Lords of Deccan చరిత్ర పుటల్లో తప్పొప్పులు, సవరింపులు ఉండొచ్చు. కానీ, కాలపరీక్షను తట్టుకొని నిలబడిన ఆలయాలు మాత్రం నిఖార్సయిన చరిత్రకు నిలువుటద్దంలా నేటికీ దర్శనమిస్తాయి. యువ రచయిత అనిరుధ్ కనిసెట్టి రాసిన ‘లార్డ్స్ ఆఫ్ ద దక్కన్’ సంకలనంలో దక్షిణాది రాష్ర్టాల్లోని ప్రముఖ ఆలయాల విశేషాలను పొందుపరిచాడు. ‘సదరన్ ఇండియా ఫ్రమ్ చాళుక్యాస్ టు చోళాస్’ ఉపశీర్షికతో ఆనాటి వైభవాన్ని ఆంగ్ల భాషలో అక్షరీకరించాడు. రచయితగా తొలి ప్రయత్నానికే అనిరుధ్ సాహిత్య అకాడమీ యువ పురస్కారమూ అందుకున్నాడు.
ఈ విజయానికి కొనసాగింపుగా ‘లార్డ్స్ ఆఫ్ ద దక్కన్’ ఆధారంగా చారిత్రాత్మక వెబ్‌సిరీస్ నిర్మిస్తామని సినీనటుడు రానా ప్రకటించడం విశేషం. దగ్గుబాటి స్పిరిట్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ సంయుక్తంగా దీనిని నిర్మించనున్నాయి. దక్షిణాది చరిత్రను లోతుగా చూపించే ప్రయత్నం చేస్తామని సోనీ లివ్ ప్రకటించింది. ఏదైనా సాహిత్యాన్ని తెరకెక్కించే క్రమంలో చాలా మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ‘ఈ పుస్తకం విజువల్ ఫ్రెండ్లీగా రాయడం వల్ల పెద్దగా మార్పులు ఉండకపోవచ్చ’ని అనిరుధ్ చెబుతున్నాడు. మొత్తంగా ఈ యువ రచయిత మొదటి విజయానికి ఓటీటీ వందనం చెప్పింది.