బడిబాటకు శ్రీకారం
సర్కారు బడుల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు బడిబాట కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను వెతికివెతికి మరీ తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి. ఈ మేరకు ప్రత్యేక బృందాలను నియమించి జల్లెడ పడుతున్నాయి.
- నేటి నుంచి ఇంటింటి ప్రచారం
- 54 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్
- 19 వరకు కార్యక్రమం నిర్వహణ
ఖమ్మం, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు బడుల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు బడిబాట కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను వెతికివెతికి మరీ తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి. ఈ మేరకు ప్రత్యేక బృందాలను నియమించి జల్లెడ పడుతున్నాయి. తమ పాఠశాలల్లో అందిస్తున్న విద్యను వివరిస్తూ, రాయితీల వల విసురుతూ చిన్నారుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో నాణ్యమైన విద్య అందుకున్న ప్రభుత్వ పాఠశాల్లోనూ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 6 నుంచి 19 వరకు విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ప్రభుత్వం ఏటా ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ 2024-25 విద్యా సంవత్సరంలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో ప్రధానంగా తొలుత పంచాయతీల ఆధారంగా స్కూల్ వయసు కలిగిన పిల్లలను గుర్తిస్తారు. ప్రభుత్వ విద్య నాణ్యతను, ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరిస్తారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరతారు. అలాగే, స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, ఆరు తరగతి విద్యార్థులను ప్రధానంగా చేర్చుకుంటుంటారు. పెద్దల సహకారంతో బడి బయటి పిల్లల వివరాలు నమోదు చేసుకుంటారు. వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను సర్కారు బళ్లలో చేర్పిస్తారు.
షెడ్యూల్ ఇలా..
బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6న సమావేశం నిర్వహించనున్నారు. పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులతో సన్నాహక సమావేశం నిర్వహిస్తారు. 7 నుంచి 10 వరకు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తారు. బడిబాటతోపాటే పాఠశాల నుంచే వెళ్లే విద్యార్థుల టీసీలు సిద్ధం చేస్తారు. అంగన్వాడీ విద్యార్థుల వివరాలను తీసుకుని వారిని దగ్గరల్లోని పాఠశాలల్లో చేర్పిస్తారు. 11న గ్రామసభ నిర్వహించి జయశంకర్ బడిబాటపై చర్చిస్తారు. పాఠశాలల ప్రారంభం కోసం 12న స్కూళ్లను సుందరంగా తీర్చిదిద్దుతారు. పండుగ వాతావరణంలో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తారు. విద్యార్థులకు పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం అందజేస్తారు. 13న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్‌పై కార్యక్రమం, 14న సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం, 15న బాలికా విద్యపై కేజీబీవీల్లో కార్యక్రమం, 18న డిజిటల్ తరగతులపై అవగాహన కార్యక్రమం, 19న క్రీడోత్సవం నిర్వహిస్తారు. ఈ తేదీతో బడిబాట కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.
కలెక్టర్ పర్యవేక్షణ
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక పరిపాలన, కార్మిక, వైద్య, సంక్షేమ శాఖల అధికారులు, మహిళా సమాఖ్య బాధ్యులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. బడిబాట విజయవంతానికి సూచనలు చేయనున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ వంటివి 10లోపు పూర్తయ్యేలా చర్యలు చేపట్టనున్నారు.
54 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్
జిల్లాలోని 54 స్కూళ్లలో విద్యార్థులు లేరని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేందుకు నిర్వహించే సర్వేలో మాత్రం విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. కానీ.. విద్యాసంవత్సరం ముగిసే సమయానికి విద్యార్థులు ఉండడం లేదంటూ విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. అలాగే, జిల్లాలో ఉపాధ్యాయులు లేని స్కూళ్లు, ఒకే ఉపాధ్యాయుడు ఉన్న స్కూళ్లు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఇటీవల హెచ్ఎంలు, టీచర్లు కూడా ఉద్యోగ విరమణ పొందడంతో ఏర్పడిన ఖాళీలు కూడా అలాగే ఉన్నాయి. వీటన్నింటి మధ్యనే బడిబాట కార్యక్రమంతోపాటు విద్యాసంవత్సరం కూడా ప్రారంభమవుతుంది.
టీచర్లను సర్దుబాటు చేస్తాం..
ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో డిప్యుటేషన్ ద్వారా టీచర్లను సర్దుబాటు చేస్తాం. ఇతర పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను నియమిస్తాం. 54 పాఠశాలల్లో విద్యార్థులు లేరు. వాటిల్లో విద్యార్థులను చేర్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాం. బడిబాటను విజయవంతం చేస్తాం. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తొలిరోజే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేస్తాం.
-సోమశేఖర శర్మ, డీఈవో, ఖమ్మం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

