ఖమ్మంలో కాంగ్రెస్ విజయం
ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 4,67,847 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మం లోక్‌సభ స్థానానికి మే 13న ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది.
- అత్యధిక మెజారిటీతో ‘రఘురాంరెడ్డి’ గెలుపు
- ధ్రువపత్రం అందజేసిన ఖమ్మం కలెక్టర్ గౌతమ్
- పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ
ఖమ్మం, జూన్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 4,67,847 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మం లోక్‌సభ స్థానానికి మే 13న ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియతో ప్రారంభమైన కౌంటింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రతి రౌండ్లోనూ హోరాహోరీగా పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి ఆయా నియోజకవర్గాల్లో ఆధిక్యం లభించింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేసి లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 1,490 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి 7,326 ఓట్లు, బీజేపీ అభ్యర్థి వినోద్‌రావుకు 1,561 ఓట్లు లభించాయి. కొందరు స్వతంత్ర అభ్యర్థులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లభించాయి.
నోటాకు 6,657 ఓట్లు..
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. లెక్కింపు పూర్తయ్యాక కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి 7,66,929 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు 2,99,082 ఓట్లు, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు 1,18,636 ఓట్లు లభించాయి. ఈ మూడు పార్టీల ప్రధాన అభ్యర్థుల తరువాత అత్యధికంగా నోటాకు 6,657 ఓట్లు పడ్డాయి.
ఆర్వో పర్యవేక్షణ..
ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఆసాంతం రిటర్నింగ్ అధికారి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షించారు. సీపీ సునీల్‌దత్ భద్రతా చర్యలను పర్యవేక్షించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఉదయం ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. కౌంటింగ్ ముగిసిన అనంతరం విజయం సాధించిన రఘురాంరెడ్డికి ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హోదాలో గెలుపు ధ్రువపత్రం అందజేశారు. అనంతరం తన విజయానికి కృషిచేసిన ఆ పార్టీ శ్రేణులకు, తనకు అపూర్వ విజయాన్ని అందించిన ఓటర్లకు, సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు, తన పార్టీకి ఇంతటి విజయాన్ని అందించిన నియోజకవర్గ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తానని అన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఈ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందని, నియోజకవర్గ ప్రజలు ఎంపీగా గెలిపించిన రఘురాంరెడ్డి.. ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటారని అన్నారు.
ఒక్కో టేబుల్‌కు ముగ్గురు అధికారులు..
ఓట్ల లెక్కింపు కేంద్రంలో రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్, ముగ్గురు అదనపు రిటర్నింగ్ అధికారులతోపాటు ఒక్కో టేబుల్‌కు ముగ్గురు చొప్పున అధికారులను నియమించారు. ఖమ్మం శాసనసభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కోసం 18 టేబుళ్లను, మిగిలిన ఆరు శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 1,896 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఈవీఎంలలోని ఓట్లను 115 టేబుళ్ల ద్వారా లెక్కించారు. తొలుత ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం పాపటపల్లి గ్రామ ఓట్లతో మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట మండలం కావడిగూడ గ్రామ ఓట్ల లెక్కింపుతో ముగిసింది.
రఘురాంరెడ్డికి ధ్రువపత్రం అందజేసిన ఆర్వో
ఖమ్మం రూరల్, జూన్ 4: లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఖమ్మం స్థానం నుంచి విజయం సాధించిన రామసహాయం రఘురాంరెడ్డికి ఎంపీగా గెలుపొందిన ధ్రువపతాన్ని రిటర్నింగ్ అధికారి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అందజేశారు. ఖమ్మం రూరల్ మండలం శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఫలితాల లెక్కింపు అనంతరం విజేతగా నిలిచిన రఘురాంరెడ్డికి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు మట్టా రాఘమయి, మాలోత్ రాందాస్‌నాయక్, జారె ఆదినారాయణ, ఎన్నికల పరిశీలకులు డాక్టర సంజయ్ జీ కోల్టే, ప్రేదిమాన్ కృష్ణన్ భట్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ కలెక్టర్ మిర్నల్ శ్రేష్టా, ఇతర అధికారులు ఎం.రాజేశ్వరి పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి ఇలాఖాలో బీజేపీ ఆధిక్యం
పెనుబల్లి, జూన్ 4 : ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జరిగిన లెక్కింపులో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం నారాయణపురంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు.. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిపై 174 ఓట్లు ఆధిక్యం సాధించారు. గ్రామంలోని 94వ బూత్‌లో బీజేపీ అభ్యర్థి వినోద్‌రావుకు 404 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి 315 ఓట్లు వచ్చాయి. 95వ బూత్‌లో బీజేపీ అభ్యర్థి వినోద్‌రావుకు 197 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి 112 ఓట్లు వచ్చాయి. మొత్తం బీజేపీ అభ్యర్థికి 174 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే, బీజేపీ జాతీయ నాయకుడైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్వగ్రామం కూడా ఇదే కావడం, మంత్రి పొంగులేటికి కూడా సుధాకర్‌రెడ్డి బంధువు కావడం గమనార్హం. దీంతో సుధాకర్‌రెడ్డి కూడా ప్రతిష్ఠాత్మకంగా భావించడంతో అతడి స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యం లభించింది. అయితే, సాక్షాత్తూ మంత్రి పొంగులేటి స్వగ్రామంలోనే బీజేపీకి ఆధిక్యం రావడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

