగా వినండి. మీ తెలివితేటలు, నిబద్ధతను చూసి మీకు సీబీఐ, సీఐడీ, ఎన్ఐఏ, ఐబీ, రా వంటి డిపార్ట్మెంట్స్ కూడా సాల్వ్ చేయలేని అత్యంత క్లిష్టమైన కేసులు ఇద్దామని ప్రభుత్వం భావించిన మాట వాస్తవమే. అయితే, ఇటీవల గుజరాత్ తీరంలోని ద్వారకా రహస్యాలను అన్వేషించే క్రమంలో కొన్ని కీలక ఆధారాలు దొరికాయి’ అంటూ చెబుతూపోయాడు.
డీసీపీ మాట్లాడుతూ ‘ఆ రహస్యాలను ఛేదిస్తూ ఈ మిషన్‌ను ముందుకు తీసుకొనిపోవడం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి కొంచెం కష్టంగా మారింది. అందుకే ఆర్కియాలాజీ అధికారులతో సమన్వయం చేసుకొంటూ ద్వారకా రహస్యాలను ఛేదించే బృహత్తర కార్యాన్ని ప్రభుత్వం మీకు అప్పగించింది. మనకు కేవలం 7 రోజుల సమయాన్నే కేటాయించారు. ఇంత తక్కువ సమయాన్ని కేటాయించడానికి కారణాలు ఏంటో ఇప్పటికైతే తెలియదు. అది పక్కనబెడితే, మనతో పాటు ఈ మిషన్‌ను ముందుకు తీసుకుపోవడానికి ఆర్కియాలాజీ డిపార్ట్మెంట్ నుంచి ధరణి, శివ, రుత్విక్, శ్రియాన్ష్తో కూడిన టీమ్ కూడా సాయపడుతుంది. అన్నట్టు ఈ మిషన్‌కు రిపోర్టింగ్ ఇంచార్జీగా ప్రభుత్వం నన్ను నియమించింది. ఏం రుద్ర ఓకేనా?’ అంటూ అనగానే ‘ఓకే ఏంటి సార్.. చాలా హ్యాపీ’ అని సంతోషంగా అన్నాడు రుద్ర. నవ్వుతూ మళ్లీ ప్రారంభించాడు డీసీపీ. ‘ఇప్పటివరకూ సేకరించిన ద్వారకా విశేషాలను ఆర్కియాలజీ టీమ్ హెడ్ ధరణి చెప్తుంది’ అన్నాడు డీసీపీ. తనను పరిచయం చేసుకొన్న ధరణి మొదలుపెట్టింది.
‘హిందూ పురాణాలు, ఇతిహాసాల ప్రకారం శ్రీకృష్ణుడి కర్మభూమిగా ద్వారకను కొలుస్తారు. హిందువుల ఏడు మోక్ష నగరాల్లో ఇదొకటి. జరాసంధుడి దాడుల నుంచి తన ప్రజలను రక్షించుకునేందుకు కృష్ణుడు మథురను వీడి, గోమతీ నదీ, అరేబియా సముద్ర సంగమ ప్రాంతానికి వెళ్తాడు. దేవశిల్పి విశ్వకర్మ సాయంతో అక్కడ సుందర ద్వారకా నగరాన్ని నిర్మించాడని విశ్వాసం. దీనినే బేట్ ద్వారకా అంటున్నారు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణాల్లో ఉంది. సముద్ర అంతర్భాగంలో ఇప్పటికే కొన్ని అవశేషాలు దొరకగా, తాజాగా మాకు ఓ పెద్ద పెట్టె దొరికింది. దాన్ని ఎలా ఓపెన్ చెయ్యాలో కూడా అర్థంకావట్లేదు. ఎంతో ప్రయత్నించాం. అయితే, శబ్దబంధనంతో ఆ పెట్టెను కట్టడి చేసినట్టు కొందరు పండితుల ద్వారా తెలుసుకొన్నాం. దాన్ని ఓపెన్ చేయడంలో మీ సాయం కావాలి. ఆ పెట్టెను తెరిస్తేనే, మన పరిశోధనలను మరింతగా ముందుకు తీసుకెళ్లగలం’ అని ధరణి ఆగింది.
‘ఆ పెట్టె.. దేవీపుత్రుడు సినిమాలో చూయించిందైతే కాదు కదా! ఒకవేళ, ఆ పెట్టే, ఈ పెట్టే ఒకటే అయితే.. దాన్ని తెరిచిన మనపై అమ్మవారు విరుచుకుపడతారు’ అంటూ భయంతో స్నేహిల్ అన్నాడు. ‘అదేంలేదు. అది సినిమా. ఇది వాస్తవం. రుద్ర.. మీరు సాయం చేయగలరా?’ అంటూ ధరణి అనగానే.. అవునంటూ తలూపిన రుద్ర.. డీసీపీ దగ్గర సెలవు తీసుకొని పెట్టెను దాచిన రహస్య ప్రాంతానికి టీమ్‌తో సహా బయల్దేరాడు.
బేట్ ద్వారకాకు సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న ఓ అడవిలోని ఓ గోడౌన్లో పెట్టెను భద్రంగా ఉంచారు. కట్టుదిట్టమైన సెక్యూరిటీని దాటుకొని రుద్ర టీమ్ అండ్ ధరణి టీమ్ మెంబర్స్ పెట్టె దగ్గరకు చేరుకొన్నారు. వేల ఏండ్లుగా సముద్రంలో ఉండటంతో పెట్టె కళావిహీనంగా మారిపోయింది. కొన్ని రసాయనాలతో ఆ పెట్టె ముందుభాగాన్ని క్లీన్ చేశారు. పెట్టెపై ఇలా రాసి ఉంది.. ‘ద్వారకాం నిమజ్జితవతీ మేషపత్నీశాపః, బ్రహ్మచారిణిః జాతస్య పుత్రస్య కర్మచ తౌకౌ? సమ్యగుత్తరం దత్తే ఏవ శబ్దబంధనం విమోక్ష్యతే! మిథ్యోత్తరం దత్తే చేత్ పేటికా భస్మీభవిష్యతి!!’.. దాన్ని తెలుగులో తర్జుమా చేసిన ధరణి అర్థాన్ని ఇలా చెప్పింది. ‘ఓ మేక సతీమణి ఇచ్చిన శాపం, ఓ బ్రహ్మచారికి పుట్టిన కొడుకు చేసిన కర్మ వల్ల ద్వారకా నగరం నీటిలో మునిగిపోయింది. ఆ ఇద్దరి పేర్లను సరిగ్గా చెప్తే, శబ్దబంధనం వీడి పెట్టె తెరుచుకుంటుంది. తప్పుగా చెప్తే, పెట్టె భస్మీపటలమవుతుంది’ అని అర్థాన్ని వివరించిన ధరణి.. కాసేపు ఆగి.. మరోచోట రాసిన దాన్ని చదివింది. దాని ప్రకారం.. ఈ పెట్టెను మూడుసార్లు చెయ్యితో తట్టిన ఐదు సెకండ్లలోపు సమాధానాలు చెప్పాలన్నట్టు రాసి ఉన్నదన్న ధరణి.. ‘ఎవరికైనా సమాధానాలు తెలుసా?’ అంటూ అడిగింది.
‘ఏంటండీ.. ఈ పిచ్చి ప్రశ్నలు. ఎక్కడైనా మేకకు భార్య ఉంటదా? బ్రహ్మచారికి పిల్లలు పుడతారా? ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు’ అంటూ స్నేహిల్, రామస్వామి అంటుండగానే.. పెట్టె దగ్గరకు వచ్చిన రుద్ర కరెక్ట్‌గా ఇద్దరి పేర్లను చెప్పడంతో పెట్టె ఒక్కసారిగా తెరుచుకొంది. అది చూసిన అందరూ షాకయ్యారు. రుద్ర ఏ ఇద్దరి పేర్లు చెప్పినట్టు??
సమాధానం:
రుద్ర చెప్పిన ఇద్దరి పేర్లు.. గాంధారీ, సాంబుడు. మేక సతీమణి గాంధారీ (జాతక దోషం వల్ల దృతరాష్ర్టునికి ముందు గాంధారిని మేకపోతుకు ఇచ్చి వివాహం చేస్తారు) శాపం, బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు చేసుకొన్న కర్మ కారణంగానే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. అందుకే, ఆ రెండు పేర్లను రుద్ర కరెక్ట్‌గా చెప్పడంతో పెట్టె తెరుచుకొంది.
– రాజశేఖర్ కడవేర్గు