సాధారణంగా చద్దన్నం అంటే ఇష్టపడని వాళ్లే ఎక్కువగా ఉంటారు. కొందరైతే చద్దన్నం అనే మాట వింటేనే వాక్.. అంటారు. అమ్మో.. చద్దన్నం తినడం నావల్ల కాదు అని చెబుతుంటారు. కానీ ఒక్కసారి చద్దన్నంవల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకున్నారంటే ఇకపై చద్దన్నం వద్దు అనే మాట మీ నోట రానే రాదు. రాత్రి మిగిలిన అన్నాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పొద్దున తినడం మాత్రమే కాదు.. రాత్రికి మిగలేలా అన్నం వండుకుని మరీ ఉదయాన్నే చద్దన్నం తింటారు. ఇంతకూ చద్దన్నంలో ఉన్న ఆ గొప్ప తనం ఏంటో తెలుసుకుందామా..?
చద్దన్నంతో ప్రయోజనాలు..
చద్దన్నంతో ఎన్ని రకాల లాభాలుంటాయో ఇటీవల అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ అధ్యయనం చేసి వెల్లడించింది. ఆ అధ్యయనం ప్రకారం.. అన్నం పులిస్తే ఐరన్, పొటాషియమ్, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది. అందుకే చద్దన్నంలో ఆ పోషకాల పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రాత్రి వండిన అన్నంలో 100 గ్రాములకు 3.4 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే.. తెల్లారేసరికి అది 73.91 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది. బీ6, బీ12 విటమిన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. అందుకే చద్దన్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటక్గా ఉంటుంది.
అంతేగాక చద్దన్నంతో శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా లభిస్తుంది. వేడి చేయడం కారణంగా శరీరంలో కలిగే దుష్ఫలితాలను చద్దన్నం తగ్గిస్తుంది. తరచూ చద్దన్నం తినడంవల్ల పీచుదనం పెరిగి మల బద్దకం, నీరసం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా రక్తపోటు (బీపీ) అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది. శరీరం ఎక్కువసేపు ఉల్లాసంగా ఉండటానికి తోడ్పడుతుంది. అంతేగాక ఒంట్లోని అలర్జీ కారకాలు, మలినాలు తొలగిపోతాయి. పేగుల్లో అల్సర్ల వంటివి ఉంటే తగ్గిపోతాయి. ఎదిగే పిల్లలకు కూడా చద్దన్నం మంచి పౌష్టికాహారం.
లావుగా ఉన్నోళ్లు సన్నబడొచ్చు.. బక్కపలుచగా ఉన్నోళ్లు లావు కావచ్చు..
తరచూ చద్దన్నం తినడంవల్ల సన్నగా ఉన్నవాళ్లు లావయ్యేందుకు, లావుగా ఉన్నవాళ్లు సన్నబడేందుకు కూడా అవకాశం ఉంది. లావు తగ్గాలంటే రాత్రి మిగిలిన అన్నాన్ని రాత్రే చల్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తినాలి. రోజూ ఇలా చేయడంవల్ల స్థూలకాయులు క్రమంగా లావు తగ్గుతారు. అదేవిధంగా రాత్రి మిగిలిన అన్నంలో పాలుపోసి చిటికెడు పెరుగుతో తోడేసుకుంటే తెల్లారేసరికే తోడన్నం తయారవుతుంది. నిత్యం ఈ తోడన్నం తినడంవల్ల సన్నగా ఉన్నవాళ్లు క్రమంగా ఒళ్లు చేస్తారు.
ఇలా పాలతో తోడేసిన అన్నాన్ని గానీ, చల్లలో నానబెట్టిన అన్నాన్నిగానీ నేరుగా తినబుద్దికాకపోతే వాటికి ఉల్లిముక్కలు, టమాటా, క్యారెట్ లాంటివి కలుపుకుని తాలింపు పెట్టుకుని కూడా లాగించొచ్చు. అయితే, ఇలా చేసి పెట్టుకున్న చద్దన్నాన్ని తప్పనిసరిగా ఉదయాన్నే తినాలి. మరింత ఆలస్యం చేస్తే అది ఎక్కువగా పులిసి అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.