Idli Batter | ఇంట్లో ఇడ్లీ పిండిని తయారు చేసే వారందరికీ వేసవి కాలం ఒక చిన్న సవాల్‌లాంటిదే. చలికాలంలో రాత్రంతా నెమ్మదిగా పులిసే పిండి, వేసవిలో మాత్రం కొన్ని గంటల్లోనే ఎక్కువగా పులిసి రుచిని కోల్పోతుంది. పిండి త్వరగా ఉబికిరావడం, ఎక్కువ పులుపుగా మారడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్‌గా రాకుండా రుచిలో తేడా వస్తుంది. అందుకే పాతకాలం నుంచి వంటగదుల్లో కొన్ని సులభమైన చిట్కాలను అనుసరిస్తున్నారు. అందులో ఒకటి పిండిపై తమలపాకును ఉంచడం. ఈ చిట్కా ప్రధానంగా ఫర్మెంటేషన్ను నియంత్రించడంపై ఆధారపడి ఉంటుంది. తమలపాకులో స్వల్పంగా యాంటీమైక్రోబియల్, ఎంజైమాటిక్ గుణాలు ఉంటాయి. ఇవి పిండిలో ఉండే బ్యాక్టీరియా క్రియాశీలతను పూర్తిగా ఆపకుండా, కొంతమేర నియంత్రించడంలో సహాయపడతాయి. దీని వల్ల పిండి సరైన స్థాయిలోనే పులుస్తుంది.
వేసవిలో పిండికి వచ్చే ప్రధాన సమస్య ఎక్కువ పులుపు. అధిక వేడి వల్ల మైక్రోబియల్ యాక్టివిటీ వేగంగా పెరిగి పిండి త్వరగా పులుస్తుంది. తమలపాకు ఉపయోగించడం వల్ల ఈ ప్రక్రియ కొంత నెమ్మదిస్తుంది. దీంతో పిండిలో పులుపు ఎక్కువ కాకుండా, రుచి మృదువుగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రంతా పిండిని ఉంచే సమయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తమలపాకు మరో ప్రయోజనం స్వల్పమైన సువాసన. ఇది చాలా బలంగా ఉండకపోయినా, పిండికి ఒక తేలికపాటి తాజాదనాన్ని ఇస్తుంది. దీనివల్ల ఇడ్లీలు కొంచెం మెరుగైన రుచితో ఉంటాయి. ఇది సంప్రదాయ వంటలో కనిపించే చిన్న మార్పే కానీ ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ పద్ధతి అనేక దక్షిణ భారతీయ ఇళ్లలో తరతరాలుగా కొనసాగుతోంది. అందరూ వాడకపోయినా, వాడే వారు దీని ప్రయోజనాలను నమ్ముతారు. సులభంగా లభించే సహజ పదార్థంతో ఈ చిట్కాను పాటిస్తే వచ్చే లాభం చాలా మందికి తెలిసే ఉంటుంది.
ఈ చిట్కాను ఉపయోగించే విధానం కూడా చాలా సులభం. సాధారణంగా ఇడ్లీ పిండిని సిద్ధం చేసిన తర్వాత పాత్రలో పోసి, పై భాగంలో శుభ్రమైన తమలపాకును ఉంచాలి. తర్వాత మూత పెట్టి పులియనివ్వాలి. ఉపయోగించే ముందు ఆ ఆకును తీసేయాలి. ఆకును ఉపయోగించే ముందు బాగా కడగడం తప్పనిసరి. ఈ పద్ధతి ముఖ్యంగా ఎక్కువ వేడి, తేమ ఉన్న రోజులలో ఉపయోగకరంగా ఉంటుంది. పిండి చాలా త్వరగా పులిసే పరిస్థితుల్లో ఇది నియంత్రణ ఇస్తుంది. అయితే చల్లని వాతావరణంలో ఈ చిట్కా అవసరం ఉండకపోవచ్చు. ఇలాంటి చిన్న వంట చిట్కాలు అనుభవంతో వచ్చేవే. తమలపాకు పెట్టడం చిన్న మార్పులా అనిపించినా, వేసవిలో ఇడ్లీలు మెత్తగా, సరైన రుచితో రావడానికి ఇది సహాయపడుతుంది.