new year decisions | ఇవాళ, రేపు, ఎల్లుండి, మర్నాడు.. ఎప్పుడైనా సరే మనం ఆరోగ్యాన్నే కోరుకుంటాం. కోరుకోవాలి కూడా. అందుకే పాత ఏడాది వెళ్లిపోయి, కొత్త సంవత్సరం వచ్చిన ప్రతిసారీ మనం తీసుకునే నిర్ణయాల్లో ఒక్కటైనా ఆరోగ్య తీర్మానం ఉంటుంది. బరువు తగ్గాలనో, యోగా నేర్చుకోవాలనో, శాకాహారిగా మారిపోవాలనో… ఏదో ఓ నిర్ణయానికి వస్తాం. ఈ పది ప్రమాణాలకూ సిద్ధపడితే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. కొత్త ఏడాది నుంచీ దినచర్యలో వీటిని భాగం చేసుకోండి. ఆ మార్పు కొద్దిరోజులు ఇబ్బందిపెట్టినా.. ఆ తర్వాత అనేక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది.
క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారితో పోలిస్తే.. అసలు చేయించుకోనివారు సగటున తొమ్మిదేళ్ల ముందుగా చనిపోతున్నట్టు ఒక అధ్యయనం వెల్లడించింది. మీ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగిన ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండటం అన్నివిధాలా మంచిది. ఏ వయసు వారైనా సరే.. కనీసం ఏడాదికోసారి హెల్త్ చెకప్ తప్పనిసరి.
కొత్త ఏడాదిలో ఏలాగైనా సరే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? అయితే వారానికి ఒకసారి తప్పకుండా బరువు చూసుకోవాలి. అది కూడా ప్రతి బుధవారం అయితే మనకు కచ్చితమైన రీడింగ్ వస్తుంది. ఎందుకంటే, బుధవారం వారానికి మధ్యలో ఉంటుంది. ఇటీవల పీఎల్ఓఎస్ వన్ అనే ఒక పత్రికలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మాటిమాటికీ బరువు చూసుకునేవారు త్వరగా బరువు తగ్గుతున్నారని తేలింది. అలాగే వారం రోజులకు మించి బరువు చూసుకోని వాళ్లు బాగా లావైపోయారట. నిజమే, బరువు చూసిన ప్రతిసారీ బాధ్యత పెరుగుతుంది.
వయసు పెరిగేకొద్దీ మన శరీరంలోని అస్థిపంజర కండరం క్షీణిస్తూ ఉంటుంది. వృద్ధాప్య లక్షణాలను అదుపు చేయాలంటే.. ఈ కండరాలను రక్షించుకోవాలి. రోజూ బరువులెత్తే వ్యాయామాలు చేయడం ద్వారానే ఇదంతా సాధ్యం. నడుము చుట్టుకొలతను మనిషి ఆరోగ్యానికి సూచికలా చెప్పవచ్చు. దీన్ని తగ్గించుకోవడం వల్ల వయసు వేగానికి పగ్గాలు వేయవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం కండరాల్ని బలపరిచే వ్యాయామాలతో పాటు పొత్తికడుపు దగ్గరి కొవ్వును కరిగించే ఏరోబిక్స్ తరహా కసరత్తుల్నీ చేయాలి.
జంతు ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్లు వస్తున్నాయని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. అందుకే ఈ ఏడాది తీర్మానాల్లో కూరగాయలు, ఆకుకూరలతో వండిన ఆహారాలను ఆరగించాలని నిర్ణయించుకోండి. మాంసం, చీజ్, ఐస్‌క్రీమ్, పాలు లాంటివాటిని కూడా అచ్చంగా మొక్కల ఉత్పత్తుల నుంచే తయారు చేస్తున్నారు. పాలు, పాల పదార్థాల వినియోగాన్ని బాగా తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్న నేపథ్యంలో వాటికి కూడా దూరంగా ఉండండి. పక్కా వేగన్ అంటే.. పాలు, పెరుగులాంటివి కూడా తీసుకోని శాకాహారులు అన్నమాట.
కేకులు, కుకీలు, డోనట్స్ సహా నేరుగా తినేందుకు వీలైన ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో శక్తి, చక్కెరలు, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధనలో వెల్లడైంది. అందుకని, ఈ ఏడాది రెడీమేడ్ చిరుతిళ్లకు దూరంగా ఉండాలని తీర్మానించుకోండి.
ప్రతి మనిషీ చేయాల్సిన పనులు, సాధించాలనుకున్న లక్ష్యాలు చాలా ఉంటాయి. వృత్తి పరంగా కొన్ని టార్కెట్స్ పెట్టుకుంటాం. వాటిని సమీక్షించుకొని కొత్త ఏడాదిలో ఎలా ముందుకెళ్లాలన్నది నిర్ణయించుకోండి. ఆధ్యాత్మికంగా, భావోద్వేగాల పరంగా, అనుబంధాల పరంగా, ఆర్థికంగా.. ఇలా మీరు ఏం కోరుకుంటున్నారో, ఆ మజిలీని చేరుకోవడానికి ఏం చేయదలచుకుంటున్నారో కూడా ఆలోచించుకోండి. అవసరమైన ప్రణాళికనూ రచించుకోండి.
అసలెందుకు ఆరోగ్య తీర్మానాలు? అనే ప్రశ్నకు సరైన జవాబు వెతకండి. రోగాలు దరిచేరకుండా ఉండేందుకా, ఏక్దమ్ ఫిట్‌గా కనిపించేందుకా?.. మీ మనసులోని మాటను ఓ కాగితం మీద రాసుకోండి. తీర్మానాల అమలు గాడితప్పినప్పుడు.. పునఃసమీక్షించుకోడానికి ఈ పత్రం పనికొస్తుంది.
మనిషికి శ్వాస కీలకమైంది. ప్రాణవాయువు నుంచే ప్రాణశక్తి లభిస్తుంది. శ్వాసను నియంత్రించడం ద్వారా దీర్ఘాయువు లభిస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. శ్వాసమీద ధ్యాసపెట్టి ధ్యానం చేయడం ద్వారా ఆందోళన, కుంగుబాటు నుంచి బయటపడొచ్చని, అధిక రక్తపోటును, మధుమేహాన్ని అదుపుచేయవచ్చనీ ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, కొత్త ఏడాది ధ్యానం, ప్రాణాయామం జీవనశైలిలో భాగం చేసుకోండి.
నిద్రలేమి జీవక్రియలో మార్పులకు కారణం అవుతుంది. దీనివల్ల అతితిండి, ఊబకాయం లాంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్ర తగ్గినప్పుడు మనం ఒత్తిడిలో ఉన్నామనే సంకేతాన్ని తీసుకుంటుంది శరీరం. దీంతో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ విడుదల అవుతుంది. దానివల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. మధుమేహం బారిన పడతారు. అలా కాకుండా చక్కగా నిద్రపోవాలంటే.. ముందుగా గదిని చీకటిగా మార్చుకోవాలి. నిద్రకు ముందు తిండి, వ్యాయామం వద్దు. స్నానం చేసి, టీవీ ఆపేసి, లైట్ల వెలుతురును తగ్గించి పడుకునేందుకు సిద్ధం అవ్వండి. పరిసరాలు కూడా శరీరాన్ని నిద్రకు సమాయత్తం చేస్తాయి. రాత్రిపూట ఆల్కహాల్, కెఫీన్ పదార్థాలకు దూరంగా ఉండండి.
ఎదుటివాళ్లతో పోల్చుకోవడం, అందులోనూ సెలెబ్రిటీలతో పోల్చుకోవడం ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీస్తుంది. ఏ విషయంలో అయినా మనకన్నా మెరుగ్గా ఉండేవాళ్లు, తక్కువగా ఉండేవాళ్లు… రెండు రకాల మనుషులూ ఉంటారు. కానీ ఇతరులతో పోల్చుకోవడం వల్ల అనవసరమైన కోరికలు పెరుగుతాయి. అర్థంలేని చికాకు, సమయం వృథా తప్ప సాధించేది ఏమీ ఉండదు. ప్రపంచంలో మీకు మీరే ప్రత్యేకం. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సంతోషంగా ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్.