Underpass must | శంకరపట్నం, అక్టోబరు 4 : శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు-గొల్లపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి-563పై అండర్‌పాస్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ రెండు గ్రామాల ప్రజలు ఆదివారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయం సమీపంలోని టోల్గేట్ వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా దాదాపు గంటన్నర పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హుజూరాబాద్ నుంచి చెంజర్ల వరకు ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా రెండు గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో నడిరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అండర్‌పాస్ నిర్మాణంపై గతంలో అధికారులు హామీలు ఇచ్చి అమలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న హుజూరాబాద్ టౌన్, రూరల్ సీఐలు శ్రీనివాస్, కరుణాకర్, సైదాపూర్ ఎస్ఐ స్వాతి, శంకరపట్నం ఎస్ఐ సంపత్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కొత్తగట్టు సర్పంచ్ మాడ సుజాత-రాజిరెడ్డితో హుజూరాబాద్ ఆర్డీవో ఫోన్లో మాట్లాడి, కొత్తగట్టు-గొల్లపల్లి గ్రామాల మధ్య అండర్‌పాస్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. అనంతరం ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్ధీకరించారు.