2022 ఉద్యోగ నామ సంవత్సరం. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ కొలువులకు పరీక్షలు పూర్తయ్యాయి.. గ్రూప్-1కు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. వచ్చే నెలలో పరీక్ష జరుగనున్నది.. మున్ముందు గ్రూప్-2, 3, 4 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. ఇవి గాక ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులూ భర్తీ కానున్నాయి.. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు కాంపిటీషన్ మరింత పెరగనున్నది.. పోటీపరీక్షల శిక్షణకు గతంలో హైదరాబాద్ కేంద్రంగా ఉండేది. ఉద్యోగార్థులు వ్యయప్రయాసలకోర్చి అక్కడికి వెళ్లి శిక్షణ పొందేవారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతమయ్యాయి. దీనిలో భాగంగా ఖమ్మం నగరంలోని ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు వేలాది మందికి ఉచితంగా పోటీపరీక్షలకు శిక్షణ ఇచ్చాయి. ప్రస్తుతం స్టడీ సర్కిళ్లలో గ్రూప్-1కు శిక్షణ పూర్తయింది. త్వరలో మరో ఫౌండేషన్ కోర్సు ప్రారంభం కానున్నది.
ఖమ్మం, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ ఉద్యోగం సాధించాలకునే షెడ్యూలు కులాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు వరంలా మారాయి. ప్రైవేటు శిక్షణ సంస్థల్లో వేలకు వేలు ఖర్చయ్యే శిక్షణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టడీ సర్కిళ్లలో ఉచితంగా అందుతున్నది. ఖమ్మంలోని బైపాస్ రోడ్డులోని బీసీ స్టడీ సర్కిల్, టీఎన్జీవోస్ కాలనీలోని ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ప్రస్తుతం వందలాది మంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్లో ఇప్పటివరకు 728 మంది శిక్షణ పొందగా 91 మంది, బీసీ స్టడీ సర్కిల్లో ఇప్పటివరకు 3,630 మంది శిక్షణ పొందగా 524 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.
సుమారు ఆరు నెలల పాటు శిక్షణ..
ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకుని ఎంపికైన వారికి స్టడీ సర్కిల్ నిర్వాహకులు సుమారు 5-6 నెలల పాటు పోటీపరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వందలాది మంది ఎస్సైలు, ఉపాధ్యాయులు, వార్డెన్లు, జూనియర్ లెక్చరర్లు, అటవీశాఖలో వివిధ విభాగాల్లో కొలువులు సాధించారు. ప్రస్తుతం రెండు స్టడీ సర్కిళ్లలో గ్రూప్-1 పోటీ పరీక్షలకు శిక్షణ పూర్తయింది. తర్వాత వచ్చే నోటిఫికేషన్లకు శిక్షణ ఇచ్చే విధంగా స్టడీ సర్కిల్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆరు నెలల ఫౌండేషన్ కోర్సు ప్రారంభం కానున్నది.
అభ్యర్థులకు భోజనం, వసతి సౌకర్యం..
ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ కాలనీలో 2016లో అప్పటి కలెక్టర్ లోకేశ్‌కుమార్ ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రారంభమైంది. ఆ ఏడాది స్టడీ సర్కిల్లో 50 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు శిక్షణ పొందారు. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ కొలువులు సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కో అభ్యర్థిపై రూ.30 వేల వరకు ఖర్చు చేస్తున్నది. మహిళలు, పురుషులకు వేర్వేరుగా వసతి, భోజన సదుపాయాలు ఉన్నాయి. నెలనెలా కాస్మొటిక్ చార్జీలు సైతం అందుతున్నాయి. బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు నెలనెలా ఉపకార వేతనం అందుతున్నది. బీసీ స్టడీ సర్కిల్ చదువుతున్న ఒక్కో అభ్యర్థిపై ప్రభుత్వం నెలనెలా రూ.16 వేల వరకు ఖర్చు చేస్తున్నది.
లైబ్రరీల్లో వేలాది పుస్తకాలు..
పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు స్టడీ సర్కిల్స్ వరంలా మారాయి. స్టడీ సర్కిళ్లలో గ్రూప్-1, 2, 3, 4తో పాటు వార్డెన్, పోలీస్ కానిస్టేబుల్, డీఎస్సీ, ఫారెస్ట్ తదితర పోస్టులకు అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. తొలుత 300 పుస్తకాలతో బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభమైంది. క్రమంగా ఆ సంఖ్య నేడు 2,500కు చేరుకున్నది. వీటిలో తెలుగు, ఇంగ్లిష్ విభాగాల్లో ఆర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, స్టాండర్డ్ జీకే, కరెంట్ ఎఫైర్స్, తెలంగాణ సంసృతి, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటం, ఇంగ్లిష్ మనోరమ, భారత రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్కు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఇవికాక తెలుగు, ఇంగ్లిష్ దిన పత్రికలు, వార, మాస, పక్ష పత్రికలు అందుబాటులో ఉన్నాయి. లైబ్రరీలో అభ్యర్థులు సులభంగా తమకు కావాల్సిన పుస్తకాలు తీసుకునే విధంగా స్టడీ సర్కిల్లో ప్రత్యేకంగా ర్యాక్స్, షెల్ఫ్స్ అందుబాటులో ఉన్నాయి. మారెట్లోకి ఏ కొత్త పుస్తకం వచ్చినా నిర్వాహకులు స్టడీ సర్కిల్‌కు కాపీలు సమకూరుస్తున్నారు. శిక్షణ తరగతులు పూర్తయిన తర్వాత అభ్యర్థులు లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నారు.
స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే స్టడీ సర్కిళ్లు బలోపేతం..
ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్నాయి. ప్రైవేటు శిక్షణ సంస్థల్లో డబ్బులు పెట్టి శిక్షణ తీసుకోలేని వారికి స్టడీ సర్కిళ్లు వరంలా మారాయి. నిష్ణాతులైన అధ్యాపకులు, సబ్జెక్ట్ నిపుణులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఖమ్మం నగరంలోని బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్లలో చదివిన ఎంతో మంది కొలువులు సాధించారు. ప్రభుత్వం ఉచితంగా స్టడీ సర్కిళ్లలో శిక్షణ ఇవ్వకపోతే కొలువులు సాధించే వాళ్లం కాదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు బలోపేతం అయ్యాయని కొనియాడుతున్నారు.
స్టడీ సర్కిళ్లకు ప్రత్యేక గుర్తింపు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టడీ సరిళ్లలో ఖమ్మం స్టడీ సర్కిళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. స్టడీ సర్కిళ్లలో కంప్యూటరీకరణ విధానంలో లైబ్రరీ నిర్వహణ ఉంది. ఒక్క క్లిక్‌తో ఏ పుస్తకం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు. మాన్యువల్ కేటలాగ్‌తో పాటు ఎలక్ట్రానిక్ కేటలాగ్ సైతం లైబ్రరీ అందుబాటులో ఉంది. గతంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, నంద్యాల వంటి ప్రాంతాలకు వెళ్లేవారు. అదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆర్థిక భారం. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లతో నిరుపేద అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందుతున్నది. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది అభ్యర్థులు కొలువులు సాధించి జీవితంలో స్థిరపడ్డారు.
అభ్యర్థులపై ప్రత్యేక శ్రద్ధ..
నేను గృహిణిని. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్నా. సబ్జెక్ట్ నిపుణులు సులువైన పద్ధతిలో మాకు సిలబస్ బోధిస్తున్నారు. స్టడీ సర్కిల్లో శిక్షణ అంటే ఎలా ఉంటుందో అని ఆందోళనపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక స్టడీ సర్కిల్ విలువ తెలిసింది. నిర్వాహకులు ప్రతి అభ్యర్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించారు. వారం వారం జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలతో మేం ఎంత నేర్చుకున్నామో తెలుస్తున్నది. పరీక్ష ఫలితాలు చూసుకుని మరింత శ్రద్ధగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాం.
– ఎం.స్వప్న, గ్రూప్-1 అభ్యర్థిని, ఖమ్మం
నిరుద్యోగులకు వరం..
స్టడీ సర్కిళ్ల నిర్వహణ విద్యార్థులకు వరం. నేను బీఎస్సీ (అగ్రికల్చర్) పూర్తి చేశాను. నేను ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో గ్రూప్-1కు ప్రిపేర్ అవుతున్నాను. స్టడీసర్కిల్‌లో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటున్నాను. స్టడీ సర్కిల్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందింది. ఇంత మంచి శిక్షణకు ప్రైవేటులో తీసుకుకోవాలంటే చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది. కానీ పైసా ఖర్చు లేకుండానే ఇక్కడ శిక్షణ పొందుతున్నాను.
– ఆర్.అనీల్, అభ్యర్థి, ఖమ్మం
శిక్షణ బాగుంది..
నేను స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా. శిక్షణకు ఎంపికయ్యా. రూపాయి ఖర్చు లేకుండా చదువుతున్నా. సబ్జెక్ట్ నిపుణులు సులువైన పద్ధతిలో బోధిస్తున్నారు. నేను గ్రూప్-1 సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నాను. ప్రైవేటు శిక్షణ కేంద్రాల్లో కంటే ఇక్కడ మెరుగైన శిక్షణ ఇస్తున్నారు.
– రవిచంద్రిక, గ్రూప్-1 అభ్యర్థిని, ఖమ్మం
ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉంది..
స్టడీ సర్కిల్లో మాకు నాణ్యమైన శిక్షణ అందుతున్నది. అధ్యాపకులు, సబ్జెక్ట్ నిపుణులు మెరుగైన శిక్షణ ఇస్తున్నారు. మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అర్థం కాని విషయాలను తిరిగి బోధిస్తున్నారు. అనుభవజ్ఞులే ఇక్కడ ఫ్యాకల్టీగా ఉన్నారు. ఈసారి తప్పకుండా కొలువు సాధిస్తాననే నమ్మకం వచ్చింది. గ్రూప్-1 సాధించి డీఎస్పీ కావడం నా లక్ష్యం.
– కె.రాకేశ్, గ్రూప్-1 అభ్యర్థి, పందిళ్లపళ్లి
అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ
బీసీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తున్నాం. నేటి పోటీ ప్రపంచానికి దీటుగా సబ్జెట్ నిపుణులు సిలబస్ బోధిస్తున్నారు. ప్రభుత్వం దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లు గొప్ప వరం.
– జి.శ్రీలత, డైరెక్టర్, బీసీ స్టడీ సరిల్, ఖమ్మం
ఉద్యోగాల సాధనే ధ్యేయంగా..
నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించే విధంగా స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తున్నాం. ప్రైవేటు శిక్షణ సంస్థల కంటే దీటుగా ఇక్కడ సబ్జెట్ నిపుణులు సిలబస్ చెప్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వెనుకబడిన వర్గాలకు స్టడీ సర్కిళ్లు వరం. అభ్యర్థులు వారం వారం పరీక్షలు రాస్తున్నారు. వారి సామర్థ్యాలను పెంచుకుంటున్నారు.
– వీరభద్రం, ఎస్సీ స్టడీ సర్కిల్ గౌరవ సలహాదారుడు