Jagityal | జగిత్యాల, అక్టోబర్ 6 : జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలానికి చెందిన బాదే బుచ్చమ్మ (85) అనే అనారోగ్యంతో భాద పడుతున్న వృద్ధ తల్లిని కన్న కొడుకు రాజేందర్ నిరాదరిస్తూ పోషణ వైద్య ఖర్చులు పెట్టక గెంటి వేయగా జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించింది. కాగా సీనియర్ సిటిజెన్స్ ప్రతినిధులతో వెళ్లి మంగళవారం ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా వయో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆ వృద్ధ తల్లి సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో తన గోడు విలేకరులకు వినిపించారు. తన కొడుకు తన మరణించిన భర్త హన్మంత్ కట్టిన ఇల్లు, మరో 3 గుంట ల భూమిని తన పేరిట బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకొన్నప్పటికీ తనను నిరాదరిస్తూ పోషణ, వైద్య ఖర్చులు పెట్టక ఇంట్లోంచి వెళ్లగొట్టి ఎక్కడైనా చావుపో అంటే తన కూతురు వద్ద ఉంటున్నానని రోధించింది.
తన ఇంటిలో తనను ఉంచి, అనారోగ్యంతో ఉన్న ముసలి వయస్సులో సేవలు చేయడానికి ఒక అడ పని మనిషిని పెట్టించి, కన్న కొడుకు నుంచి వైద్య, పోషణ ఖర్చుల కోసం ప్రతీ నెలా రూ.20 వేలు ఇప్పించాలని సీనియర్ సిటిజెన్స్ సంఘాన్ని ఆశ్రయించి ఆర్డీవో కు ఫిర్యాదు చేశారు. కాగా కొడుకుపై కేసు నమోదు చేశారని, ఎస్పీకి సైతం ఫిర్యాదు చేస్తానని ఆ వృద్ధ తల్లి విలేకరుల ముందు ఏడుస్తూ చెప్పింది. ఆ వృద్ధ తల్లి వెంట ఆమె కూతురు, జిల్లా సీనియర్ సిటిజెన్స్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్, జిల్లా కార్యదర్శి గౌరి శెట్టి విశ్వనాథం, కాన్సిలియేషన్ అధికారి పీ హన్మంత్ రెడ్డి తదితరులున్నారు.