మంచి జీతం వచ్చే లక్షణమైన ఉద్యోగం వదిలేసి మేకల బ్యాంకు ప్రారంభించారామె.సరికొత్త మార్గంలో వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొత్త జీవితాలు ప్రసాదిస్తున్నారు. జయంతి మహాపాత్ర ఆలోచన పల్లెలకు కొత్త కళ తెచ్చింది. వలసల్ని అడ్డుకున్నది. ఆశల్ని నింపుతున్నది.
బ్యాంకులు మన ఆర్థిక వ్యవస్థకు ఆధారం. పొదుపు-మదుపు ప్రయత్నాలకు సాకారం. మన కష్టార్జితం భద్రంగా ఉంటుందనే నిశ్చింత. అవసరానికి చవకైన రుణాలు దొరుకుతాయనే ఆశ. బ్యాంకు కొలువులు ఎంతోమందికి ఉపాధి కూడా. ‘అయినా, బ్యాంకింగ్ వ్యవస్థ మౌలిక సూత్రాలను డబ్బుకే ఎందుకు పరిమితం చేయాలి?’ అనే ఆలోచన వచ్చింది ఒడిశాకు చెందిన జయంతి మహాపాత్రకు.
ఇప్పటి వరకూ మనకు బ్లడ్ బ్యాంక్ తెలుసు. మిల్లెట్ బ్యాంక్ గురించీ వినే ఉంటాం. బుక్ బ్యాంక్, సీడ్ బ్యాంక్.. తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. కానీ, మేకల బ్యాంక్ గురించి ఎక్కడా విని ఉండకపోవచ్చు. గోట్ బ్యాంక్ ప్రస్థానం తెలుసుకోవడానికి ముందు.. ‘మణికాస్తు ఆగ్రో’నూ పరిచయం చేసుకోవాలి. ఈ సంస్థ మహారాష్ట్రలోని ఫల్టాన్లో ఉంది. గోట్ బ్యాంక్ నిర్వహణలో కీలక పాత్ర మణికాస్తుదే.
ఈ కంపెనీని కూడా జయంతే స్థాపించారు. ఏదో పనిమీద పల్లెకు వెళ్లిన ప్రతిసారీ ఎవరో ఒకరు, ‘నగరంలో మాకు ఏదైనా ఉద్యోగం చూసిపెట్టండి మేడమ్!’ అని దీనంగా అడిగేవారట ఆమెను. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరిగితేనే వలసలు ఆగుతాయి. ఊళ్లు కళకళలాడుతాయి. నైపుణ్యంతోనే ఉపాధి సాధ్యం. కాబట్టే, నైపుణ్యానికి పెద్దపీట వేశారామె. అది కూడా వ్యవసాయ ఆధారితంగానే ఉండాలని భావించారు. ‘మణికాస్తు ఆగ్రో’ ఏర్పాటు లక్ష్యమూ అదే.
జయీభవ.. జయంతి
జయంతి ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందినవారు. ఉన్నత విద్యావంతురాలు. పదేండ్ల క్రితం వరకూ ఆమెకు లక్షణమైన ఉద్యోగం ఉండేది. భర్త బీరేన్ సాహు కూడా సంపాదనాపరుడే. ఇద్దరి జీవితం సాఫీగా సాగిపోయేది. కొంతకాలానికి కార్పొరేట్ కొలువు మొహం మొత్తింది. ఇద్దరూ కొలువులకు రాజీనామా సమర్పించి.. స్వగ్రామం చేరుకున్నారు. పల్లెల్లో నెలకొన్న పరిస్థితుల్ని దగ్గర నుంచీ చూశాక ఓ స్థిర నిర్ణయానికొచ్చారు.
నలుగురికి ఉపాధి చూపే దిశగా అడుగులు వేశారు. అప్పుడే, వాళ్ల దృష్టి మేకల మీదికి మళ్లింది. మేక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో
కీలక పాత్ర పోషిస్తుంది. మేక పాలు విక్రయిస్తూ ఉపాధి పొందేవారు ఎంతోమంది. మేకలు మారకంగా కూడా పని చేస్తాయి. పది మేకలు ఒక ఎద్దుతో సమానం కావచ్చు. ఓ మేక విలువ బస్తా గింజలూ కావచ్చు. ఆ సూత్రం ఆధారంగానే ‘గోట్ బ్యాంక్’ను స్థాపించారు.
అదీ తమ సొంతూరిలో. కలహండి జిల్లాలోని సలేభటా గ్రామం జయంతి ప్రయోగాలకు వేదికైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ బ్యాంకు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఇక్కడ రైతులకు రుణాలిస్తారు. కాకపోతే, డబ్బుగా కాదు, మేకల రూపంలో. మేకల్ని సొంతంగా కొనే శక్తి లేనివారికి.. గోట్ బ్యాంక్ ఓ రెండు మేకలను అందిస్తుంది. సాధారణంగా ఏడాది వయసు నుంచే మేకలు.. తమ సంతతిని వృద్ధి చేస్తాయి. నిర్ణీత వ్యవధి తర్వాత అందులో సగం మేకల్ని బ్యాంకుకు డిపాజిట్ చేయాలి. వాటిని ఇంకొంత మందికి పంపిణీ చేస్తారు.
కలహండి పరిసరాల్లోని నలభై గ్రామాల్లో వెయ్యి కుటుంబాలు మేకల పెంపకం ద్వారానే ఉపాధి పొందుతున్నాయి. ఆ మూగజీవుల ఆరోగ్య బాధ్యత ‘మణికాస్తు ఆగ్రో’ తీసుకుంటుంది. వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది. మేకల ఎరువు, పాలు, పెరుగు విక్రయాల ద్వారా బ్యాంకు అదనపు ఆదాయాన్ని సమకూర్చు కుంటుంది.
ప్రస్తుతం మహారాష్ట్రలోని పల్టాన్, ఒరిస్సాలోని సలేభటాలో మేకల బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అత్యుత్తమమైన మేకల జాతులను ఎంపిక చేయడం, వాటికి నాణ్యమైన ఆహారం సరఫరా చేయడం, వైద్య సేవలు అందుబాటులో ఉంచడం.. ఇలా ప్రతి దశలోనూ గ్రామీణులకు అండగా నిలుస్తారు జయంతి. ఆ తపనకు గుర్తింపుగా ‘ఒడిశా స్త్రీ శక్తి అవార్డు’ అందుకున్నారామె. మరిన్ని మేకల బ్యాంకులు స్థాపించే పనిలో ఉన్నారు జయంతి.
పదేండ్ల ప్రయాణంలో మేకల బ్యాంక్ అనేక విజయాలు సాధించింది. వేల జీవితాలను మార్చింది. వలసలను ఆపింది. ఆత్మహత్య ఆలోచనలను అధిగమించే ధైర్యం ఇచ్చింది. చాలామంది మేకల్ని అమాయకత్వానికి చిహ్నంగా భావిస్తారు. దుర్బలత్వానికి ప్రతీకగా సంబోధిస్తారు. ఇక్కడ మాత్రం మేకలే బలం. మేకలతోనే ఉపాధి.
-జయంతి
…? పాసికంటి శంకర్