Suicide Attempt | గంగాధర, అక్టోబర్ 4 : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయపల్లి గ్రామ సర్పంచ్ మల్యాల తిరుపతి అలియాస్ వినయ్ సాగర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘం, బీఆర్ఎస్ నాయకుడు గడ్డం స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండాయిపల్లి దళిత సర్పంచ్ వినయ్ సాగర్‌పై జరిగిన కుల దూషణ, రాజకీయ వేధింపులను తీవ్రంగా ఖండించారు. కొండయ్య పల్లి గ్రామ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న దళిత బిడ్డను కాళ్లు మొక్కే జాతి అంటూ అవమానించి, మూడు గంటల పాటు వాట్సాప్ గ్రూప్ లో టార్గెట్ చేసి వేధించారని, అక్రమ కేసులు పెట్టించి, ఆత్మహత్యాయత్నం వరకు తీసుకు వెళ్లడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆయన అనుచరులే వేధింపులకు కారణమని బాధితుడు స్వయంగా లేఖలో పేర్కొనడం వేధింపులకు అద్దం పడుతుందని పేర్కొన్నారు. సర్పంచ్ వినయ్ సాగర్ లేఖ ఆధారంగా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కులం పేరుతో దూషించిన సర్పంచులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు, సర్పంచ్ కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. యావత్ దళిత సమాజం సర్పంచ్ వినయ్ సాగర్ కు అండగా ఉంటుందని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు దళిత సంఘాలు పోరాటం చేస్తాయని హెచ్చరించారు.