Ramagundam | రణరంగంగా రామగుండం.. కేటీఆర్ ఆనవాళ్ల కూల్చివేతపై భగ్గుమన్న బీఆర్ఎస్
రామగుండం రణరంగంగా మారింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆనవాళ్లను చెరిపేసేందుకు బుల్డోజర్ దూసుకొచ్చింది. పునాదులతో సహా పెకిలించేందుకు ఉపక్రమించింది.
- 2023 మే 8న నిర్మించిన పైలాన్ ను స్వయంగా ప్రారంభించిన కేటీఆర్
- ఆ ఆనవాళ్లు కనిపించొద్దని గ్యాస్ కట్టర్లతో తొలగింపు
- మాజీ ఎమ్మెల్యే ‘కోరుకంటి’ నేతృత్వంలో ఆరు గంటల ఆందోళన
- అష్ట దిగ్బంధనంతో ముఖ్య నాయకుల అరెస్టు
- రామగుండం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
- పోలీస్ వాహనంలో రహస్య ప్రాంతాలకు తరలింపు
- కార్యకర్తలకు, పోలీస్ బలగాలకు మధ్య తీవ్ర తోపులాట

Ramagundam | కోల్ సిటీ, నవంబర్ 3 : రామగుండం రణరంగంగా మారింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆనవాళ్లను చెరిపేసేందుకు బుల్డోజర్ దూసుకొచ్చింది. పునాదులతో సహా పెకిలించేందుకు ఉపక్రమించింది. సాధ్యం కాకపోవడంతో గ్యాస్ కట్టర్లతో పైలాన్ ను కూల్చివేసింది. క్రేన్ సాయంతో తరలించేందుకు సిద్ధం కాగా, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో రాష్ట్ర నాయకులు మూల విజయా రెడ్డి, వ్యాల్ల హరీష్ రెడ్డి, కౌశిక హరి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, కార్పొరేటర్లు, కార్యకర్తలు తరలివచ్చి అడ్డుకోవడంతో అట్టుడికింది. సుమారు ఆరు గంటల పాటు మండుటెండల్లో నడి రోడ్డుపై క్రేన్ కు అడ్డుగా ముఖ్య నేతల బైఠాయింపుతో అలజడి వాతావరణం నెలకొంది. పోలీసులు అనేక నాటకీయ పరిణామాల మధ్య పైలాన్ ను తరలించేందుకు ప్రయత్నించినా కోరుకంటి చందర్ ససేమిరా అంటూ భీష్మించుకొని కూర్చున్నారు. పైలాన్ ను యథాస్థానంలో ఉంచాలనీ, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసులు అన్ని విధాలుగా ప్రయత్నించి చూశారు.
ఆలస్యం చేస్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు మరింత ఆగ్రహోదగ్రులయ్యారు. ఆరు గంటల ఆందోళన అనంతరం నాటకీయంగా పైలాన్ ను యథాస్థానంలోనే ఉంచుతామని కొలిక్కి వచ్చినట్లు నమ్మించారు. ఆందోళనకారులు కొంత శాంతించడంతో ఇదే అదనుగా మళ్లీ రంగంలోకి దిగి పైలాన్ ను తరలిస్తుండగా ముఖ్యనేతలు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపి ఆందోళనకారులను చెదరగొట్టారు. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఆఖరికి అష్టదిగ్బంధనం ప్రయోగించి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర నాయకులు మూల విజయారెడ్డి, వ్యాల్ల హరీష్ రెడ్డి , కౌశిక హరి, ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, మారుతిలను బలవంతంగా వేర్వేరు వాహనాల్లో ఎక్కించి జైపూర్, కమాన్‌పూర్ తదితర ప్రాంతాలకు తరలించారు. ఈ పరిణామాలతో గోదావరిఖని నగరం అట్టుడికిపోయింది.
రామగుండంలో కేసీఆర్ అభివృద్ధికి గుర్తుగా పైలాన్
కాగా, తొలి సీఎం కేసీఆర్ హయాంలో రామగుండంలో జరిగిన అభివృద్ధికి చిహ్నంగా 2023, మే 8వ తేదీన గోదావరిఖని గాంధీనగర్ చౌక్ వద్ద రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పైలాన్ ను నిర్మించారు. నగర పాలక పరిధిలో రూ.112.65 కోట్ల నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులను అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ సందర్భంగా గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన స్టీల్ పైలాన్ ను కూడా అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్, చీఫ్ విప్ భానుప్రసాద రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సమక్షంలో ప్రారంభించారు. కేసీఆర్, కేటీఆర్ అభివృద్ధికి ఆనవాళ్లుగా ఆ పైలాన్ నిలిచింది.
ఆనవాళ్లను పెకిలించేందుకు కుట్ర
మూడేళ్లుగా గోదావరిఖని నడివొడ్డున కేసీఆర్ అభివృద్ధికి ఆనవాలుగా ఉన్న పైలాన్ ను నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసు బలగాలతో కలిసి మంగళవారం ఉదయం 9 గం.లకు తొలగించేందుకు బుల్డోజర్ ను రంగంలోకి దించారు. దీనితో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర నాయకులు మూల విజయారెడ్డి, వ్యాల్ల హరీష్ రెడ్డి , కౌశిక హరి, ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, కార్పొరేటర్ తోకల శ్యామణి రమేష్, ఆకారపు రేఖ మహేష్, మాజీ కార్పొరేటర్ కృష్ణవేణితోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అధికారులు, పోలీసులతో వాగ్వాదంకు దిగారు. అప్పటికే గ్యాస్ కట్టర్ తో పైలాన్ కత్తిరించారు. క్రేన్ కు తాళ్లతో కట్టి తరలిస్తుండగా బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు.
తొలి సీఎం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసేందుకు ఇంత కుట్రలకు పాల్పడటం సిగ్గుచేటని ఆగ్రహించారు. కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా మిన్నంటిన నినాదాలు చేశారు. సుమారు ఆరు గంటల పాటు మండుటెండల్లో రోడ్డుపైనే ఆందోళన కొనసాగించారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్.ఐలు, సీఐలు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఇన్‌ఛార్జి ఏసీపీ నవీన్ అనేక మంతనాలు జరిపారు. నగర పాలక కమిషనర్ అరుణశ్రీతో ఫోన్ లో మాట్లాడించి రెండు మూడు రోజుల్లో మరో చోట ఏర్పాటు చేస్తామని చెప్పించారు. పైలాన్‌ను ఇంచు కదిలించినా జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని చందర్ హెచ్చరించారు. అధికారుల వైఖరిపై నిప్పులు చెరిగారు. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం అంటూ నినదించారు. రాష్ట్రంలో రేవంత్, రామగుండంలో రాజ్ ఠాకూర్ రాక్షస పాలన నడుస్తుందని ధ్వజమెత్తారు. పైలాన్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కారణంగా చెప్పగా, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద ఇందిరా గాంధీ విగ్రహం వల్ల కూడా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి కదా అని దీటుగా సమాధానం చెప్పారు.
అష్టదిగ్బంధనం.. అంతలోనే తీవ్ర ఉద్రిక్తత
ఇక తప్పదని పైలాన్ యథాస్థానంలోనే ఉంచుతామని చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు శాంతించారు. అప్పటికీ నమ్మకం లేదంటూ అక్కడే ఉండిపోయారు. అంతలోనే అష్ట దిగ్బంధనం ప్రయోగించారు. అదనపు పోలీస్ బలగాల సాయంతో ముఖ్య నేతలను బలవంతంగా అరెస్టు చేసి వేర్వేరు వాహనాల్లో కమాన్‌పూర్, జైపూర్, ఇతర రహస్య ప్రాంతాలకు తరలించారు. ఆ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కార్యకర్తలను చెదరగొట్టడంతో చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయి. కొంతమంది బట్టలు చిరిగి, కాళ్ల చెప్పులు చెల్లా చెదురుగా పడ్డాయి. గోదావరిఖని వన్ ఠాణాకు చేరుకొని కార్యకర్తలు బైఠాయించారు. తమ నాయకులను ఎక్కడ ఉంచారో చూపించాలని పట్టుబట్టారు.
రామగుండం ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం
ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. ఆందోళన ప్రదేశంలోనే క్రేన్ ఎదుట రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయనీ, కేసీఆర్ ఆనవాళ్ల జోలికి వస్తే ఇక యుద్ధం తప్పదని చందర్ హెచ్చరించారు. ప్రతీ రోజూ దశలవారీగా ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- demolition
- Godavarikhani
- KCR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

