‘ఇది నిజంగా మామిడిపండా? లేక ఐస్‌క్రీమా?’… సోషల్ మీడియాలో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ప్రశ్న ఇదే! పండ్ల ఆకారంలో, నిజమైన పండ్ల మాదిరిగానే కనిపించే ‘హైపర్ రియలిస్టిక్ ఫ్రూట్ ఐస్‌క్రీమ్’లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మామిడి, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, నిమ్మ ఇలా ఏ పండునైనా అచ్చం నిజమైన రూపంలో తయారు చేసి అందులో ఐస్‌క్రీమ్ నింపడం ఈ డెజర్ట్ ప్రత్యేకత.
ఫుడ్ ఆర్ట్, కులినరీ క్రియేటివిటీ కలయికగా రూపొందుతున్న ఈ ఐస్‌క్రీమ్‌లు చూడటానికి కళాఖండాల్లా ఉంటాయి. మొదట చూసినవారికి అవి నిజమైన పండ్లేనని అనిపిస్తుంది. కట్ చేసిన తర్వాత మాత్రమే లోపల క్రీమీ ఐస్‌క్రీమ్ ఉందని తెలుస్తుంది. కళ్లకు నిజమైన విందు చేసే డెజర్ట్‌గా ఇవి యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రత్యేకంగా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్ వీడియోల్లో ఈ ఫ్రూట్ ఐస్‌క్రీమ్‌లు మిలియన్ల వ్యూస్ సంపాదిస్తున్నాయి. ఫుడ్ బ్లాగర్లు, షెఫ్‌లు వీటిని కొత్త ఫ్యాషన్ డెజర్ట్‌గా ప్రమోట్ చేస్తున్నారు. రుచితోపాటు రూపానికి కూడా ప్రాధాన్యం పెరిగిన ఈ కాలంలో, ఈ ఐస్‌క్రీమ్‌లు ఆహారానికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయని చెప్పాలి.