వజ్రం.. ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆ ధగధగలు.. ఆచంద్రతారార్కం. కాబట్టే,తన ఆభరణాల పెట్టెలో ఎన్ని నగలున్నా.. వజ్రం లేకపోతే మగువ మనసుచిన్న బుచ్చుకుంటుంది. తన అలంకరణ అసంపూర్ణమైనట్టు భావిస్తుంది.ముక్కెర నుంచి హారం వరకు.. ఒక్క వజ్రపు నగ ధరించినా చాలు.. ఆ ముస్తాబులో ఆమె జగదేకసుందరే! కాబట్టే, వజ్రానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. వజ్రాల వ్యాపారం ఊపందుకుంటున్నది. అయితే,మార్కెట్లో మెరిసేవన్నీ డైమండ్స్ కావని హెచ్చరిస్తున్నారు వజ్రాల వ్యాపారంలో అడుగుపెట్టిన తొలి దక్షిణాది మహిళగా పేరొందిన రాధిక మన్నె. అనేక అవరోధాలను తట్టుకుని ఒకటిన్నర దశాబ్దం నుంచీ వజ్రాల వ్యాపారంలో రాణిస్తున్నారామె. డైమండ్స్ కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాధిక మాటల్లోనే..
Radhika Manne | వజ్రమా, కాదా? అనేది నా మట్టుకు నేను చూడగానే చెప్పగలను. దశాబ్దాల అనుభవంతో సాధించిన నైపుణ్యం ఇది. కానీ శాస్త్రీయంగా నిరూపించాలంటే కచ్చితమైన ఆధారాలు కావాలి. సర్టిఫికేషన్ ఉండాలి. వజ్రాలు భూగర్భంలో మాత్రమే దొరుకుతాయని అనుకుంటారు. నిజానికి, భూగర్భంలో పుట్టినా.. కాలక్రమేణా పుట్టిన ప్రాంతం నుంచి వానలు, వరదల సమయంలో నదీనదాల్లో చేరుకోవచ్చు. ప్రవాహంలో కొట్టుకొనిపోయి ఇతర ప్రాంతాల్లోనూ లభిస్తాయి.
ఆ ప్రవాహ వేగంలో తమదైన ఆకారాన్ని కోల్పోతాయి. డైమండ్స్ అన్ని రంగుల్లోనూ దొరుకుతాయి. తెలుపు వర్ణంలో ఉన్నదే డైమండ్ అనుకోవడం అపోహే. అయితే, రంగును బట్టి వాటి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒక్క డైమండ్‌కు మాత్రమే ఉపరితలం మెరుపుతో ఉంటుంది. ఈ ప్రత్యేకత ఏ ఇతర రత్నాలకూ ఉండదని గుర్తుంచుకోవాలి.
మనకు దొరికే డైమండ్స్‌లో 90 శాతం ఆభరణాలకు పనికిరావు. వజ్రం పారదర్శకతను బట్టి నిపుణులు దాని విలువ నిర్ధారిస్తారు. డైమండ్స్ కొనుగోళ్లలో చాలా మోసాలు జరుగుతుంటాయి. నాసిరకాలను విలువైన వజ్రాలుగా చెప్పి విక్రయించేవారూ ఉన్నారు. ఆ ప్రచారం నమ్మొద్దు. సూరత్ లాంటి ప్రాంతాల నుంచి తెప్పించి క్యారట్ రూ.5 వేల చొప్పున అంటగట్టే మోసగాళ్ల వలలో పడకండి. డైమండ్‌ను పోలిన రంగురాళ్లతోనూ జాగ్రత్త.
చిన్న పరీక్షతో…
వజ్రం కొంటున్నప్పుడు ఏ చిన్న అనుమానం వచ్చినా ఓ చిన్న పరీక్ష చేయండి. లైటర్ వెలిగించి.. వజ్రంగా చెబుతున్నదాన్ని 30 సెకన్లు వేడిచేయాలి. తర్వాత దాన్ని నీళ్లు నింపిన గాజు గ్లాసులో వేయాలి. ముక్కలైపోతే మాత్రం, అది అచ్చమైన గాజురాయే. నిజమైన వజ్రం వేడిని తట్టుకుంటుంది, దృఢంగా ఉంటుంది. భూతద్దంతో పరిశీలిస్తే వజ్రంలో అన్ని కోణాలు చాలా పదునుగా కనిపిస్తాయి. మైక్రోస్కోప్ ద్వారా కూడా పరిశీలించొచ్చు. వజ్రాన్ని అటూ ఇటూ కదిలిస్తే ఆరెంజ్ కలర్లో చిన్నపాటి ఫ్లాష్ కనిపించాలి. అదే నిఖార్సయిన వజ్రం.
‘కృత్రిమ’ కష్టాలు
మార్కెట్లో అసలు వజ్రాలకు, కృత్రిమ వజ్రాలకు మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ల్యాబ్‌లో తయారు చేసినవి కూడా సహజ వజ్రాల్లానే మెరుస్తాయి. అయితే, కృత్రిమ వజ్రాలపై కొనుగోలుదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. తక్కువ ధరకే లభిస్తున్నా.. భవిష్యత్తులో రీసేల్ వ్యాల్యూ ఉండదనే కారణంతో వెనకడుగు వేస్తున్నారు. మాయిసనైట్, క్యూబిక్ జిర్కోనియా, వైట్ సఫైర్, యాగ్ వంటివన్నీ వజ్రాన్ని పోలి ఉంటాయి. కానీ అంత మెరుపు, మన్నిక, దృఢత్వం ఉండవు. వీటిని తేలికగా గుర్తించొచ్చు. కానీ ల్యాబ్‌లో తయారుచేసే కృత్రిమ వజ్రాలను వేరుచేసి కనిపెట్టడం మాత్రం చాలా కష్టం. రసాయనికంగా, భౌతికంగా, మెరుపు పరంగా.. ఎలా చూసినా కృత్రిమ వజ్రాలు అతి సహజంగా కనిపిస్తాయి.
వజ్రం చరిత్ర..
భూమిలో 500 నుంచి 600 మీటర్ల లోపలికి తవ్వితే కానీ వజ్రాలు లభ్యం కావు. దీనివెనుక ఏంతో శ్రమ దాగి ఉంటుంది. భూమి లోపలి పొరల్లో వేల సంవత్సరాల పాటు చోటు చేసుకున్న రసాయన చర్యల కారణంగా వజ్రం తయారవుతుంది. వజ్రం కార్బన్‌తో తయారవుతుంది. దీంతో చాలామంది డైమండ్ బొగ్గు నుంచి వస్తుందని భావిస్తారు. ఇది నిజం కాదు. వందల మైళ్ల లోతున అత్యధిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద వజ్రాలు ఏర్పడతాయి. ఇందులోని పరమాణువులు స్ఫటికాకృతితో కనిపిస్తాయి. అందుకే వజ్రం అంత దృఢంగా ఉంటుంది. సహజంగా లభించే వజ్రాల వయసు వందకోట్ల ఏండ్ల నుంచి మూడువందలయాభై కోట్ల ఏండ్లు ఉంటుంది.
వజ్రాన్ని కొనడం అంటే.. ఓ చరిత్రను సొంతం చేసుకోవడం. ఓ అపూర్వ సంపదకు యజమాని కావడం. ఆ ప్రయత్నంలో
ఏ ఒక్కరూ మోసపోకూడదని నా ఆరాటం. నా వజ్ర సంకల్పం కూడా!
నమ్మకమే వ్యాపారంగా..
వజ్రాల వ్యాపారం నాకు చాలా నేర్పించింది. డైమండ్స్ కోసం దేశమంతా తిరిగాను. విదేశాల్లో పర్యటించాను. ఆరేడు కోట్ల రూపాయల వజ్రాలను వెంటబెట్టుకుని ఒక్కదాన్నే ప్రయాణించాను. సెలెబ్స్ సర్కిల్స్‌లో నగల డిజైనర్‌గా ప్రత్యేకత, గుర్తింపును తెచ్చుకున్నాను. అయితే, ఇదంతా ఒక్కరోజులో జరగలేదు. వజ్రాల వ్యాపారంలో నమ్మకం, స్థిరత్వం ప్రధానమని నమ్ముతాను. డైమండ్ జువెలరీ వ్యాపారంలో రాణిస్తూ.. బెస్ట్ ఆంత్రప్రెన్యూర్ అవార్డులు దక్కించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
నగరంలో జరిగే సెలెబ్రిటీ ఈవెంట్స్, ఫ్యాషన్ షోలలో నేను డిజైన్ చేసిన కస్టమైజ్డ్ జువెలరీ తళుక్కున మెరవాల్సిందే. బంగారం ఎక్కడ కొనుగోలు చేసినా పర్లేదు.. కానీ డైమండ్ జువెలరీ మాత్రం తెలిసిన వారి దగ్గరే కొనుగోలు చేయాలి. ఈ రంగంలో మోసానికి ఆస్కారం ఎక్కువ. రంగు లేనిదే బెస్ట్ డైమండ్. గోధుమ, పసుపు రంగులో ఉంటే ధర కొంత తక్కువే. ఈ విషయాలపై ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పర్చుకోవాలి. తరచూ నేను కస్టమర్స్ కోసం అవేర్నెస్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తుంటాను.
…? ఇడుమాల కిరణ్ కుమార్