Rising Stars | అమ్మాయిల్ని మాత్రమే కాదు, అబ్బాయిల్ని కూడా ఆత్మ విశ్వాసంతో, స్వేచ్ఛగా పెంచడం సవాలుతో కూడిన వ్యవహారమే అంటారు ప్రముఖ నటి నందితా దాస్. పుట్టినప్పటి నుంచి ఎనిమిదేండ్లు వచ్చే వరకు తన కొడుకుతో అనుభవాలను క్రోడీకరిస్తూ ‘రైజింగ్ స్టార్స్’ అనే పుస్తకంలో ఓ వ్యాసం రాశారు నందిత. ఇందులో బాలీవుడ్ అమ్మలు పిల్లల్ని పెంచడంలో ఉన్న సవాళ్లను చర్చించారు.
“దురదృష్టవశాత్తూ మన సామాజిక నిర్మాణమే లైంగిక వివక్షను ప్రోత్సహించేలా ఉంది. బొమ్మల దుకాణాల్లోకి వెళ్తే పాపలకు, బాబులకు వేర్వేరు సెక్షన్లు ఉంటాయి. ఏ కారణంతో అయినా అబ్బాయి ఏడిస్తే.. ‘అమ్మాయిలా ఏంటా కన్నీళ్లు?’ అని తిట్టేస్తారు. అమ్మాయి కాస్త నిర్లక్ష్యంగా కనిపిస్తే.. ‘మగరాయుడిలా ఉండొద్దు’ అని తలంటుతారు. దీనికి పరిష్కారంగా.. పిల్లలకు జెండర్ సెన్సిటివిటీని పరిచయం చేయాలి. అబ్బాయిలతోనూ ఇంటి పని చేయించాలి. దీనివల్ల అమ్మాయిల్ని గౌరవించడం అలవాటు అవుతుంది. పెద్దయ్యాక పనిలో జీవితభాగస్వామికి సాయపడతారు. అనుబంధాలు బలపడతాయి. సరైన మార్గదర్శకత్వం ఉంటేనే పిల్లల్లో సమతూకం ఏర్పడుతుంది. పిల్లలకు పర్యవేక్షణతో కూడిన స్వేచ్ఛ ఇవ్వడమే మేలు” అంటారు నందిత తన వ్యాసంలో.