– అనారోగ్య కార్మికులను ఇబ్బందిపెట్టొద్దు
– గతంలో మాదిరిగా ఇన్వాలిడేషన్ చేసి కార్మిక కుటుంబాలకు అండగా నిలవాలి
– ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య
రుద్రంపూర్, అక్టోబర్ 06 : సింగరేణిలో మెడికల్ అటెండెన్స్ నిబంధనలను వెంటనే మార్చి, అనారోగ్య కారణాలతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు గతంలో మాదిరిగానే ఇన్వాలిడేషన్ చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య యాజమాన్యాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనారోగ్య కారణాలతో పలువురు కార్మికులు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, తమ వంతు వచ్చినప్పుడు బోర్డుకు హాజరయ్యేందుకు భయపడుతున్నారని తెలిపారు. అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ ‘ఫిట్ ఫర్ సేమ్ జాబ్’ అంటూ పంపిస్తున్నారనే ఆందోళన కార్మికుల్లో ఉందన్నారు. దీంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. గతంలో అనారోగ్యంతో విధులు నిర్వహించలేని కార్మికులను వివిధ రకాల అనారోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఇన్వాలిడేషన్ చేసి, వారి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించే విధానం ఉండేదని గుర్తు చేశారు. అదే విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
మెడికల్ బోర్డుకు 100 మంది హాజరైతే అందులో కనీసం 10 శాతం మందిని కూడా ఇన్వాలిడేషన్ చెయ్యని పరిస్థితి కార్మికుల్లో ఆందోళనకు కారణమవుతోందన్నారు. తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన కార్మికులను సైతం బోర్డు చుట్టూ తిప్పకుండా, గతంలో ఏరియా ఆసుపత్రుల్లో సీఏంఓ పరిధిలోని వైద్యుల ద్వారా ఇన్వాలిడేషన్ చేసిన విధానాన్ని అమలు చేయాలని కోరారు.29.01.1981లో మనుబోతుల కొమరయ్య ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాల కల్పనపై కుదిరిన ఒప్పంద స్ఫూర్తిని యాజమాన్యం కొనసాగించాలని మిరియాల రంగయ్య కోరారు. మెడికల్ ఇన్వాలిడేషన్ పేరుతో గతంలో కార్మికులను మధ్యవర్తుల ద్వారా గందరగోళానికి గురిచేసిన పరిస్థితులు పునరావృతం కాకుండా పారదర్శక విధానం అమలు చేయాలని సూచించారు.అనారోగ్యంతో మంచానికే పరిమితమైన కార్మికులను మెడికల్ బోర్డు వరకు వేచి ఉండేలా చేయకుండా,
గతంలో మాదిరిగా ప్రధాన ఆసుపత్రి ముఖ్య వైద్య అధికారి పరిధిలో వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసి, వైద్య పరీక్షలు నిర్వహించి ఇన్వాలిడేషన్ చేయాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో మ్యాన్‌పవర్ సర్ప్లస్ ఉందని యాజమాన్యం చెబుతున్నప్పటికీ, ఏ ఏరియాలోనూ వాస్తవంగా సర్ప్లస్ మ్యాన్‌పవర్ లేదని మిరియాల రంగయ్య అన్నారు.అనారోగ్యంతో విధులు నిర్వహించలేని కార్మికులను ఇన్వాలిడేషన్ చేసి వారి డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పిస్తే యువతకు ఉపాధి లభించడంతో పాటు కార్మిక కుటుంబాలకు భరోసా కలుగుతుందని తెలిపారు.కార్మికుల ఆరోగ్యం, కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెడికల్ అటెండెన్స్ నిబంధనలను తక్షణమే సవరించి, గతంలో అమలు చేసిన విధానాన్ని పునరుద్ధరించాలని రంగయ్య డిమాండ్ చేశారు.