Yoga | నిద్రలేచించే తడవుగా ఉరుకులు పరుగుల జీవితం. శరీరానికి వ్యాయామం లేకుండా నిత్య పనుల్లో నిమగ్నం. చిన్నారులు, విద్యార్థులు పుస్తకాలతో పాఠశాల, కళాశాలల బాట పడుతుండగా.. యువత, పెద్దలు వారి వారి వృత్తుల్లో లీనమయ్యేందుకు పయనం. పొద్దంతా బెంచీలు, కుర్చీలకు పరిమితమై అలసటతో సాయంత్రం ఇంటిదారి పట్టడం. ఇదంతా నిత్యకృత్యం. వ్యాయామమెరుగని శరీరాలు ఆకృతులు మారుతూ.. వయసును మించిన కాయంతో అవస్థలు పడటం. వివిధ రుగ్మతలతో ఆస్పత్రుల చుట్టూ తిరగడం. వీటన్నింటికీ స్వస్తి చెప్పాలంటే ఒక్కటే మార్గం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. మీ శరీరం విల్లులా వంగాలన్నా.. అలసట ఎరుగకుండా రోజంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా పనిచేయాలన్నా యోగా ఒక్కటే బ్రహ్మాస్త్రమంటున్నారు పలువురు సాధకులు.
ఆరోగ్యంపై అవగాహన కలిగిన ప్రతీ ఒక్కరు యోగా చేసేందుకు మక్కువ చూపుతున్నారు. నిత్య జీవితంలో వ్యాయామం లేక, పని ఒత్తిడితో మానసికంగా నలిగిపోతున్న వారు యోగాకి జై కొడుతున్నారు. యోగా అంటే.. మానవుని అనంతమైన మేథాశక్తి, ఆత్మశక్తిల కలయిక. విజ్ఞాన శాస్త్రం ప్రకారం.. పరిపూర్ణ జీవన సార విధానం. ఇందులో జ్ఞానయోగం, భక్తియోగం, రాజయోగం, కర్మయోగాలున్నాయి. యోగాసనాలు అంటే.. రాజయోగ ప్రక్రియలో పైన చెప్పిన యోగాలన్నింటిలో సమతుల్యాన్ని, ఏకత్వాన్ని తీసుకొస్తాయి. యోగా అనేది మన జీవితంలో అంతర్భాగమే. మనిషి జన్మించినప్పటి నుంచి చేస్తున్న నిత్య ప్రక్రియే. పసి పిల్లలను చూస్తే.. వారు రోజు మొత్తంలో మకరాసనం, పవన ముక్తాసనం ఎన్నోసార్లు వేస్తూనే ఉంటారు.
ఆసనాల్లో రకాలు..
యోగాసనాల్లో అనేక రకాలున్నా.. ఒక్కోటి ఒక్కో ఫలితాన్నిస్తుంది. శ్రీశ్రీయోగా అనేది మూడు నుంచి ఐదు రోజుల వ్యవధిలో జరిగే 10 గంటల కార్యక్రమం. ఆరోగ్యకరమైన శక్తిని పుంజుకునే అనుభూతి. ఇది సులభమైన, కష్టతరమైన శ్వాసప్రక్రియతో కూడిన విధానం. దీనిద్వారా శారీరక, మానసిక సమతుల్యం ఏర్పడుతుంది. దీనిని విద్యార్థులు ఇంటి వద్ద కూడా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారికి, రోజూ సాధన చేసుకునే వారికి, అన్ని రకాల వయసుల వారికి ఉపయోగపడుతుంది.
పలువురు తమ అనుభూతులను వివరిస్తూ.. ఎంతో సంతోషంగా, ఆతృత తగ్గి, ఓర్పు పెరిగి, కుశలబుద్ధి కలిగి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందినట్లు చెప్పారు. సాధన చేస్తున్నకొద్దీ ఆసనాల వెనుక ఉన్న అంతరార్థం అవగాహనకు వస్తుంది. ఆసనంలో ఉంటూనే బాహ్యకరమైన శారీరక క్రమం నుంచి అంతరంగిక అనుభూతికి లోనవుతారు. ప్రాణాయామం అంటే.. శ్వాసమీద పట్టు సాధించడం, శ్వాసను పీల్చే శక్తిని పెంచడం, సరైన శ్వాస ప్రక్రియ శరీరంలోని అధిక ప్రాణవాయువును రక్తంలోకి, మెదడులోకి ప్రసరింపజేసి ప్రాణశక్తిని పెంపొందిస్తుంది. ఇది అనేక యోగాసనాలు వేయడానికి దోహదపడుతుంది.
యోగాపై మక్కువ..
కొత్తగూడెం పట్టణంలో పలువురు యోగాపై శిక్షణ పొందేందుకు, ఆసనాలు వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు పలుచోట్ల యోగాలో శిక్షణ పొందుతున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పాత బస్‌డిపో సమీపంలో ఉన్న సూర్యోదయ పాఠశాలలో 16 ఏళ్ల నుంచి మార్తాండ నరసింహన్ పలువురికి ఉచితంగా యోగాపై శిక్షణ ఇస్తున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచి సింగరేణి సహకారంతో యోగాలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2007, నవంబర్ 3 నుంచి ఇక్కడ యోగాలో శిక్షణ ప్రారంభించారు. తొలుత 15 మందితో ప్రారంభమైన కేంద్రంలో సుమారు వంద మంది విడతల వారీగా శిక్షణ పొందుతున్నారు. రోజూ ఉదయం 5 నుంచి 6 గంటల వరకు సుమారు 100 మంది వరకు శిక్షణ పొందుతారు.
యోగాసనాలు- వాటి ఉపయోగాలు
యోగాసనాలతో పలు రకాల ఉపయోగాలున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం.
25 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నా..
25 ఏళ్లుగా యోగాలో పలువురికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాను. సింగరేణి సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందాను. నాకు తెలిసిన యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం అందించాలని కృషి చే స్తున్నాను. ప్రస్తుత జీవన విధానంలో యోగా అందరికీ అవసరం. ఎవరికైనా యోగాపై ఆసక్తి ఉంటే నన్ను సంప్రదించవచ్చు. ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు.
– మార్తాండ నరసింహన్, యోగా గురువు
పదేళ్లుగా నేర్చుకుంటున్నా..
వ్యాపార రంగంలో ఉండటంతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో వెసులుబాటు కల్పించుకుని యోగాలో శిక్షణ తీసుకుంటున్నాను. దీనివల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో ఉత్సాహంగా ఉంటున్నాను. ఎప్పుడైనా ఒకరోజు శిక్షణ తీసుకోకపోతే ఆ రోజంతా ఎలాగో ఉంటుంది.
–రమేష్
ఆరోగ్యానికి యోగా అవసరం
దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా యోగా ఆరోగ్యాన్ని ఇస్తుం ది. రోజూ ఒక పనిగా యోగా చేస్తే షుగర్, బీపీ వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. పాఠశాల యాజమాన్యం యోగా శిక్షణకు అనుమతినివ్వడం అభినందనీయం. యోగా మాస్టర్ మాకు ఉచితంగా యోగాసనాలు నేర్పించడం సంతోషంగా ఉంది.
– బోగా శ్రీనివాస్
జ్ఞాపకశక్తిని పెంచుతుంది
యోగా సాధన వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెద డు చురుకుగా పని చేస్తుంది. మేథాశక్తి ఎక్కు వ అవుతుంది. ముఖ్యం గా విద్యార్థులు యోగా సాధన చేయడం వల్ల చదువుపై ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులు చిన్నప్పటి నుంచి యోగా సాధన చేస్తే భవిష్యత్తులో మంచి ఉపయోగాలు ఉంటాయి.
– పి.కల్యాణి