పదిహేను వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది.. రజన్ అల్ అజామి. సౌదీ అరేబియాలో స్కై డైవింగ్ విన్యాసాలు చేయడానికి అధికారిక లైసెన్స్ పొందిన తొలి మహిళగా ఇప్పటికే రజన్ రికార్డు సృష్టించింది. తాజాగా సౌదీ పతాకాన్ని చేతిలో పట్టుకుని 15 వేల అడుగుల ఎత్తు నుంచి విమానంలోంచి బయటికి దూకింది. మేఘాలతో ముచ్చట్లు చెప్పుకొని.. రియాద్ నగరం సమీపంలో నేల మీదికి దిగింది.
సౌదీ అరేబియాలో స్కై డైవింగ్ శిక్షణ సంస్థలు లేవు. అయినా నిరాశపడకుండా.. ఆ సాహస క్రీడ మీద మక్కువతో దుబాయ్ వెళ్లి స్కై డైవింగ్ పాఠాలు నేర్చుకున్నదామె. అజామి చారిత్రక విజయం సౌదీ మహిళల్ని ఆలోచింపజేస్తున్నది.
భయాలను, అపోహలను పక్కనపెట్టి సాహస క్రీడల వైపుగా అడుగులు వేయాలని అజామి కోరుతున్నది. ఆ పిలుపునకు చాలామంది స్పందించారు కూడా. మిగతా రోజుల్లో సంప్రదాయ దుస్తులకు పరిమితమైనా, అజామి దగ్గర శిక్షణకు మాత్రం.. జంప్ సూట్, సేఫ్టీ హెల్మెట్‌తో హాజరవుతున్నారు. స్కై డైవింగ్‌లో రాటుదేలుతున్నారు.