తన జీవితంలో జరుగుతున్న వాటి కంటే పక్క వాళ్ల జీవితంలో జరుగుతున్న సంగతులపైనే కొందరికి ఆసక్తి ఎక్కువ. ఇదే పుకార్ల వేగాన్ని, ఆదరణను వేయి రెట్లు పెంచుతున్నది. సెలెబ్రిటీలకు సంబంధించిన పుకార్లు అయితే చెప్పేదేముంది? మీడియాని, సోషల్ మీడియాని ఏలేస్తాయి. సెలెబ్రిటీల జీవితం గురించి గాసిప్స్ సరే, ఆ గాసిప్స్ వారి జీవితాల్లో ఎలా ఉంటాయో తెలుసుకునేందుకూ సోషల్ మీడియాలో ఆసక్తి చూపుతున్నారు. తన భర్త నిక్ జోనాస్‌తో జరిగే గాసిప్ సంభాషణల గురించి బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా యూట్యూబ్ చానెల్ ‘జోనాస్ బ్రదర్స్’లో చెప్పింది. ఇప్పుడీ సంగతులు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.
బాలీవుడ్లో తన గురించి, ఇతర తారల గురించి పుట్టే పుకార్లను తనకంటే ముందు తన భర్తే తెలుసుకుంటాడట. ఒక్కోసారి కొందరి మ్యారేజ్ డేలకు శుభాకాంక్షలు చెప్పాలని ప్రియాంక ప్రిపేర్ అవుతుంటే, ‘వద్దులే.. వాళ్లు విడిపోయే దారిలో ఉన్నారు’ అని తన ప్రయత్నానికి బ్రేకులు వేసేవాడట. కొత్త సహజీవనాలు, బ్రేకప్‌లు బాలీవుడ్లో సాధారణమే అయినా వాటిని ప్రియాంక కంటే ముందు తన భర్తే తెలుసుకునేవాడట. కొన్నాళ్ల తర్వాత గాసిప్‌ల కోసం సినిమా టాబ్లాయిడ్లు, సోషల్ మీడియా కంటే నిక్ జోనాస్ మీదే ఆధారపడేదట. తన గురించి లోకం ఏమనుకుంటుందో తెలుసుకోవాలంటే తన భర్త చెప్పే సంగతులే వినేదట. పాడ్ కాస్ట్లో ఈ పాడు ముచ్చట్లన్నీ విన్నా వాళ్ల మధ్య స్పర్ధలే లేకుండా సంతోషంగా జీవిస్తున్నందుకు కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే, పుకార్లు చెప్పే భర్త దొరకడం ప్రియాంక అదృష్టమని ఇంకొందరు అంటున్నారు.