కొవిడ్‌లో చాలామంది ఉపాధిని కోల్పోయారు. అదే సమయంలో కోల్‌కతా తీరాన్ని ‘అంఫన్’ తుఫాను చుట్టుముట్టింది. జనం ఎక్కడికీ కదలలేని పరిస్థితి. దీంతో కౌశిక్ దాస్ అనే ఆర్ట్ డైరెక్టర్, ఆయన సహాయకురాలు ప్రియాంక ఒక పరిష్కారం ఆలోచించారు. ఇంట్లోనే ఉంటూ కొంత సొమ్ము సమకూర్చుకునేలా పాత దుస్తులు, అటకెక్కిన వస్తువులతో వినూత్నమైన ఉత్పత్తులు తయారు చేయించి అమ్మాలనుకున్నారు. పాత దుస్తులతో మాస్కుల తయారీ కోసం ‘టూ అండ్ హాఫ్’ సంస్థను స్థాపించారు.
పనిలోపనిగా సంచులు, గొలుసులు, చెవి పోగులు, చోకర్లు, జువెలరీ సెట్లు, క్లిప్పులు, ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ లాంటివీ రూపొందిస్తున్నారు. ఎక్కువ వాటికి పాత జీన్సే ముడిసరకు. ఇలా దాదాపు ఐదువేల మందికి ఉపాధి దొరికింది. తమ దగ్గర యాక్సె సరీలను రూ. 99 నుంచే అమ్ముతున్నామని చెబుతారు వ్యవస్థాపకుడు కౌశిక్ దాస్.