ఇద్దరు మిత్రులు. ఒకే ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తుంటారు. ఇద్దరి జీతం కూడా దాదాపు సమానమే! అయితే, ఇంటి రుణం కోసం వెళ్లినప్పుడు మాత్రం.. ఒకరికి అడిగినంతా లభిస్తుంది. మరొకరికి మొండిచెయ్యి ఎదురవుతుంది. అందుకు కారణాలు అనేకం ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఏదైనా లోన్ ఆమోదించే ముందు.. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు దరఖాస్తుదారులకు సంబంధించి అన్నిరకాల అంశాలను పరిశీలిస్తాయి. అందులో ఆదాయం ముఖ్యమైనదే అయినప్పటికీ, రుణాన్ని మంజూరు చేయాలంటే.. అదొక్కటే సరిపోదు. ప్రస్తుతం ఉన్న అప్పులు, గతంలోని రీపేమెంట్ విధానం, ఉద్యోగ స్థిరత్వం, వారి పూర్తి ఆర్థిక పరిస్థితిని కూడా అధ్యయనం చేస్తాయి.
ఇద్దరిలో ఒకరికి అప్పటికే కార్ లోన్, భారీగా క్రెడిట్ కార్డ్ బకాయిలు ఉంటాయి. మరొకరికి ఎలాంటి అప్పులు లేవు. అందుకే, ఇద్దరి ఆదాయాలు ఒకేలా ఉన్నప్పటికీ, రుణ సంస్థలకు రెండో వ్యక్తి మాత్రమే ఆర్థికంగా పటిష్ఠంగా కనిపిస్తాడు.
ఇక ప్రతి లోన్ వెనుక ఒక రీపేమెంట్ రికార్డు ఉంటుంది. మీరు ఈఎంఐలను ఎంత సకాలంలో చెల్లించారు? క్రెడిట్ కార్డులను ఎలా ఉపయోగించారు? పదేపదే ఏవైనా డిఫాల్ట్‌లు చేశారా? అనే విషయాలను బ్యాంకులు గమనిస్తాయి.
ఆదాయం ఎంత వస్తున్నది? అనేదానితోపాటు అది ఏ మార్గం ద్వారా సంపాదిస్తున్నారన్నది కూడా ముఖ్యం. ఒకే సంస్థలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న వ్యక్తితో పోలిస్తే.. తరచూ ఉద్యోగాలు మార్చే వ్యక్తిని బ్యాంకులు భిన్నంగా చూస్తాయి.
కొన్నేళ్ల కింద ఎప్పుడో ఓసారి పేమెంట్ ఆలస్యం అయినంత మాత్రాన లోన్ రిజెక్ట్ కాదు. కానీ, పదేపదే బకాయిలు చెల్లించని చరిత్ర ఉంటే మాత్రం.. ఆ విషయాన్ని బ్యాంకులు వదిలేయవు. కేవలం తమ రీపేమెంట్ చరిత్రను స్వచ్ఛంగా, ఎలాంటి మచ్చ లేకుండా ఉంచుకోవడం ద్వారానే.. చాలామంది లోన్ వచ్చే అవకాశాలను పెంచుకుంటారు.
జీతం వివరాల కంటే కూడా క్రెడిట్ కార్డ్ వినియోగ తీరుపైనే ఫైనాన్స్ సంస్థలు ఎక్కువ దృష్టి పెడతాయి. క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తాన్ని పూర్తిగా వాడేయడం, ఎప్పుడూ బకాయిలు ఉంచుకోవడం వంటివి ఆర్థిక ఇబ్బందులను సూచిస్తాయి. అయితే, లోన్ ఏ అవసరానికి తీసుకుంటున్నారనే దానితో సంబంధం లేకుండా, బిల్లులను సకాలంలో చెల్లించడం, కార్డును సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల బ్యాంకుల వద్ద మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది.
కాబట్టి, లోన్ అనేది శాలరీ స్లిప్పైన ఉండే జీతం అంకెల ఆధారంగా మాత్రమే ఖరారు అవ్వదు. రుణగ్రహీత మరో కొత్త ఆర్థిక బాధ్యతను ఎంత సులభంగా మోయగలడో అర్థం చేసుకోవడానికి బ్యాంకులు ప్రయత్నిస్తాయి. అది కేవలం ఒక్క అంశంపైనే ఆధారపడకుండా.. పలు రకాల అంశాల కలయికతో ముడిపడి ఉంటుంది. అందుకే, ఒకే విధమైన జీతం ఉన్న ఇద్దరు దరఖాస్తు దారులకు ఎల్లప్పుడూ ఒకే రకమైన ఫలితం రాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.